ఎయిర్ పోర్టులో విదేశీ మహిళ బ్యాగ్ లో రూ. 30 కోట్ల డ్రగ్స్, స్టార్ హోటల్ లో మేడమ్ !
బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరులో నిత్యం డ్రగ్స్, గంజాయి, మత్తుపదార్థాలు విక్రయించే వాళ్లు ఎక్కువ అయ్యారని మరోసారి వెలుగు చూసింది. ఐటీ హబ్ లో కోటీశ్వరులతో పాటు విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన చాలా మంది ఉండటంతో వారిని టార్గెట్ చేసుకున్న డీలర్లు వారికి డ్రగ్స్ విక్రయిస్తున్నారు. విదేశాల నుంచి సీక్రేట్ గా బెంగళూరుకు డ్రగ్స్ తరలిస్తున్న విదేశీయురాలు అడ్డంగా చిక్కిపోయింది.
ఆఫ్రికాలోని అడిస్ అబాబా నుంచి విమానంలో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కేఐఏ)లో దిగిన లైబీరియన్ మహిళ వద్ద సుమారు రూ. 30 కోట్ల రూపాయలు విలువైన డ్రగ్స్ ఉండటంతో అధికారులు షాక్ అయ్యారు. మహిళ దగ్గర డ్రగ్ కొకైన్ దొరికిందని బెంగళూరు ఎయిర్ పోర్టు అధకారులు తెలిపారు.

కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సెంటర్‌లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు 38 ఏళ్ల లైబీరియన్ మహిళను అరెస్టు చేసి రూ.30 కోట్లు విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 2 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామని విమానాశ్రయం అధికారులు మంగళవారం చెప్పారు.
లైబీరియన్ మహిళ మే 26న భారతీయ పర్యాటక వీసాపై ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో అడిస్ అబాబా నుండి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో డీఆర్‌ఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని ఆమె లగేజ్ బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.

బట్టలతో నింపిన నల్లటి సూట్‌కేస్ అడుగున ఆమె అక్రమంగా కొకైన్‌ను తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే అధికారులు ఆమె వస్తువులతో పాటు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. టూరిస్టు ముసుగులో బెంగళూరు వచ్చిన ఆమె కొకైన్‌ను స్మగ్లింగ్ చేసేందుకు ఆమెకు భారీగానే డీలర్లు డబ్బులు చెల్లించారని అధికారులు అంటున్నారు.
మహిళ అధికారులకు చిక్కిపోవడంతో కథ అడ్డం తిరిగింది. అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ఉన్న వ్యక్తికి డ్రగ్ డెలివరీ చేయాలని ఆమెకు విదేశాల్లోనే సూచించారని అధికారులు అంటున్నారు. బెంగళూరులో ఆమె కొద్దిరోజులు బస చేసేందుకు స్టార్ హోటల్‌లో రూమ్ కూడా బుక్ చేసినట్లు అధికారుల విచారణలో తెలిసింది.
ఆమె నుంచి డ్రగ్స్ తీసుకునేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ వ్యక్తి తప్పించుకుని పారిపోయాడని అధికారులు అంటున్నారు. లైబీరియన్ మహిళపై ఎన్‌డిపిఎస్ చట్టం కింద కేసు కేసులు నమోదు చేశామని, ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని అధికారులు అంటున్నారు. ఎయిర్ పోర్టులో మహిళ దగ్గర డ్రగ్స్ తీసుకోవడానికి వచ్చి తప్పించుకున్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications