హమ్మయ్య .. ఆరు నెలల తర్వాత 20వేల దిగువకు కరోనా కొత్త కేసులు, భారత్ కు భారీ ఉపశమనం
భారతదేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గడం ఊరటనిస్తుంది. 200 రోజుల అనంతరం 20 వేల దిగువకు కరోనా కేసులు నమోదు కావడం భారత దేశానికి పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో భారతదేశంలో 18,795 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. మొన్న నమోదైన కేసులతో పోలిస్తే 27.8 శాతం తక్కువగా నమోదయ్యాయి.

20,000 కంటే తక్కువగా కొత్త కేసులు
గత ఆరు నెలల్లో మొదటిసారిగా కేసుల సంఖ్య 20,000 కంటే తక్కువగా ఉంది. ఈ పరిణామాలు భారత్ లో కరోనా తగ్గుదలకు సంకేతంగా నిలుస్తున్నాయి. కేసుల తగ్గుదల ఉన్నా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రం పదేపదే హెచ్చరికలు జారీ చేస్తుంది. రానున్న పండుగలను దృష్టిలో పట్టుకుని కేసులు పెరగకుండా ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నారు. సామాజిక దూర నిబంధనలను పాటించాలని అంటున్నారు. తాజా కోవిడ్ -19 కేసులతో కలిపి , దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,36,97,581 కి చేరుకుంది.

యాక్టివ్ కేసులు .. రికవరీలు ఇలా
మంగళవారం ఉదయం 8 గంటల వరకు, భారతదేశంలో యాక్టివ్ కేస్‌లోడ్ 2,92,206 గా ఉంది. గత 24 గంటల్లో, యాక్టివ్ కేసులు 7.414 శాతం తగ్గాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల రేటు 0. 87 శాతం గా ఉంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశ రికవరీ రేటు 97.81 శాతంగా ఉంది. గత 24 గంటల్లో మొత్తం 26,030 మంది కరోనా రోగులు కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం రికవరీలు 3,29,58,002 కు చేరుకున్నాయి.

అత్యధిక రోజువారీ కేసులను నమోదు చేస్తున్న రాష్ట్రాలివే
అత్యధికంగా కోవిడ్ -19 కేసులను నమోదు చేసిన మొదటి ఐదు రాష్ట్రాల విషయానికి వస్తే, రోజువారి కేసులలో అత్యధిక కేసులు నమోదు చేస్తున్న కేరళలో 11,699 కేసులు, మహారాష్ట్రలో తాజాగా 2,563 కేసులు, మిజోరంలో 1,846 కేసులు, తమిళనాడులో 1,657 కేసులు, ఆంధ్రప్రదేశ్‌లో 618 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 504 కేసులు, ఒడిశాలో 444 కేసులు, తెలంగాణలో 216 కేసులు, అస్సాంలో 412 కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు రాష్ట్రాల నుండి 86.86 శాతం కొత్త కేసులు నమోదయ్యాయి, 62.25 శాతం కొత్త కేసులకు కేరళ మాత్రమే బాధ్యత వహిస్తుంది.

నిన్న ఒక్కరోజే 179 మరణాలు, వ్యాక్సినేషన్ లో భారత్ దూకుడు
గత 24 గంటల్లో దేశంలో 179 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,47,373 కి పెరిగింది. కేరళలో గత 24 గంటల్లో 58 మంది మరణించారు. తర్వాతి స్థానంలోమహారాష్ట్రలో గత 24 గంటల్లో 32 మరణాలు సంభవించాయి. భారతదేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం యుద్ధప్రాతిపదికన కొనసాగుతోంది. రానున్న పండుగలను దృష్టిలో పెట్టుకుని కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత 24 గంటల్లో భారతదేశంలో మొత్తం 1,02,22,525 వ్యాక్సిన్ డోస్‌లు ఇవ్వబడ్డాయి. ఇది మొత్తం వ్యాక్సిన్ మోతాదులను 87,07,08,636 కి చేర్చింది. గత 24 గంటల్లో మొత్తం 13,21,780 నమూనాలను పరీక్షించారు.












Click it and Unblock the Notifications