వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంత‌ర్వేది ర‌థం కాలిపోయి ఏడాది, దర్యాప్తు ఎందుకు ఆలస్యమవుతోంది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

తూర్పు గోదావ‌రి జిల్లాలోని అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చెందిన రథం మంటల్లో కాలిపోవడం అప్ప‌ట్లో కలకలం రేపింది.

రాజకీయంగానూ విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌ల‌కు ఆస్కార‌మిచ్చింది. అయితే ఈ ఘ‌ట‌న జ‌రిగి ఏడాది పూర్త‌యింది. కానీ అంత‌ర్వేది ర‌థం ఎలా కాలిపోయిందో మాత్రం ఇంతవరకు తేలలేదు.

ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ కోరుతూ అప్ప‌ట్లో ఆందోళ‌న‌ చేపట్టిన వివిధ పార్టీలు, సంఘాల నేత‌లు ఇప్పుడు ఆ విషయంపై మాట్లాడడం లేదు.

ఏపీ ప్ర‌భుత్వం కూడా ఈ కేసు ద‌ర్యాప్తుని సీబీఐకి అప్ప‌గిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి స‌రిపెట్టుకుంది. ఆ త‌ర్వాత కొత్త‌గా ర‌థం సిద్ధం చేసి ముఖ్యమంత్రితో ప్రారంభింపజేయడం వరకే ప‌రిమిత‌మ‌ైంది.

సీబీఐ ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ కేసు విచార‌ణ చేప‌ట్టిన దాఖ‌లాలు లేవు. క‌నీసం ద‌ర్యాప్తున‌కు అనుగుణంగా కేసు న‌మోదు చేసేందుకు కూడా సీబీఐ సిద్ధం కాలేదు.

దాంతో అంత‌ర్వేది ర‌థం కాలిపోవ‌డం వెనుక అస‌లు గుట్టు మాత్రం నేటికీ ఎవ‌రికీ అంతుపట్ట‌ని వ్య‌వ‌హారంగానే మిగిలిపోయింది.

కాలిపోయిన అంతర్వేది రథం

ఆ రోజు ఏం జ‌రిగింది

2020 సెప్టెంబ‌ర్ 5 అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత అంత‌ర్వేది ర‌థం మంట‌ల్లో కాలిపోయింది. దానిని గుర్తించిన స్థానికులు ఇచ్చిన స‌మాచారంతో పోలీస్, ఫైర్ సిబ్బంది స్పందించినా అప్ప‌టికే ర‌థం కాలిపోయింది.

సుదీర్ఘకాలంగా అంత‌ర్వేదిలో ఏటా కల్యాణోత్సవాల సందర్భంగా రథోత్సవం నిర్వహిస్తారు. ఆ సందర్భంగా ఉప‌యోగించే ర‌థం మంట‌ల్లో చిక్కుకున్న దృశ్యాలు అప్ప‌ట్లో వైర‌ల్ అయ్యాయి.తొలుత ఇది షార్ట్ స‌ర్క్యూట్ కారణంగా జ‌రిగింద‌ని ప్ర‌క‌టించారు. కానీ ఆ త‌ర్వాత తేనె సేక‌ర‌ణ‌లో జ‌రిగిన ప్ర‌మాదంగా అనుమానించారు. కార‌ణాల‌పై ఆ త‌ర్వాత అనేక ప్ర‌చారాలు కూడా జ‌రిగాయి. ఈ ఘటనపై సఖినేటిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. ఘ‌ట‌నాస్థ‌లాన్ని అడిష‌న‌ల్ డీజీ స్థాయి అధికారులు ప‌రిశీలించారు. ప‌లువురు మంత్రులు కూడా వెళ్లారు.క్లూస్ టీమ్, డాగ్ స్క్యాడ్ సహాయంతో విచారణ చేపట్టారు. అనుమానితులను ప్రశ్నించారు. వారిలో అంతర్వేది ఆలయ సిబ్బంది కూడా ఉన్నారనే ప్రచారం సాగింది. విప‌క్షాలు ఆందోళ‌న‌లు చేశాయి. బీజేపీ, జ‌న‌సేన పార్టీల ఆధ్వ‌ర్యంలో 'చలో అంతర్వేది' వంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఈ ఆందోళ‌నల స‌మ‌యంలో కొంత ఉద్రిక్త‌త ఏర్ప‌డ‌డం, స్థానికంగా ఇత‌ర మ‌తాల‌కు చెందిన ప్రార్థ‌నామందిరాల‌పై రాళ్ల దాడికి కొంద‌రు య‌త్నించ‌డంతో కేసులు కూడా న‌మోద‌య్యాయి. కొంద‌రు నిందితుల‌ను అరెస్ట్ చేసి జైలుకి కూడా త‌ర‌లించారు.

విప‌క్షాల డిమాండ్, సీబీఐకి కేసు

అంత‌ర్వేది ర‌థం ఘ‌ట‌న‌కు ముందు నెల్లూరు జిల్లాలో ప్ర‌స‌న్నాంజ‌నేయ స్వామి ఆల‌యంలో ర‌థం కాలిపోవ‌డం, దానికి ముందు తూర్పు గోదావ‌రి జిల్లా పిఠాపురం స‌హా ప‌లు ఆల‌యాల్లో విగ్ర‌హాలు ధ్వంసం జ‌ర‌గడం వంటి ఘ‌ట‌న‌ల క్రమంలో అంత‌ర్వేది ర‌థం ఘ‌ట‌న పెద్ద వివాదంగా మారింది.ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ స‌హా అన్ని పార్టీల నేత‌లు ఈ కేసులో సీబీఐ విచార‌ణ‌ను డిమాండ్ చేశారు. ర‌థం ఘ‌ట‌న ఓ కుట్ర‌గా బీజేపీ అనుమానించింది. దాంతో చివ‌ర‌కు ఏపీ ప్ర‌భుత్వం ఈ కేసులో సీబీఐ విచార‌ణ కోరింది. ముఖ్య‌మంత్రి ఆదేశాల‌తో గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 10న ఏపీ డీజీపీ కార్యాలయం కేంద్ర హోం శాఖ‌కు లేఖ రాసింది. అంత‌ర్వేది ర‌థం కాలిపోయిన ఘ‌ట‌న‌పై సీబీఐ దర్యాప్తుని కోరింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు కూడా వెలువ‌డ్డాయి.

అంతర్వేది ఆలయం

అడుగుముందుకేయ‌ని సీబీఐఏపీ ప్ర‌భుత్వం కోరిక మేర‌కు సీబీఐ ఈ కేసులో జోక్యం చేసుకుంటుంద‌ని అంతా భావించారు. సీబీఐ ద‌ర్యాప్తు చేప‌డితే ర‌థం కాలిపోవ‌డానికి కార‌ణాలు వెలుగులోకి వ‌స్తాయ‌ని ఆశించారు. కానీ సీబీఐ మాత్రం అడుగుముందుకు వేయ‌లేదు. స‌కాలంలో కేసు ద‌ర్యాప్తు చేప‌ట్ట‌క‌పోవ‌డంతో ప్ర‌స్తుతం ఈ కేసులో ఆధారాలు ఏమేర‌కు ల‌భిస్తాయ‌న్న‌ది కూడా ప్రశ్నార్థ‌క‌మే. అయితే నేటికీ సీబీఐ ఈ వ్య‌వ‌హారంలో నోరుమెద‌ప‌డం లేదు.ఈ కేసు విచార‌ణ‌కు స్వీక‌రించ‌డానికి సిద్ధంగా ఉన్నారా లేదా అన్న‌ది కూడా సీబీఐ స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. అదే స‌మ‌యంలో సీబీఐ ఈ కేసుని వేగంగా విచారించాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నుంచి కూడా కోరిన దాఖ‌లాలు కూడా త‌ర్వాత‌ లేవు.సీబీఐ ద‌ర్యాప్తు డిమాండ్ చేసిన విప‌క్షాలు కూడా మౌనం పాటిస్తున్నాయి. హిందూ ధార్మిక సంఘాలు కూడా దానిని విస్మ‌రించిన‌ట్టు క‌నిపిస్తోంది.

'సీబీఐ తీరు కూడా అనుమానాస్ప‌ద‌మే

''అంత‌ర్వేది ర‌థం ఘ‌ట‌న‌పై సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. కానీ ఏపీలో రాజ‌కీయ కార‌ణాల వ‌ల్ల‌ే ఈ కేసులో సీబీఐ ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. ఏపీ పోలీసులు ద‌ర్యాప్తు చేసినా ఇప్ప‌టికే ఏదోటి తేలేది. ప్ర‌భుత్వం భ‌ద్ర‌త క‌ల్పించ‌లేక‌పోయింద‌నే విమ‌ర్శ‌లున్న నేప‌థ్యంలో వాస్త‌వాలు వెలుగులోకి రావ‌డానికి కాస్త ఆల‌స్యమ‌ైనా అవ‌కాశం ఉండేది.

కానీ ఇప్పుడు ఎటూ కాకుండా పోయింది. క‌నీసం తాము జోక్యం చేసుకోలేమంటూ సీబీఐ చెప్పేసినా మ‌ళ్లీ ఏపీ ప్ర‌భుత్వం మీద బాధ్య‌త ప‌డేది.

కానీ సీబీఐ మాత్రం ఉద్దేశ‌పూర్వ‌కంగానే జాప్యం చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే చాలామంది జ‌నాలు మ‌ర‌చిపోయారు.

ప్ర‌తిప‌క్షాలు, హిందూ సంస్థ‌లు కూడా దీనిపై నోరెత్త‌డం లేదు’’ అని రాజోలుకి చెందిన న్యాయ‌వాది ఎం.స‌త్య‌న్నారాయ‌ణ అభిప్రాయ‌ప‌డ్డారు.సీబీఐ ఈ వ్య‌వ‌హారంలో స్ప‌ష్ట‌త ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న బీబీసీతో అన్నారు.

'కారణం తెలియాలి’ ''ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి ఆల‌యంలో అప‌చారం జ‌రిగింది. దానికి కార‌ణాలు ఇప్ప‌టికే తెలుసుకోలేక‌పోవ‌డం దుర‌దృష్టం.

అప్ప‌ట్లో ఏపీ పోలీసులు మా అర్చ‌కుల‌ను కూడా విచారించారు. కార‌ణాలు బ‌య‌ట‌కు తీస్తార‌నుకునేలోగా కేసు సీబీఐకి ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించేశారు. దాంతో ఏం జ‌రిగింద‌న్న‌ది అంతుబ‌ట్ట‌డం లేదు.

ముఖ్య‌మంత్రి స్వ‌యంగా వ‌చ్చి కొత్త ర‌థం ప్రారంభించారు. అది చెప్పిన స‌మ‌యానికి సిద్ధం కావ‌డంంతో ఈసారి క‌ళ్యాణోత్స‌వానికి ఆటంకం లేకుండా జ‌రిగింది.

అయినా అస‌లు కార‌ణాలు కనుక్కోవ‌డం అవ‌స‌రం. ఈ ర‌థం కాలిపోవ‌డానికి ముందు గానీ , త‌ర్వాత గానీ అంత‌ర్వేదిలో ఎలాంటి అల‌జ‌డి లేదు. ఇప్పుడంతా సాధార‌ణంగానే సాగిపోతోంది’’ అన్నారు ఆల‌య అర్చ‌కులు ఎం శ్రీనివాసులు. 42 అడుగుల ఎత్తైన కొత్త ర‌థాన్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేతుల మీదుగా 2012 ఫిబ్ర‌వ‌రి 19న ప్రారంభించారు. 1.16 కోట్ల వ్య‌యంతో దానిని మూడు నెల‌ల్లోనే సిద్ధం చేశారు. త‌ద్వారా ఈ ఏడాది పిబ్ర‌వ‌రి 23న స్వామివారి ర‌థోత్స‌వం స‌జావుగా సాగిపోయింది.

అంతర్వేదిలో ఆందోళనలు(పాత చిత్రం)

రాజ‌కీయ ల‌క్ష్యాల కోస‌మే..''ర‌థం కాలిపోయిందనే బాధ క‌న్నా దానిని రాజ‌కీయంగా వాడుకోవాల‌ని చూసిన వివిధ పార్టీల వైఖ‌రి వ‌ల్ల‌నే ఈ వ్య‌వ‌హారం ఎటూ తేల‌లేదు. అస‌లు కార‌ణాలేమిట‌న్న‌ది తెలియాలంటే ద‌ర్యాప్తు జ‌ర‌గాలి క‌దా.. ఏపీ పోలీసులు సీబీఐకి అప్ప‌గించేశామ‌న్నారు. సీబీఐ వాళ్లు స్పందించ‌లేదు. ప్ర‌తిప‌క్షాలు మాట్లాడ‌డం లేదు. క‌నీసం సీబీఐ ఎందుకు ఈ కేసు తీసుకోలేద‌ని బీజేపీ కూడా అడ‌గ‌డం లేదు.

జ‌న‌సేన అప్ప‌ట్లో హ‌డావిడి చేసింది కానీ ఇప్పుడు బీజేపీ మిత్ర‌ప‌క్షం కాబ‌ట్టి నోరుమెద‌ప‌డం లేదు. టీడీపీ కూడా తొలుత విమ‌ర్శ‌లు చేసినా ఇప్పుడు ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఈ వ్య‌వ‌హారం ఇక జ‌నం మ‌ర‌చిపోవ‌డ‌మే మంచిద‌న్న‌ట్టుగా అధికార వైసీపీ ఉంది. దాంతో అంత‌ర్వేది ర‌థం కాలిపోవ‌డానికి కార‌ణాల వెనుక అస‌లు మ‌ర్మం మాత్రం బ‌య‌ట‌ప‌లేదు.

ఆ ఘ‌ట‌న‌ను రాజ‌కీయంగా ఉప‌యోగించుకోవాల‌ని చూసిన అన్ని పార్టీలు ఇప్పుడు త‌మ త‌మ రాజ‌కీయాల కార‌ణంగానే వ్యూహాత్మ‌కంగా మౌనం పాటిస్తున్నాయి’’ అని స్థానిక‌ సీనియర్ జ‌ర్న‌లిస్టు పీత‌ల రాజ‌శేఖ‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు.

మంత్రి వెల్లంపల్లి

జగన్ ప్రభుత్వంపై బీజేపీ, సీబీఐపై వైసీపీ ఆరోపణలు

ఏడాదైనా ఈ కేసులో నిజానిజాలు తేలకపోవడంపై ఏపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులతో 'బీబీసీ’ మాట్లాడింది.

కేసును సీబీఐ విచారణకు అప్పగించామని, సీబీఐ విచారణ ఆలస్యం చేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.

మరోవైపు ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విచారణ ముందకు సాగడం లేదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
A year passed for the Antarvedi Chariot burnt incident,why investigation is delayed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X