అహంతోనే ‘ఆప్’కు అసలు ముప్పు?

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడున్నరేళ్ల క్రితం సంచలన విజయాలు సాధించిన ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)లో అధినేత, ప్రధాన నాయకత్వం మధ్య గల అహంకార పూరిత ధోరణులే ఆ పార్టీకి పెను ముప్పుగా పరిణమించినట్లు కనిపిస్తున్నది.

2013 ఎన్నికల్లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆప్.. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన చారిత్రక విజయంతో తనకు తిరుగులేదని భావించింది. కానీ రెండేళ్ల తర్వాత పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికలు, ఢిల్లీలో రాజౌరీ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక, ఇటీవల జరిగిన ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాభవాన్ని ఎదుర్కోవడంతో అంతర్గతంగా అసమ్మతి భగ్గుమన్నది.

పార్టీ వ్యవస్థాపక కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పై పార్టీ నేతలు అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. ఆ బాటలో పార్టీ వ్యవస్థాపకుల్లో ఒక్కరైన కుమార్ విశ్వాస్ చేరడం కేజ్రీవాల్ నాయకత్వానికి సవాల్‌గా మారింది.

అమానుల్లాఖాన్ పై కుమార్ విశ్వాస్ ఫైర్

అమానుల్లాఖాన్ పై కుమార్ విశ్వాస్ ఫైర్

కుమార్‌ విశ్వాస్‌ సైతం ఇక కేజ్రీవాల్‌కు రాంరాం చెప్పాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కుమార్‌ విశ్వాస్‌ బీజేపీ ఏజెంట్‌ అని, ఆప్‌లో చీలిక తెచ్చేందుకు అతన్ని బీజేపీ, ఆరెస్సెస్‌ వాడుకుంటున్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ బాహాటంగా చేసిన విమర్శలపై కుమార్ విశ్వాస్ ధీటుగానే స్పందించారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలపై ఆ విమర్శలు చేసి ఉంటే అమానుల్లాఖాన్ ఈ పాటికే పార్టీ నుంచి ఉద్వాసనకు గురయ్యేవారని విశ్వాస్ అన్నారు.

విశ్వాస్‌తో అరవింద్ కేజ్రీవాల్ ఇలా

విశ్వాస్‌తో అరవింద్ కేజ్రీవాల్ ఇలా

కుమార్ విశ్వాస్ వ్యాఖ్యలకు బలం చేకూర్చడానికా అన్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి పొద్దుపోయిన తర్వాత కుమార్ విశ్వాస్ నివాసానికి చేరుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆయనతో సంప్రదింపులు జరిపారు. తాను పార్టీలో కొనసాగాలంటే కేజ్రీవాల్‌కు కుమార్ విశ్వాస్ మూడు షరతులు పెట్టినట్లు తెలుస్తున్నది. బుధవారం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కేజ్రీవాల్ నివాసంలో జరుగుతున్నది.

షరతులకు కేజ్రీ తలొగ్గుతారా?

షరతులకు కేజ్రీ తలొగ్గుతారా?

ఈ నేపథ్యంలో అవినీతిపై రాజీ పడొద్దని, నిత్యం పార్టీ శ్రేణులతో సమావేశం కావాలని, జాతీయ వాదంపైనా రాజీకి తావులేని విధానాన్ని అనుసరించాలని కేజ్రీవాల్‌కు కుమార్ విశ్వాస్ షరతులు విధించినట్లు సమాచారం. అలాగే తనపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే అమానుల్లాఖాన్ పై చర్య తీసుకోవాలని, తన డిమాండ్లను ఔదాల్చకపోతే మాత్రం పార్టీని వీడక తప్పదని కుమార్ విశ్వాస్ తెగేసి చెప్పినట్లు తెలుస్తున్నది. కేజ్రీవాల్‌తోపాటు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన కుమార్ విశ్వాస్.. ఇటీవల ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలప్పుడే పార్టీని వీడతారని బీజేపీలో చేరతారని ఇబ్బడిముబ్బడిగా వార్తలొచ్చాయి.

కుమార్ విశ్వాస్ పై కాంగ్రెస్ ఇలా

కుమార్ విశ్వాస్ పై కాంగ్రెస్ ఇలా

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే తాను బీజేపీలో చేరతానని వచ్చిన వార్తలను కుమార్ విశ్వాస్ ఖండించిన దాఖలాలు కూడా లేవు. గమ్మత్తేమిటంటే కుమార్ విశ్వాస్, అరవింద్ కేజ్రీవాల్ మధ్య అహంకార పూరిత ధోరణులే వారి మధ్య దూరం పెరగడానికి కారణమని తెలుస్తోంది. బుధవారం కేజ్రీవాల్ అధికార నివాసంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి హాజరైన కుమార్ విశ్వాస్ మీడియాతో మాట్లాడకుండానే లోపలికి వెళ్లడం గమనార్హం. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సందీప్ దీక్షిత్ స్పందిస్తూ ఆప్ పై పట్టు సాధించేందుకు కుమార్ విశ్వాస్ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు.

మీడియాకు ఎక్కొద్దన్న సిసోడియా

మీడియాకు ఎక్కొద్దన్న సిసోడియా

అంతకుముందు అధినేత కేజ్రీవాల్‌ తీరుపై కుమార్‌ విశ్వాస్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ విమర్శించినట్టు తాను బీజేపీ ఏజెంటును కాదని, తాను ఎవరికీ క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. 24 గంటల్లోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ నివాసంలో ఆప్‌ అగ్రనేతలు భేటీ అయ్యారు. కుమార్‌ వ్యవహారంపై చర్చించినట్టు సమాచారం. కాగా, పార్టీకి వ్యతిరేకంగా బహిరంగ ప్రకటనలు చేస్తున్న కుమార్‌ విశ్వాస్‌పై సీనియర్‌ నేత మనీష్‌ సిసోడియా మండిపడ్డారు. సమస్య ఏమైనా ఉంటే పార్టీలో చర్చించుకొని పరిష్కరించుకోవాలని ఆయన హితవు పలికారు. ఆయనను పార్టీ నుంచి తొలగించే అవకాశం కూడా ఉందని వినిపిస్తోంది. మొత్తానికి రోజురోజుకు ఆప్‌ నాయకత్వానికి వ్యతిరేకంగా సొంత పార్టీలోనే అసమ్మతి గళాలు ఎగిసిపడుతున్నాయి.

పీఏసీలో దూరదూరంగానే భేటీ

పీఏసీలో దూరదూరంగానే భేటీ

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సిసోడియా తదితరులతో కుమార్ విశ్వాస్‌కు చెడిందా? అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బుధవారం జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో కేజ్రీవాల్, కుమార్ విశ్వాస్ కు దూరంగా కూర్చుకున్నారని తెలుస్తున్నది. 2015లో ఆప్ ఎన్నికల విజయం సాధించినప్పుడు వారిద్దరూ బాల్కానీలో నిలబడి ప్రజలకు అభివాదం చేసిన తీపిగుర్తులు హస్తిన వాసుల మదిలో ఇప్పటికీ నిలిచే ఉన్నాయి. కానీ 2012లో పార్టీ వ్యవస్థాపన సమయంలో కీలకంగా వ్యవహరించిన కుమార్ విశ్వాస్ వంటి వారిని కేజ్రీవాల్.. సంజయ్ సింగ్ అనే నేత సలహాలతో దూరం పెట్టారని వినికిడి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Delhi CM Arvind Kejriwal's Aam Aadmi party (AAP) is in crisis following the debacle in Delhi elections.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి