మోడీపై కాంగ్రెస్, రాహుల్ దమ్ముంటే జైల్లోపెట్టు:స్మృతి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా పథకం పేరుతో విదేశీ పెట్టుబడి దారులు దేశం నుండి ధనాన్ని టేక్ ఇన్ ఇండియా ఎత్తుకుపోయేందుకు రంగం సిద్దం చేస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఆదివారం దుమ్మెత్తిపోశారు.
కాంగ్రెస్ పార్టీ ఆదివారం రాంలీలా మైదానంలో ఏర్పాటుచేసిన రైతు సమ్మేళనంలో ప్రసంగించారు. మోడీ ప్రభుత్వం భూసేకరణ సవరణ బిల్లుపై తోక ముడవటం రైతుల విజయం, కాంగ్రెస్ పార్టీ విజయమని రాహుల్ అన్నారు. రైతులు కలిసికట్టుగా ఉద్యమించటంతో పరిస్థితి తీవ్రతను గ్రహించిన బిల్లును ఉపసంహరించుకున్నారన్నారు.
ప్రధాని మోడీ ప్రభుత్వం భూసేకరణ సవరణ బిల్లును ఉపసంహరించుకున్నప్పటికీ దీనిని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది కాబట్టి మనం మరింత జాగ్రత్తగా ఉద్యమాన్ని ముందుకు నడిపించవలసి ఉంటుందని, ఇప్పటి దాకా జాతీయ స్థాయిలో చేసిన ఉద్యమాన్ని ఇక రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తామన్నారు.

రైతుల సమస్యలను తెలుసుకునేందుకు సమయం కేటాయించని ప్రధాని మోడీ పెట్టుబడిదారులను కలుసుకునేందుకు ఏకంగా విదేశీ యాత్రలకు వెళుతున్నారన్నారు. లోకసభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఒక్క హామీని కూడా మోడీ అమలు చేయలేదన్నారు.
మంత్రి స్మృతి ఇరానీకి లీగల్ నోటీసులు
రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ పైన తప్పుడు ఆరోపణలు చేశారంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కాంగ్రెస్ పార్టీ లీగల్ నోటీసులు జారీ చేసింది. అమేథిలోని రైతు భూములను ఈ చారిటబుల్ ట్రస్టు లాక్కొందంటూ స్మృతి ఇరానీ గతంలో ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ పైన, ఆ ట్రస్టుపై ఇంతవరకూ ఆమె రెండుసార్లు బహిరంగ ఆరోపణలు చేశారంటూ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆ లీగల్ నోటీసులో పేర్కొంది. అమేథి రైతు హక్కుల కోసం తాను పోరాడతానని, రైతు భూములను లాక్కొన్న రాహుల్ గాంధీని అవసరమైతే కటకటాలపాలు చేస్తానని స్మృతి గతంలో అన్నారు.
జైలుకు పంపండి: స్మృతి ఇరానీ
దమ్ముంటే తనను జైలుకు పంపించాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ... రాహుల్ గాంధీకి సవాల్ చేశారు. రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్టు అమేథీలో రైతుల భూములను ఆక్రమించుకుందని తాను చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ తనకు లీగల్ నోటీసు పంపించిన ఒక రోజు తర్వాత శనివారం ఆమె ఈ సవాలు విసిరారు.
అంతేకాదు, అమేథీ ప్రజల తరఫున మాట్లాడుతూనే ఉంటానన్నారు. 2014లో జరిగిన లోకసభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ అమేథీ లోకసభ నియోజకవర్గంనుంచి రాహుల్ గాంధీపై పోటీచేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.
తన అమేథీ పర్యటనలు కొంతమందిలో గుబులు పుట్టిస్తున్నాయని అంటూ, తాను లీగల్ నోటీసులకు భయపడే వ్యక్తిని కాదన్నారు. అంతేకాదు ఈ దేశంలోని మహిళలు అబలలని కాంగ్రెస్ పార్టీ కానీ, రాహుల్ కానీ అనుకుంటూ ఉంటే దాన్ని ఇకపై మరిచిపోవాలని, తాను ఇలాంటి వాటికి భయపడే వ్యక్తిని కాదన్నారు.
అమేథీ ప్రజల వాణిని వినిపిస్తూనే ఉంటానన్నారు. కాంగ్రెస్‌కు గానీ, రాహుల్ గాంధీకి కాని దమ్ముంటే తనను జైల్లో పెట్టాలన్నారు. నేను నోరు మూసుకుని ఉండను, అమేథీతో తన అనుబంధం ఎన్నికలకు సంబంధించినది కాదన్నారు.












Click it and Unblock the Notifications