సోదరుల మధ్య గొడవ: కాల్పుల్లో ఎస్ఐ మృతి, యూపీ సీఎం దిగ్భ్రాంతి, సాయం ప్రకటన
ఆగ్రా: ఇద్దరు అన్నదమ్ముల మధ్య వివాదాన్ని సద్దుమణించేందుకు వెళ్లిన ఓ సబ్ ఇన్‌స్పెక్టర్‌పై వారు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సదరు ఎస్ఐ ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఖతౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో విశ్వనాథ్, శివనాథ్ అనే ఇద్దరు సోదరులు పంట సాగు విషయంలో ఘర్షణ పడుతున్నారు. ఈ క్రమంలో తనను తన సోదరుడు విశ్వనాథ్ బెదిరింపులకు గురిచేస్తున్నాడని శివనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ ప్రశాంత్ యాదవ్, ఒక కానిస్టేబుల్ ఘటనా స్థలానికి వెళ్లారు.

పోలీసులను చూసిన విశ్వనాథ్ పరుగులు పెట్టాడు. అతడ్ని పట్టుకునేందుకు పోలీసులు అతని వెంట పడ్డారు. దీంతో విశ్వనాథ్ తన వద్ద ఉన్న నాటు తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో ఎస్ఐ ప్రశాంత యాదవ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
ఆస్పత్రికి తరలించే లోపే ఎస్ఐ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆగ్రా అడిషనల్ డీజీ రాజీవ్ కృష్ణా తెలిపారు. నిందితుడి కోసం పలు పోలీసు బృందాలు గాలింపు చేపట్టినట్లు చెప్పారు.
కాల్పుల ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన ఎస్ఐ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి రూ. 50 లక్షల సాయాన్ని ప్రకటించారు. అతని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేగాక, ఆ ప్రాంతంలో ఓ రోడ్డుకు ఎస్ఐ పేరు పెడతామని చెప్పారు.












Click it and Unblock the Notifications