సాగు చట్టాలను రద్దు చెయ్యాల్సిందే .. ప్రతి ఒక్కరి ఫోన్ లో పెగాసస్ : రైతుల ఆందోళనలో రాహుల్ గాంధీ !!
కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఈరోజు సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న రైతులకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ బృందం మద్దతు ప్రకటించింది. వారితో పాటు ఇతర విపక్ష నేతలు కూడా రైతులకు తమ మద్దతును తెలియజేశారు. జూలై 22వ తేదీ నుండి రైతులు కిసాన్ సంసద్ అంటే రైతుల పార్లమెంట్ పేరుతో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు.

జంతర్ మంతర్ వద్ద రైతుల ఆందోళనలో పాల్గొన్న రాహుల్ గాంధీ , ప్రతిపక్ష నాయకులు
ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బిఎస్పి , ఆమ్ ఆద్మీ పార్టీ లను మినహాయించి ప్రతిపక్ష పార్టీల నాయకులు తమ సంఘీభావం తెలియజేయడానికి జంతర్ మంతర్ వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతుల వద్దకు వెళ్ళారు. పార్లమెంట్ వర్షాకాల ప్రారంభం నుండి ఆగస్టు 9 వరకు జంతర్ మంతర్ వద్ద 200 మంది రైతుల బృందం 'కిసాన్ సంసద్' నిర్వహించడానికి ప్రత్యేక అనుమతి తీసుకొని ఆందోళన నిర్వహిస్తుంది. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ గౌరవ్ గొగోయ్, శివసేన సంజయ్ రౌత్, ఆర్జేడీకి చెందిన మనోజ్ ఝా, డిఎంకెకు చెందిన టి శివ మరియు ఇతరులు రాకబ్‌గంజ్ గురుద్వారా సమీపంలో బస్సులలో ప్రయాణించి తమ నిరసన తెలియజేశారు.

బస్సుల్లో వెళ్ళిన ప్రతిపక్ష నాయకులు .. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు
జంతర్ మంతర్‌కి వెళ్లే సమయంలో, ప్రతిపక్ష నాయకులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ గాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు జంతర్ మంతర్ వద్ద రైతుల ఆందోళనలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ ఈ రోజు, రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామని, కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌కు ప్రతిపక్ష పార్టీలు పూర్తి మద్దతును తెలియజేస్తున్నామని వెల్లడించారు. భారతదేశంలోని రైతులందరికీ తమ పూర్తి మద్దతు తెలియజేయడానికి వచ్చామని రాహుల్ గాంధీ వెల్లడించారు. తాము పార్లమెంటులో పెగాసస్ గురించి మాట్లాడాలనుకుంటున్నామని కానీ అధికారపక్షం దానిని అనుమతించలేదని రాహుల్ గాంధీ వెల్లడించారు. నరేంద్ర మోడీ ప్రతి భారతీయుడి ఫోన్ లో అంతర్గత సమాచారాన్ని తెలుసుకుంటున్నారు విమర్శించారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చెయ్యాల్సిందే .. రాహుల్ గాంధీ డిమాండ్
ఇప్పటి వరకు అనేక దఫాలుగా రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ ఆ చర్చలన్నీ విఫలమయ్యాయి. ప్రస్తుతం చర్చలు సహాయపడాలని, రైతులకు నష్టం చేస్తున్న నల్ల చట్టాలను రద్దు చేయాలని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రైతులను కాపాడండి .. ఇండియాను కాపాడండి అని నినాదాలు చేశారు. ప్రస్తుతం, కేంద్ర ప్రభుత్వం మరియు రైతు సంఘాల మధ్య చర్చలు నిలిచిపోయాయి. ప్రస్తుతం చట్టాలను వాయిదా వేద్దామని ఒకటిన్నర సంవత్సరాలు నిలిపివేయాలన్న కేంద్రం ప్రతిపాదనకు వ్యవసాయ సంఘాలు అంగీకరించడానికి నిరాకరించడంతో కేంద్ర ప్రభుత్వానికి రైతులకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది.

మొండి వైఖరి వీడని కేంద్రం .. సాగు చట్టాల రద్దుకు డిమాండ్ .. ఆగని రైతుల ఉద్యమం
ఆందోళనలో భాగంగా జనవరి 26 న రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడంతో ఇరుపక్షాల మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ఆ తర్వాత కరోనా కష్టకాలంలో కూడా రైతులు తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ, ఢిల్లీ సరిహద్దులలోనూ శాశ్వత స్థావరాలను ఏర్పాటు చేస్తున్న రైతులు కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తేనే తిరిగి ఇళ్లకు వెళ్తామని తేల్చిచెప్పారు. ప్రతిపక్ష పార్టీలు కూడా రైతులు ఆందోళనకు సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాయి. కేంద్రం ఈ వ్యవసాయ చట్టాల విషయంలో రైతు ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. కానీ కేంద్రం మాత్రం తన మొండి వైఖరి వీడకుండా సాగు చట్టాల రద్దుపై ఎవరెన్ని ఆందోళనలు చేసినా వ్యవసాయ చట్టాలను అమలు చేసి తీరుతామని తేల్చి చెబుతోంది.












Click it and Unblock the Notifications