చిచ్చు పెట్టిన సింగం: బీజేపీకి గుడ్‌బై: ఎన్డీఏ నుంచి బయటికి..!!
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో పెను ప్రకంపనలు చోొటు చేసుకున్నాయి. అనూహ్య పరిణామాలు సంభవించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ- ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ వచ్చిన ఏఐఏడీఎంకే కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కూటమికి గుడ్‌బై చెప్పింది. బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చింది.
ఈ మేరకు చెన్నైలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటైన సర్వసభ్య సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని పార్టీకి చెందిన ఏ ఒక్క సభ్యుడు కూడా అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించారు వారంతా.

బీజేపీ- ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రావాలంటూ ఏఐఏడీఎంకే నిర్ణయం తీసుకోవడానికి కారణం లేకపోలేదు. బీజేపీ తమిళనాడు రాష్ట్రశాఖ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై చేసిన వ్యాఖ్యలు- ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టింది. ఈ వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పాలంటూ ఏఐఏడీఎంకే డిమాండ్ చేసినప్పటికీ.. ఆయన పట్టించుకోలేదు. దీనితో ఈ నిర్ణయం తీసుకుంది అన్నా డీఎంకే.
తమిళనాడు మొట్టమొదటి ముఖ్యమంత్రి, ద్రవిడ ఐకాన్ సీఎన్ అన్నాదురై.. హిందూమతాన్ని, సనాతన ధర్మాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపించారు అన్నామలై. 1956లో మధురైలో జరిగిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల అనంతరం అన్నాదురై మధురైలో ఆశ్రయం పొందారని, క్షమాపణలు సైతం చెప్పారని అన్నామలై ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపాయి. దీనిపై బీజేపీ మిత్రపక్షం ఏఐఏడీఎంకే కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. అన్నాదురైను అవమానించాడని, దీనిపై బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసింది. అయినప్పటికీ- అన్నామలై పట్టించుకోలేదు.
దీనితో బీజేపీ- ఎన్డీఏ నుంచి బయటికి రావాలని ఏఐఏడీఎంకే నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ సర్వసభ్య సమావేశంలో దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానం ఆమోదం పొందగానే ఏఐఏడీఎంకే కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
#WATCH | Tamil Nadu | AIADMK workers burst crackers in Chennai after the party announces breaking of all ties with BJP and NDA from today. pic.twitter.com/k4UXpuoJhj
— ANI (@ANI) September 25, 2023
తమిళనాడు అసెంబ్లీతో పాటు 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే- బీజేపీ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు ఎన్నికల్లోనూ ఈ మిత్రపక్షాలకు చుక్కెదురైంది. డీఎంకే- కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే తరహా ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ స్థానాలు ఉండగా.. 2019 నాటి ఎన్నికల్లో బీజేపీ గెలిచింది ఒకే ఒక్కటి.












Click it and Unblock the Notifications