అన్నాడీఎంకేకి దినకరన్ బంపర్ ఆఫర్, డ్రామాలు వద్దు, పళని, పన్నీర్, డీఎంకే స్క్రీన్ ప్లే!
చెన్నై: అన్నాడీఎంకే పార్టీతో విలీనం కావడానికి తాను సిద్దంగా ఉన్నానని, అయితే కొన్ని షరతులు ఉన్నాయని ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ అంటున్నారు. టీటీవీ దినకరన్ బయటే ఉంటే అందరికీ మంచిదని, అలాంటి వ్యక్తులు మా పార్టీకి అవసరం లేదని, డీఎంకే స్క్రీన్ ప్లేతో డ్రామాలు ఆడుతున్నాడని అన్నాడీఎంకే సీనియర్ మంత్రులు అంటున్నారు. పళని, పన్నీర్ ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని చెప్పారు.

బహిరంగ ఆహ్వానం
తిరువూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ మీడియాతో మాట్లాడుతూ తనతోపాటు 18 మంది రెబల్ ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే పార్టీలోకి వెళ్లడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు. జయలలిత పాలన కొనసాగించాలంటే అందరూ కలిసిపోవడం చాల అవసరం అని టీటీవీ దినకరన్ చెప్పారు.

సీఎం, డీసీఎం
అన్నాడీఎంకే పార్టీలో మేము చేరాలంటే ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో సహ ఆరు మంది మంత్రులను వెంటనే వారి పదవుల నుంచి తప్పించాలని టీటీవీ దినకరన్ డిమాండ్ చేశారు.

నేను సీఎం చేస్తా
అన్నాడీఎంకే పార్టీలోని 18 మంది రెబల్ ఎమ్మెల్యేల్లో ఒక్కరిని తాను తమిళనాడు ముఖ్యమంత్రిని చేస్తానని, అందులో ఎలాంటి సందేహం లేదని టీటీవీ దినకరన్ ధీమా వ్యక్తం చేశారు. ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం మాత్రం వారి పదవులకు వెంటనే రాజీనామా చేస్తే విలీనం అవుతానని టీటీవీ దినకరన్ చెప్పారు.

బయటే ఉంటే మంచింది
టీటీవీ దినకరన్ లాంటి వ్యక్తులు అన్నాడీఎంకే పార్టీ బయటే ఉంటే మాకు, ప్రజలకు మంచిదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, తమిళనాడు మత్స్యశాఖ మంత్రి డి. జయకుమార్ అన్నారు. టీటీవీ దినకరన్ మళ్లీ డ్రామాలు మొదలు పెట్టాడని మంత్రి జయకుమార్ మండిపడ్డారు.

దినకరన్ కే దిక్కులేదు
టీటీవీ దినకరన్ మీడియా ముందు, ప్రజల ముందు నవ్వుతూ మాట్లాడుతున్నాడని, లోపల కుమిలికుమిలి ఏడుస్తున్నాడని మంత్రి జయకుమార్ ఆరోపించారు. టీటీవీ దినకరన్ వెంట ఎవ్వరూ లేరనే విషయం ప్రజలకు తెలుసని మంత్రి జయకుమార్ అన్నారు.

డీఎంకే ప్లాన్
డీఎంకే పార్టీ ఆడుతున్న డ్రామాలో టీటీవీ దినకరన్ కు ఓ చిన్న క్యారెక్టర్ ఇచ్చారని, ఆ పార్టీ స్క్రిప్ట్ ప్రకారం ఆయన మాట్లాడుతున్నారని మంత్రి జయకుమార్ ఆరోపించారు. టీటీవీ దినకరన్ లాంటి వారు ఎంత మంది తయారు అయినా అన్నాడీఎంకే పార్టీని ఏమీ చెయ్యలేరని మంత్రి జయకుమార్ ధీమా వ్యక్తం చేశారు.

గ్యారెంటీగా ఉంటారు
అమ్మ జయలలిత అధికారంలోకి తీసుకువచ్చిన అన్నాడీఎంకే పార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం నేతృత్వంలో పూర్తి చేస్తోందని, అందులో ఎలాంటి సందేహం లేదని మంత్రి జయకుమార్ ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications