చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!
ఇరాన్ వార్ నేపథ్యంలో భారత్ లో ఇంధనం, చమురు కొరత పెరుగుతున్నాయి. పైకి ప్రభుత్వం ఎలాంటి కొరతలూ లేవని రోజూ చెప్తున్నా క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు మాత్రం భిన్నంగా ఉంటున్నాయి. దీంతో వాస్తవ పరిస్ధితిపై సోషల్ మీడియాలో సెటైర్లు సైతం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ అఖిలపక్ష భేటీ (all-party meet) ఏర్పాటు చేసిన కేంద్రం.. దాదాపు గంటా 45 నిమిషాల పాటు వివరణ ఇచ్చింది. దేశంలో గ్యాస్, చమురు నిల్వల పరిస్ధితిపై ఇందులో క్లారిటీ ఇచ్చింది.
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన భద్రతపై ఇవాళ అఖిలపక్ష సమావేశంలో కేంద్రం స్పష్టత ఇచ్చింది. భారతదేశ ఇంధన భద్రత పటిష్టంగా ఉందని, అదనపు చమురు, గ్యాస్ వస్తున్నాయని రాజకీయ పార్టీలకు హామీ ఇచ్చింది. దేశంలో "తగినంత ఇంధన భద్రత" ఉందని, ఇంధన అవసరాలు తగినంతగా తీరుతున్నాయని తెలిపింది. ఇప్పటికే ముందస్తు బుకింగ్‌లు చేశామని, పలు దేశాలతో చర్చలు జరుపుతున్నామని, అలాగే ఎలాంటి అంతరాయం కలగకుండా సరఫరా మార్గాలను కూడా వైవిధ్యపరుస్తున్నామని పేర్కొంది.

హార్ముజ్ జలసంధి ద్వారా ఎల్‌పిజి లభ్యత, రవాణాపై ప్రతిపక్షాలు లేవనెత్తిన ఆందోళనలపై స్పందిస్తూ.. అంతా అదుపులోనే ఉందని, రాబోయే 4-5 రోజుల్లో నాలుగు నౌకలు రేవుకు చేరుకోనున్నాయని తెలిపింది. ఎలాంటి కొరత లేదని, తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ప్రభుత్వం భౌగోళిక రాజకీయాలపై పూర్తి పట్టుతో ఉందని, వెనుకడుగు వేయడం లేదని స్పష్టం చేసింది. ఆందోళన చెందాల్సిన పనిలేదని, అందరినీ కలుపుకొని పోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రతిపక్షం ఎప్పుడైనా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపవచ్చని కేంద్రం హామీ ఇచ్చింది.












Click it and Unblock the Notifications