Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!
ఇరాన్ (iran)వార్ లో అమెరికా వెనక్కి తగ్గడంతో పరిస్ధితులు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ఇరాన్ కు 48 గంటల గడువు ఇచ్చిన ట్రంప్ (Donald trump).. అనూహ్యంగా వెనక్కి తగ్గి ఐదు రోజులు విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేయబోనని, చర్చలు జరుగుతున్నాయని చేసిన ప్రకటన ఆయనకు అనుకోని కష్టాలు తెచ్చిపెడుతోంది. నెల రోజుల పాటు కాల్పుల విరమణకు ట్రంప్ ప్రతిపాదించిన 15 షరతులకు దీటుగా ఇరాన్ ఇవాళ తమ షరతులు చెప్పేసింది. ఇవి చూస్తే కాల్పుల విరమణ సాధ్యమేనా అన్న అనుమానాలు మొదలయ్యాయి.
ఇరాన్ వార్ లో నెల రోజుల కాల్పుల విరమణ కోసం ట్రంప్ 15 కండిషన్లు పెట్టారు. వాటికి బదులుగా ఇరాన్ కూడా తన షరతుల్ని వెల్లడించింది. ఇందులో గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలను మూసివేయడం, ఆంక్షలను ఎత్తివేయడం, కీలకమైన నౌకా రవాణా మార్ హార్ముజ్ పై నియంత్రణ సాధించడం వంటి డిమాండ్లు ఉన్నాయి. ఇరు పక్షాల మధ్య పరోక్ష సంప్రదింపులు జరుగుతున్నా..కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలను తిరిగి ప్రారంభించడానికి ట్రంప్ పెట్టిన నిబంధనలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఇరాన్ తెలిపింది.

గల్ఫ్‌లోని అన్ని అమెరికన్ స్థావరాలను మూసివేయాలని, యుద్ధ నష్టానికి ఆర్థిక పరిహారం చెల్లించాలని, హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడుల్ని అంతం చేయాలని ఇరాన్ ప్రతినిధులు తేల్చిచెప్పారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాలలో ఒకటైన హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల నుండి రుసుములు వసూలు చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఈ డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ నియంత్రణలోకి తీసుకొచ్చే కొత్త ఒప్పందంతో పాటు, దాడులు తిరిగి ప్రారంభం కావనే హామీ కూడా ఈ డిమాండ్లలో ఉంది. ఇందుకు ప్రతిగా ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని ఐదేళ్లపాటు నిలిపివేయడం, యురేనియం శుద్ధి స్ధాయిల్ని తగ్గించడం వంటివి చేస్తానని చెబుతోంది. అలాగే అణు స్థావరాల్ని ఐఏఈఏ తనిఖీలకు అనుమతించనుంది.












Click it and Unblock the Notifications