ఒక రోజే అఖిల పక్షం: ఐదు పార్టీలకే పిలుపు
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై రెండు రోజులు కాకుండా ఒక్క రోజే అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. ముందు అనుకున్నట్లు అఖిలపక్ష సమావేశం రెండు రోజులు కాకుండా ఒక్క రోజుతోనే ముగించనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈనెల 12న అఖిలపక్షం జరగనుంది.
ఈ మేరకు రాష్ట్రంలో ఐదు రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు పంపించింది. మజ్లీస్, కాంగ్రెసు, బిజెపి, సిపిఐ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లకు అఖిలపక్షానికి రావాలని బుధవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ ఫోన్ ద్వారా తెలియజేసింది. అఖిలపక్షాన్ని బహిష్కరిస్తున్నట్లు మూడు రాజకీయ పార్టీలు తెలుగుదేశం, సిపిఎం, వైయస్సార్ కాంగ్రెసు చెప్పాయి. దీంతో ఆ పార్టీలకు కేంద్ర హోంశాఖ ఆహ్వానం పంపలేదు.

దీంతో ఈనెల 12, 13 తేదీల్లో అఖిలపక్షం నిర్వహించాలనుకున్న హోంశాఖ మూడు పార్టీలు లేకపోవడంతో 12వ తేదీ ఒక్క రోజుతోనే ముగించాలని భావించింది. 12వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రారంభించి ఒక్కక్క పార్టీతో 30 నిముషాలపాటు చర్చలు జరపనుంది.
మజ్లీస్ పార్టీకి ఉదయం 11 గంటలకు, బిజెపికి ఉదయం 11.30 గంటలకు, సిపిఐకి 12 గంటలకు జివోఎం సమయం ఇచ్చింది. కాగా, సాయంత్రం ఐదు గంటలకు కాంగ్రెసు పార్టీకి, చివరగా సాయంత్రం 5.30 గంటలకు తెరాసకు సమయం కేటాయించారు.












Click it and Unblock the Notifications