కేరళలో మరో కొత్త వేరియంట్ కలకలం .. వ్యాక్సిన్ డోసులు తీసుకున్నా 40 వేల మందికి పైగా కరోనా !!
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పుడు కేరళ రాష్ట్రానికి కరోనాను కట్టడి చేయడం ఒక ప్రధాన ఈ సమస్య కాగా, దాదాపుగా కేరళలో 40 వేలకు పైగా కేసులు, పూర్తిగా టీకాలు తీసుకున్నవారు, రెండవసారి వ్యాధి సోకిన వారిగా నిర్ధారణ కావడం ఇప్పుడు కేరళ సర్కార్ కు ఆందోళన కలిగిస్తుంది. దేశానికి సైతం వణుకు పుట్టిస్తోంది.
కేరళలో కొత్త కరోనా వేరియంట్ పాత్రపై అనుమానం
కేరళ రాష్ట్రంలో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కేరళ పై దృష్టి సారించి కరోనా కట్టడికి చర్యలు చేపట్టారు. అయితే ఈ క్రమంలో కేరళ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా నమోదవుతున్న కేసుల తీరుతో కొత్త అనుమానం వ్యక్తం చేస్తోంది. కొత్త కరోనా వైరస్ వేరియంట్ వల్ల భారీగా కేసులు నమోదు అవుతున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తాజా అధ్యయనాల ప్రకారం కొత్త కరోనా వేరియంట్ పాత్రను తోసిపుచ్చలేమని వెల్లడించారు.

40వేల కేసులు వ్యాక్సిన్ తీసుకున్న, కరోనా నుండి కోలుకున్న వారే
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మూలాల ప్రకారం, కేరళలో భారీగా 40,000 కి పైగా వ్యాక్సినేషన్ తీసుకున్న వారికి కూడా కరోనా నిర్ధారణ అయింది. ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేరళను సందర్శించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన బృంద నిపుణులు, వ్యాక్సినేషన్ తీసుకున్న వారికి కూడా మళ్లీ ఇన్ఫెక్షన్లు సోకడం, కరోనా నుంచి కోలుకున్న వారికి తిరిగి సంక్రమించడం అనేది రోగనిరోధక శక్తిని తప్పించుకునే ఒక వైవిధ్యం వల్ల కావచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల కేరళలో పెరుగుతున్న కేసుల తీరు థర్డ్ వేవ్ కు సంకేతం అని కూడా అనుమానం వ్యక్తం చేశారు.
కరోనా కొత్త మ్యూటేషన్ పై అనుమానం వ్యక్తం చేస్తున్న నిపుణులు
కొత్త ఉత్పరివర్తన వేరియంట్ యొక్క పాత్ర వల్లనే కేరళ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు మళ్లీ మళ్లీ తిరిగబెడుతున్నాయని, కరోనా వచ్చిన వారికే మళ్ళీపునరావృతం అవుతోందని, దీనిని తోసిపుచ్చలేమని వెల్లడించారు. అయితే డెల్టా వేరియంట్ మరింత పరివర్తన చెందుతుందా అన్న అనుమానం వ్యక్తమవుతున్న సమయంలో, ప్రస్తుతం కేరళలో విజృంభిస్తున్న వేరియంట్ పూర్తిగా కొత్త వేరియంట్‌గా అనుమానించబడుతుందని వారు చెప్తున్నారు. పురోగతి కేసుల నమూనాల సీక్వెన్సింగ్ పై పరిశోధనలు జరగాల్సి ఉందని ఆయన వెల్లడించారు.
టీకా ద్వారా వచ్చే వ్యాధి నిరోధక శక్తి నుండి తప్పించుకునే వేరియంట్ అని అనుమానం
టీకా ద్వారా ఉత్పన్నమయ్యే రోగనిరోధక శక్తి నుండి తప్పించుకునే విభిన్న కరోనావైరస్ వేరియంట్ ఉన్నట్లయితే ఈ పరిశోధనలో వెల్లడి అవుతుందని చెప్తున్నారు. ఇక ఈ వేరియంట్ పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తులలో సంక్రమణకు దారితీస్తుందని, వ్యాక్సినేషన్ సైతం ఈ మ్యూటేషన్ కు పనిచేయదని అభిప్రాయపడుతున్నారు. భిన్నమైన వేరియంట్ ఉందో లేదో తెలుసుకోవటానికి అన్ని పురోగతి ఇన్‌ఫెక్షన్‌ల కోసం జెనోమిక్ సీక్వెన్సింగ్ చేయాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.
40,000 నమూనాల 100% జన్యు శ్రేణి శోధన చేస్తే అసలు విషయం వెలుగులోకి
రోజురోజుకీ కరోనా కొత్త వేరియంట్లు దండ యాత్ర చేస్తున్న వేళ కేరళ రాష్ట్రంలో ఇప్పుడు మరో కొత్త వేరియంట్ దాడి చేస్తుందా అన్న అనుమానం దేశవ్యాప్తంగా భయాందోళనకు కారణమౌతుంది. కొత్త వేరియంట్ యొక్క అవకాశాలను పరిశీలించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పుడు మొత్తం 40,000 నమూనాల 100% జన్యు శ్రేణి శోధనకు ప్లాన్ చేస్తోంది. ఇదే విషయాన్ని కేరళ ప్రభుత్వానికి సైతం తెలియజేశారు. ఇదిలా ఉంటే కోవిడ్ -19 కేసులు పతనంతిట్టలో ఎక్కువగా ఉన్నాయి. కేరళ రాష్ట్రంలోని దాదాపు తొమ్మిది జిల్లాలలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఆగస్టు 15 తర్వాత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బృందం మళ్లీ ఓ మారు కేరళ రాష్ట్రాన్ని సందర్శిస్తుంది.












Click it and Unblock the Notifications