Arvind Kejriwal: కేజ్రివాల్ కు సుప్రీంకోర్టులో మరో ఊరట-ఈడీకి మరో షాక్..!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అరెస్టు తర్వాత తీహార్ లో ఉన్న సీఎం అరవింద్ కేజ్రివాల్ కు సుప్రీంకోర్టు తాజాగా లోక్ సభ ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సీఎంగా ఎలాంటి విధులు నిర్వర్తించకూడదనే షరతుతో ఆయనకు బెయిల్ ఇచ్చింది. దీనిపై ఇప్పటికే బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కేజ్రివాల్ ప్రచారంలో చేసిన ఓ వ్యాఖ్య ఆధారంగా ఆయన బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంను ఆశ్రయించిన ఈడీకి చుక్కెదురైంది.
తాను తిరిగి జైలుకు వెళ్లకుండా ఉండాలంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయాలంటూ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కేజ్రివాల్ చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఆయనకు గతంలో మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ రద్దు చేయాలంటూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అయితే సుప్రీంకోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. అది అతని సొంత అభిప్రాయం అయి ఉండొచ్చని పేర్కొంది.

కేజ్రివాల్ వ్యాఖ్యలు ఆయన బెయిల్ షరతుల ఉల్లంఘనే అంటూ ఈడీ చేసిన వాదనతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించలేదు. కేజ్రివాల్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, దీనిపై తాము చెప్పేదేమీ లేదని తెలిపింది. అలాగే తాము గతంలో చెప్పినట్లుగానే జూన్ 2న ఆయన కోర్టులో లొంగిపోవాల్సి ఉందని తెలిపింది. ఇందులో ఎలాంటి మార్పూ లేదని వెల్లడించింది. ఈ విషయంలో తమపై వచ్చే విమర్శల్ని సైతం స్వాగతిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.












Click it and Unblock the Notifications