
దారుణం : కరోనా రోగిని ముఖమంతా వాచేలా కుట్టిన చీమలు .. విచారణకు ఆదేశం
గుజరాత్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పక్షవాతానికి గురైన కోవిడ్ రోగి ముఖంపై చీమలు పాకుతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. వడోదరాలో సర్ సాయాజీరావు ఆసుపత్రి ఐసీయూలో ఒక కరోనా బాధితురాలు చికిత్స పొందుతుండగా వందలాది చీమలు ఆమె ముఖం పై చేరి ముఖమంతా గుర్తుపట్టకుండా వాచేలా కుట్టాయి. దీనికి సంబంధించిన వీడియోను బాధితురాలి భర్త సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. బాధితురాలిని చీమలు కుట్టిన ఘటనపై విచారణకు ఆదేశించారు.
పక్షవాతంతో బాధపడుతున్న వడోదరలోని సర్ సాయాజీరావు జనరల్ (ఎస్‌ఎస్‌జి) ఆసుపత్రి ఐసియులో చికిత్స పొందుతున్న మహిళా రోగిని ఆసుపత్రిలో ఎవరూ పట్టించుకోలేదని, ఆసుపత్రి నిర్వాహకులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. 5 నిమిషాల క్లిప్‌లో, 50 ఏళ్లలోపు మహిళ ఐ సి యు బెడ్‌పై పడుకుని ట్యూబ్ ద్వారా తినిపించడం కనిపిస్తుంది. ఆమెకు ఏదైనా కావాలా అని బంధువు అడిగినప్పుడు కూడా ఆమె స్పందించలేని పరిస్థితి.

ఇదే సమయంలో ఆమె వాచిన నోటి మూలల నుండి చీమలు బయటకు రావడాన్ని చూసిన ఆమె కుటుంబ సభ్యుడు ఒక నర్సుకు ఫిర్యాదు చేశారు. ఇలాగేనా రోగిని చూసేది అని ప్రశ్నించారు. విధుల్లో ఉన్న సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకున్నారని, ముందురోజు రాత్రి రోగి నోరు కూడా శుభ్రం చేయబడిందని నర్సు చెప్పింది. ఇక ఈ దారుణ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సంఘటన గురించి తెలుసుకున్న తరువాత, ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రంజన్ అయ్యర్ విచారణకు ఆదేశించారు. ఒకవేళ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.ఆస్పత్రి సిబ్బందికి పరిశుభ్రత యొక్క ఉన్నత ప్రమాణాలను పాటించాలని, రోగుల సంరక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కఠినమైన ఆదేశాలు ఇచ్చారు.