అసలే మోడీ పర్యటన: ఏప్రిల్ ఫూల్ చేయాలని కాల్ చేసి అమ్మాయి కటకటాల పాలు
బెంగళూరు: ఏప్రిల్ ఫూల్ చెయ్యాలని భావించిన యువతికి కష్టాలు మొదలయ్యాయి. విమానంలో బాంబు పెట్టారని ఎదుటి వారిని ఫూల్ చెయ్యాలని భావించి కోరి కష్టాలు కొని తెచ్చుకున్న సంఘటన కర్ణాటకలో జరిగింది. కర్ణాటకలోని తురువేకెరె తాలుకాలోని హళ్ళి ప్రాంతంలో 17 సంవత్సరాల యువతి నివాసం ఉంటున్నది.
ఈమె ఏప్రిల్ ఒకటవ తేదిన ఎవరినైనా ఫూల్ చేసి ఆడుకోవాలని భావించింది. అయితే గ్రామంలో ఉన్న వారిని ఫూల్ చేస్తే థ్రిల్ ఉండదని భావించింది. ఎలాగైనా కొందరిని హడలగొట్టే పని చెయ్యాలని అనుకుంది. వెంటనే పక్కంటిలో నివాస ఉంటున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి మొబైల్ ఫోన్ ఇవ్వాలని చెప్పింది.
ఎప్రిల్ 1వ తేదిన మొబైల్ ఫోన్ తీసుకున్న యువతి పోలీసులకు ఫోన్ చేసింది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి వచ్చే ఇండిగో విమానంలో బాంబు పెట్టారని చెప్పింది. వెంటనే ఫోన్ కట్ చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోడి బెంగళూరు పర్యటన సందర్బగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు బాంబు బెదిరింపు ఫోన్ రావడంతో హడలిపోయారు.

వెంటనే ఫోన్ ఎక్కడి నుండి వచ్చిందని ఆరా తీశారు. తురువేకెరె సమీపం నుండి బాంబు బెదిరింపు ఫోన్ వచ్చిందని అధికారులు గుర్తించారు. వెంటనే గ్రామానికి వెళ్లి మొబైల్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. పక్కింటి యువతి తన దగ్గర ఫోన్ తీసుకుందని తనకు ఏమి తెలియదని అతను సమాదానం ఇచ్చాడు.
పోలీసులు యువతిని విచారణ చేశారు. ఏప్రిల్ ఫూల్ చెయ్యాలని తాను ఫోన్ చేశానని ఆ యువతి పోలీసులకు చెప్పింది. మమ్మల్ని ఫూల్ చెయ్యాలని భావించి నువ్వే పెద్ద ఫూల్ అయ్యావని పోలీసులు యువతికి చెప్పారు. యువతిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications