ఆర్మీ అధికారికి బిగ్ షాక్.. 5 ఏళ్ల పాటు విమాన ప్రయాణం నిషేధం.. కారణం ఏంటి..?
ఓ ఆర్మీ అధికారి విమాన సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి వారిపై దాడికి పాల్పడిన కారణంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ అధికారి ఐదేళ్ల పాటు విమాన ప్రయాణం నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆ అధికారిని ఐదేళ్లపాటు 'నో ఫ్లై లిస్టు' లో చేరుస్తూ డీజీసీఏ చర్యలు తీసుకుంది.
జులై 26 న ఓ ఆర్మీ అధికారి శ్రీనగర్ నుంచి దిల్లీకి వెళ్లాల్సి ఉంది. అయితే శ్రీనగర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆ అధికారి నానా రాద్ధాంతం చేశారు. పరిమితికి మించి అదనపు లగేజీని విమానంలోకి తీసుకెళ్లేందుకు ఆర్మీ అధికారి ప్రయత్నించారు. దీంతో స్పైస్ జెట్ సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఆర్మీ అధికారి హింసాత్మకంగా ప్రవర్తించారు. నలుగురు స్పైస్ జెట్ సిబ్బందిని దారుణంగా కొట్టారు. అందులో ఓ ఉద్యోగి స్పృహ కోల్పోయినా వదలకుండా దాడి చేశారు.

ఆర్మీ అధికారి జరిపిన ఈ దాడిలో నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఒకరికి వెన్నెముక విరిగిందని స్పైస్ జెట్ తెలిపింది. చివరకు ఆ ఆర్మీ అధికారిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది నిలువరించారని స్పష్టం చేసింది. అయితే ఆ ఆర్మీ అధికారిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఎయిర్ లైన్స్ అధికారులు ఆ సమయంలో తెలిపారు. ఈ వ్యవహారంపై పౌర విమానయానశాఖకు కూడా లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా డీజీసీఏ ఆర్మీ అధికారిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన్ను ఐదేళ్ల పాటు నో ఫ్లై లిస్ట్ లో చేరుస్తూ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications