మోదీ సర్కారుది దురహంకారం, అందుకే పార్లమెంటులో ప్రతిష్టంభన: 14 విపక్ష పార్టీల సంయుక్త ప్రకటన
పార్లమెంట్ కార్యకలాపాలకు అడ్డుపడుతూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తోన్న విపక్షాల వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లి నిలదీయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో అధికార బీజేపీ ఎంపీలు ఎదురుదాడి చేస్తుండటం, విపక్షాలు సైతం అదే స్థాయిలో రచ్చ చేస్తుండటంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రసాభసగా మారాయి. పెగాసస్ నిఘా ఉదంతం, వ్యవసాయ చట్టాలు తదితర అంశాలపై గడిచిన రెండు వారాలుగా పార్లమెంటులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అంతే, ఈ పరిస్థితికి మోదీ సర్కార్ తీరే కారణమని విపక్షాలు మండిపడుతున్నాయి..
పార్లమెంట్‌లో పెగాసస్ నిఘా కుట్ర, వ్యవసాయ చట్టాలు సహా పలు అంశాలపై చర్చించేందుకు మోదీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుండటంతో ప్రతిష్టంభన నెలకొందని విపక్షాలు ఆరోపించాయి. ఈ మేరకు కాంగ్రెస్, మరో 13 విపక్ష పార్టీలు బుధవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. రైతు వ్యతిరేక సాగు చట్టాలపైన, పెగాసస్‌పైన చర్చ జరపాలని తాము చాలా స్పష్టంగా చెప్పినట్టు ఆ ప్రకటన పేర్కొంది. పార్లమెంటు ప్రతిష్ఠంభనకు విపక్షాలే కారణమంటూ విపక్ష కూటమిపై బురద చల్లుతూ కేంద్రం తప్పుదారి పట్టిస్తోందని నేతలు విమర్శించారు.

పెగాసస్ వ్యవహారంపై చర్చ చేపట్టి హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలన్న డిమాండ్‌కు కట్టుబడి ఉన్నామని విపక్షాలు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. పెగాసస్ వ్యవహారంతో పాటు వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై కూడా చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టాయి. పార్లమెంట్ కార్యకలాపాలను విపక్షాలు స్తంభింపచేస్తున్నాయని మోదీ సర్కార్ దుష్ప్రచారం సాగిస్తోందని భగ్గుమన్నాయి. జాతీయ భద్రతకు సంబంధించిన పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై పార్లమెంట్ ఉభయసభల్లో చర్చ జరిపి హోంమంత్రి సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
పెగాసస్, రైతుల సమస్యలు, వివాదాస్పద సాగు చట్టాల పైనా పార్లమెంట్‌లో చర్చ జరగాలని విపక్షాలు స్పష్టం చేశాయి. తమ డిమాండ్ నుంచి వెనక్కి తగ్గేది లేదని, దీనిపై తామంతా దృఢ వైఖరితో ఉన్నామనీ ఆ పార్టీలు పేర్కొన్నాయి. పార్లమెంటు ప్రతిష్టంభనకు ముమ్మాటికీ కేంద్ర కేంద్ర ప్రభుత్వ దురహంకార, మొండివైఖరే కారణమని నిందించాయి.
సంయుక్త ప్రకటన జారీ చేసిన వారిలో రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, ఎన్‌సీపీ నేత శరద్ పవార్, కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ, డీఎంకే నేత టీఆర్ బాలు, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్‌గోపాల్ యాదవ్, టీఎంపీ నేతలు డెరిక్ ఒబ్రెయిన్, కల్యాణ్ బెనర్జీ, ఆర్జేడీ నేత మనోజ్ ఝా, సీపీఎం నేత ఇ.కరీం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సుశీల్ గుప్తా, ఐయూఎంఎల్ నేత ఈటీ మహమ్మద్ బషీర్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత హస్‌నయిన్ మసూది, సీపీఐ నేత బినయ్ బిశ్వం, ఆర్‌ఎస్‌పీ నేత ఎన్.కె.ప్రేమచంద్రన్, ఎల్‌జేడీ నేత ఎంవీ శ్రేయాంస్ కుమార్ ఉన్నారు.












Click it and Unblock the Notifications