అసోంలో దెబ్బ.. హిమంత విశ్వశర్మపై ఈసీ వేటు, ప్రచారం నిషేధం
అసోంలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ కీలక నేత, స్టార్ క్యాంపెయినర్ హిమంత విశ్వ శర్మపై ఎన్నికల సంఘం రెండురోజులపాటు వేటు వేసింది. ప్రచారంలో పాల్గొనడంపై నిషేధం విధించింది. శుక్రవారం నోటీసులు జారీ చేసింది. శుక్రవారం రాత్రి నుంచే అమల్లోకి రానన్నాయని స్పష్టం చేసింది. హిమంత విశ్వ శర్మ ఇటీవల జరిగిన ఓ సభలో బోడోలాండ్ నేత హంగ్రామా మొహిలరీకి జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

కోక్రాజర్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాల కేసుని ఎన్ఐఏకి అప్పగించామని తెలిపారు. హంగ్రామా సహా బోడోలాండ్ ప్రాంతంలో ఎవరూ అలజడులు సృష్టించడం సహించబోమని వ్యాఖ్యానించారు. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత శర్మపై కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మొహిలరీని జైలుకు పంపుతామని బహిరంగంగా బెదిరించారని తెలిపారు. ఈ నేపథ్యంలో వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిని పరిశీలించిన ఎన్నికల సంఘం శర్మకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
దీనికి సంబంధించి హిమంత ఇచ్చిన సమాధానంతో ఈసీ సంతృప్తి చెందలేదు. దీంతో రెండు రోజుల నిషేధం విధించాలని నిర్ణయించింది. 126 స్థానాలు ఉన్న అసోంలో మార్చి 27న తొలి విడత, ఏప్రిల్ 1న రెండో విడత పోలింగ్ పూర్తయింది. ఏప్రిల్ 6న మూడో దశ పోలింగ్ జరగనుండగా.. మే 2న ఫలితాలు వెలువడతాయి.












Click it and Unblock the Notifications