ఆన్‌లైన్‌లో మద్యం ఆర్డర్, డోర్ డెలివరీ - వీరికి మాత్రమే, కండీషన్స్ అప్లై..!!
మందుబాబులకు ఇక మద్యం ఇంటికే రానుంది. ఇప్పటికే మద్యం రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆదాయ మార్గంగా మారింది. మరింతగా మద్యం అమ్మకాలు పెంచుకోవటంతో పాటుగా వినియోగ దారులను ఆకట్టుకునే నిర్ణయాల దిశగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కరోనా సమయంలోనే మద్యం ఇంటికి డెలివరీ ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ఇక.. ఇప్పుడు ఈ ప్రతిపాదన అమలు దిశగా కసరత్తు జరుగుతోంది. దీని ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డర్.. డోర్ డెలివరీ విధానం అందుబాటు లోకి రానుంది.
మద్యం ప్రియుల కోసం కేరళ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన పైన కసరత్తు చేస్తోంది. మందుబాబుల ఇంటికే మద్యాన్ని డెలివరీ చేసే దిశగా కార్యాచరణ సిద్దం అవుతోంది. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే ఇంటికే మద్యాన్ని సరఫరా చేసేందుకు సంబంధించిన ప్రతిపాదనను ఆ రాష్ట్ర బేవరేజెస్ (మార్కెటింగ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్) కార్పొరేషన్.. రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచిది. దీనివల్ల మద్యం అమ్మకాలతో రాబడి పెరగడానికి, మద్యం విక్రయ దుకాణాల వద్ద రద్దీని తగ్గించడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చడానికి రాష్ట్ర ఆబ్కారీ చట్టంలో సవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ దిశగా వచ్చే వారం నిర్ణయం వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

కేరళ ప్రభుత్వం వద్దకు వచ్చిన ప్రతిపాదనల మేరకు హోమ్ డెలివరీ అమ్మకాల ఆదాయం మరింతగా పెరుగుతుందని ఆశిస్తున్నారు. 2024-25లో, అమ్మకాల ఆదాయం ₹19,700 కోట్లు, గత ఆదాయం రూ 19,050 కోట్లుగా ఉంది. అయితే, ఆన్‌లైన్ మద్యం డెలివరీ కోసం కేరళలో మద్యం అమ్మకాలను పర్యవేక్షించే BEVCO ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించింది. అదే సమయంలో ప్రముఖ ఆన్ లైన్ డెలవరీ సంస్థలు Swiggy, Zomato వంటి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారంలు ఈ సేవలో భాగం కావడానికి ఆసక్తి చూపుతున్నాయి. యాప్ ద్వారా ఆర్డర్ ఇచ్చి, నేరుగా కస్టమర్ ఇంటికే మద్యం పంపే విధానాన్ని అవలంభించనున్నారు. కాగా, BEVCO ప్రతిపాదన ప్రకారం, 23 ఏళ్లకు పైబడిన వారికే ఆన్‌లైన్‌లో మద్యం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఆర్డర్ చేసేముందు వయస్సు ధృవీకరణ పత్రం తప్పనిసరిగా చూపించాలి. దీనికి సంబంధించి త్వరలోనే విధి విధానాలను అధికారికంగా ప్రకటించనున్నారు.












Click it and Unblock the Notifications