మరోసారి లాక్ డౌన్ ప్రకటించిన దేశం .. వారం రోజుల పాటు సమస్తం బంద్
కరోనా కొత్తరకం వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచం మొత్తం మరోసారి గజగజ వణికిపోతోంది. ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి కలవర పెడుతూనే ఉంది. ఒకపక్క కరోనా వైరస్ కు వ్యాక్సిన్ వచ్చి ప్రజలకు ఆరోగ్య రక్షణ కల్పిస్తుంది అని ఆశపడిన అంతలోనే, సూపర్ స్ప్రెడర్ గా దాడి చేస్తున్న కరోనా కొత్త వైరస్ వ్యాప్తి వ్యాక్సిన్ పని చేస్తుందా లేదా అన్న అనుమానాలకు కారణం అవుతుంది. ఇదిలా ఉంటే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భూటాన్ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది.

వారం రోజుల భూటాన్ లాక్ డౌన్
భూటాన్ దేశంలో ఒక వారం రోజులపాటు కంప్లీట్ లాక్ డౌన్ ప్రకటిస్తూ ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. గత రెండు రోజులలో రాజధాని తింఫులో 26 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో భూటాన్ లో డిసెంబర్ 23 నుండి వారం రోజుల పాటు మళ్లీ లాక్డౌన్ విధిస్తున్నట్లు గా ప్రధాని ప్రకటించారు. తాము 23వ తేదీ నుండి భూటాన్ దేశంలో మరోమారు జాతీయ లాక్డౌన్ ప్రకటించామని , తమ దేశంలో కరోనా సామాజిక వ్యాప్తి జరుగుతోందని, ఒక్క రోజులో ఫ్లూ క్లినిక్ ల నుండి తింఫులో 5, పారోలో 3 మరియు లామోజింగ్ఖాలో 1 కేసు నమోదయినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇళ్ళ నుండి బయటకు రావద్దన్న భూటాన్ ప్రధాని
ఈ 8 కేసులు ఆందోళన కరంగా ఉన్నాయని కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని భూటాన్ ప్రధాని లోటే త్సేరింగ్ పేర్కొన్నారు. భూటాన్లను ఇంటి లోపల ఉండమని, ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రధాని కోరారు. ఈసారి వచ్చే నష్టాలు గత జాతీయ లాక్డౌన్ కంటే చాలా పెద్దవని ఆయన తెలిపారు. తింఫులో రెండు రోజుల్లో 26 కేసుల నమోదయినట్లు గా చెప్పిన భూటాన్ ప్రధాని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఒక్క మరణం కూడా నమోదు కాకున్నా కరోనా వ్యాప్తిని ఆపటం కోసం భూటాన్ లాక్ డౌన్
తింఫులో సామూహిక పరీక్షలు ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారని ప్రధాని ప్రకటించారు.భూటాన్ ప్రధానమంత్రి తమ దేశంలో ఒకేసారి 100,000 మందికి పైగా ప్రజలకు టెస్టులు చేయడానికి కావలసిన ఏర్పాట్లను చేశామని పేర్కొన్నారు. డిసెంబర్ 22 న హిమాలయ రాజ్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన బులెటిన్ ప్రకారం, మొత్తం కరోనా కేసులు 479 గా ఉన్నాయి, వాటిలో 430 మంది కోలుకున్నారు. భూటాన్ ఇంకా ఇప్పటివరకు ఒక్క కరోనా మరణాన్ని కూడా నమోదు చేయలేదు. అయినప్పటికీ భూటాన్ లో కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయడం కోసం వారం రోజుల పాటు లాక్డౌన్ విధించారు.