ఉక్కిరి బిక్కిరి అవుతున్న అదానికి భారీ ఊరట..!!
Gautam Adani: పారిశ్రామిక దిగ్గజం, అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల అధినేత గౌతమ్ అదాని దేశ రాజకీయాల్లో వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు. కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా బ్లాక్ కొద్దిరోజులుగా ఆయనపై విమర్శనాస్త్రాలను ఎక్కు పెట్టింది. అదానీ గ్రూప్ సంస్థలపై అమెరికాలో కేసు నమోదు కావడం దీనికి ప్రధాన కారణం.
పార్లమెంట్ ఉభయసభల్లోనూ ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణల దాడికి దిగాయి ప్రతిపక్ష పార్టీలు. సమగ్ర విచారణకు పట్టుబడుతూ వచ్చాయి. సభా కార్యకలాపాలను రోజుల తరబడి అడ్డుకుంటూ వచ్చాయి. వాయిదా తీర్మానాలనూ ఇచ్చాయి. వాటిని ఎన్డీఏ లెక్కచేయలేదు.

రాజకీయంగా తీవ్ర దుమారాన్ని ఎదుర్కొంటోన్న అదానికి మరో కీలక ప్రాజెక్ట్ విషయంలో భారీ ఊరట లభించింది. అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్‌ను బోంబే హైకోర్టు కొట్టివేసింది. వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ ప్రాజెక్ట్ ఇక అదాని గ్రూప్‌కే దక్కడం లాంఛనప్రాయమే అవ్వొచ్చు.
అదే- ధారవి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్. 259 హెక్టార్లల్లలో విస్తరించి.. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరున్న ముంబైలోని ధారవి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ ఇది. విలువ- 5,069 కోట్ల రూపాయలు. 2022లో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించిన బిడ్డింగుల సందర్భంగా దీన్ని దక్కించుకుంది అదాని ప్రాపర్టీస్.
దీన్ని సవాల్ చేస్తూ దుబాయ్‌కు చెందిన సెక్‌లింక్ టెక్నాలజీస్ కార్పొరేషన్ అనే సంస్థ బోంబే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. 2018లోనే ఈ ప్రాజెక్ట్ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం బిడ్డింగులను ఆహ్వానించిందని, అప్పట్లో 7,200 కోట్ల రూపాయలతో తాము బిడ్ వేశామని పేర్కొంది. తమకంటే తక్కువ మొత్తానికి బిడ్ వేసిన అదాని గ్రూప్‌కు ఎలా ఈ ప్రాజెక్ట్ దక్కుతుందని అభ్యంతరం వ్యక్తం చేసింది.
2018లోనే ఈ టెండర్లను మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. 2022లో మళ్లీ తాజాగా ధారవి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ పేరుతో టెండర్లను ఆహ్వానించింది. దీనితో 5,069 కోట్ల రూపాయలతో బిడ్డింగ్ వేసిన అదాని ప్రాపర్టీస్ దీన్ని దక్కించుకుంది. దీన్ని సవాల్ చేస్తూ బోంబే హైకోర్టులో పిటీషన్ వేసింది సెక్‌లింక్ టెక్నాలజీస్.
దీన్ని కోర్టు విచారణకు స్వీకరించింది. బోంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ అమిత్ బోర్కర్ సారథ్యంలోని ఇద్దరు సభ్యుల ధర్మాసనం దీనిపై పలు వాయిదాల్లో విచారణ చేపట్టింది. 2018 నాటి టెండర్ల ప్రక్రియను ఎందుకు అర్ధాంతరంగా రద్దు చేయాల్సి వచ్చిందనే విషయంపై మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణకు కూడా తీసుకుంది. తాజాగా సెక్‌లింక్ పిటీషన్‌ను కొట్టివేసింది.












Click it and Unblock the Notifications