Viral Video: 'బిగ్ బాస్' చూస్తూ బస్సు డ్రైవింగ్.. ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలో..?
సాధారణంగా బస్సు ప్రయాణాన్ని ప్రజలు సురక్షితంగా భావిస్తారు. అందుకే సొంత వాహనాలు ఉన్నా చాలా మంది బస్సుల్లోనే ప్రయాణం చేస్తుంటారు. భద్రత దృష్ట్యా బస్సులనే ఎంచుకుంటారు. అయితే ఇటీవల బస్సు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ తో పాటు ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు సైతం రోడ్డు ప్రమాదానికి గురవుతున్నాయి. ఇటీవల కర్నూలు వద్ద బస్సు దగ్ధం.. అలాగే చేవెళ్ల వద్ద ఆర్టీసీ బస్సుకు రోడ్డు ప్రమాదం.. ఈ రెండు ఘటనల్లో పదుల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో బస్సు ప్రయాణం అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది.
అయితే తాజాగా ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో డ్రైవర్ చేసిన పని చూస్తే రోడ్డు ప్రమాదాలు జరిగేది ఇందుకేనా అన్న సందేహం కలగడం సహజం. డ్రైవింగ్ చేస్తూనే ఆ డ్రైవర్ సెల్ ఫోన్ ముందు పెట్టుకుని ఎంచక్కా వీడియోలు చూస్తున్నాడు. ఓ వైపు బస్సును వేగంగా నడుపుతూనే మరోవైపు దర్జాగా సెల్ ఫోన్ లో వీడియోలు చూస్తున్నాడు. ఈ దృశ్యాల్ని బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా అది కాస్తా వైరల్ గా మారింది.

కర్ణాటకకు చెందిన VRL ట్రావెల్స్ బస్సులో ఈ షాకింగ్ ఘటన జరిగింది. బస్సులోని డ్రైవర్ బిగ్ బాస్ షోను మొబైల్ లో చూస్తూనే బస్సును వేగంగా అంటే గంటకు 80 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్న దృశ్యాలు ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఘటన అక్టోబర్ 27న జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ బస్సు ముంబై నుంచి హైదరాబాద్ బయల్దేరింది. మార్గమధ్యలో బస్సు నడుపుతూనే డ్రైవర్ బిగ్ బాస్ చూడటాన్ని గమనించిన ఓ ప్రయాణికుడు డోర్ చాటునుంచి ఆ దృశ్యాల్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
ఈ వీడియో వైరల్ కావడంతో VRL ట్రావెల్స్ స్పందించినట్లు తెలుస్తోంది. డ్రైవర్ పై తక్షణ చర్యలు చేపట్టింది. తక్షణమే ఉద్యోగం నుండి తొలగించినట్లు.. కంపెనీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది. అయితే ఇలాంటి ఘటనలు ప్రజల్లో మరింత భయాందోళనలను నింపుతున్నాయి.












Click it and Unblock the Notifications