బీహార్ ఫలితాల వేళ మహాకూటమికి ప్రలోభాల భయం- పాట్నాకు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్లు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ మహాకూటమిలో టెన్షన్ పెరుగుతోంది. ఎగ్జిట్ పోల్స్‌లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి విజయం తథ్యమంటూ దాదాపు అన్ని సర్వేలు ప్రకటించినా.. అధికార ఎన్డీయే ప్రలోభాలకు దిగవచ్చన్న పుకార్లు ఊపందుకున్నాయి. దీంతో మహాకూటమిలోని పార్టీలన్నీ అప్రమత్తమవుతున్నాయి.
Recommended Video
గతంలో మణిపూర్, గోవా వంటి రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించినా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ ఈసారి బీహార్‌లోనూ అలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే బీహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజైన మంగళవారం ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఏర్పాట్లు చేస్తోంది. ముందుజాగ్రత్త చర్యగా పార్టీలో యువ ట్రబుల్ షూటర్లు రణ్‌దీప్ సూర్జేవాలా, అవినాష్ పాండేలను పాట్నాకు పంపింది. పార్టీ అభ్యర్ధులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకూ అక్కడే ఉండాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇద్దరు నేతలను ఆదేశించారు.

బీహార్ అసెంబ్లీ పోరులో ఫలితాలు పోటాపోటీగా ఉండొచ్చన్న ఎన్డీయే అంచనాల నేపథ్యంలో మహాకూటమిని ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయించేలా సీనియర్ పార్టీ అయిన కాంగ్రెస్ తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే ముందుగా తమ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్ధులందరినీ పాట్నాలోని ఓ హోటల్‌కు తరలించాలని నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో పార్టీ టికెట్‌పై పోటీ చేసిన 70 మందిలో 40 నుంచి 45 మంది ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం ఉందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. అందుకే గతంలో రాజస్ధాన్, పంజాబ్ ఎన్నికల ఫలితాల సందర్భంగా ఎమ్మెల్యేలను కాపాడుకున్నట్లుగానే ఈసారి కూడా క్యాంప్ రాజకీయాలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.
మరోవైపు మహాకూటమిని నడిపిస్తున్న ఆర్జేడీ కూడా ఫలితాల వేళ పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా గెలిచినా, ఓడినా అభ్యర్ధులు సంయమనంతో వ్యవహరించాలని కోరుతోంది. వీరిలో అత్యధికులు నేరచరిత్ర కలిగిన వారు కావడంతో ప్రభుత్వ ఏర్పాటు వేళ సంబరాల పేరుతో ప్రత్యర్ధులపై దాడులకు దిగకుండా అడ్డుకట్ట వేసేందుకు ఆర్జేడీ నేత తేజస్వి ప్రయత్నిస్తున్నారు. ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజలు కోరుకున్న విధంగా అభివృద్ధికి తాము అండగా నిలుస్తామని ఆర్జేడీ తన తాజా ట్వీట్‌లో పేర్కొంది.












Click it and Unblock the Notifications