నవంబర్ 14 తర్వాత.. కేంద్రం ఆ దిశగా అడుగులు?
One Nation One Election: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ ముగిసింది. రికార్డు స్థాయిలో 64.66 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడానికి తెల్లవారు జాము నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చున్నారు. ఇక చివరిదైన రెండో విడత పోలింగ్ ఈ నెల 11వ జరుగనుంది. 14వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితం.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ భవితవ్యాన్ని ఖరారు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్డీఏ గెలిస్తే.. ముందుగా అనుకున్నట్టే 2027లో జమిలి ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ దిశగానే కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోన్నట్లు తెలుస్తోంది. 2027 ఫిబ్రవరి నుంచి ఆరు నెలల్లో విడతల వారీగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జమిలి ఎన్నికలను నిర్వహించేలా కేంద్రం చర్యలు తీసుకుంటోన్నట్లు సమాచారం.

అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలతో పాటు స్థానిక సంస్థలకూ ఒకేసారి మధ్యంతర ఎన్నికలను నిర్వహించడానికి ఉద్దేశించిన బిల్లు ఇది. జమిలి ఎన్నికల బిల్లులో ఏవైనా సవరణలు ఉంటే ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ సూచనలు, సలహాలను అందజేసింది. దానికి అనుగుణంగా ఇందులో మార్పులు చేర్పులు చోటు చేసుకోవచ్చు. ఇది అమలులోకి వస్తే 2027 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్‌సభకు ఎన్నికలు జరిగే అవకాశాలు లేకపోలేదు.
బీహార్ లో బీజేపీ, ఎన్డీఏ సంకీర్ణ కూటమి గెలిచే అవకాశాలు లేకపోతే తప్ప జమిలి ఎన్నికలు వాయిదా పడే అవకాశం దాదాపుగా లేవు. ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనేది కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందనే పాయింట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లులో స్పష్టంగా పొందుపరిచారు. ఎన్నికల వాతావరణం తమకు అనుకూలంగా లేకపోతే కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసుకుంటుందే తప్ప 2027లో జమిలి నిర్వహించాలని ఇదివరకే నిర్ణయం తీసుకుంది కూడా.
సాధారణంగా ఆ ఏడాది ఫిబ్రవరి లేదా జూన్‌లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ గతంలో వార్తలు వెలువడ్డాయి. దేశంలో జమిలి ఎన్నికలు కొత్తేమీ కాదు. 1951 నుండి 1967 వరకు లోక్‌సభ, అన్ని రాష్ట్రా శాసనసభలకు ఎన్నికలు ఒకేసారి జరిగాయి. 1951- 52లో తొలిసారిగా లోక్‌సభ, శాసనసభలకు మొదటిసారిగా సార్వత్రిక ఎన్నికలను నిర్వహించారు. 1957, 1962, 1967 నాటి ఎన్నికల వరకూ అదే సంప్రదాయం కొనసాగింది.
కొన్ని రాష్ట్రాల శాసనసభలు మధ్యంతర ఎన్నికలకు వెళ్లాల్సి రావడం వల్ల 1968- 69 మధ్యకాలంలో జమిలికి తొలిసారిగా బ్రేక్ పడింది. 1970 నాటి లోక్‌సభ కూడా ముందస్తుగా రద్దయింది. ఆ తరువాత 1971లో లోక్‌సభకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి జమిలి మళ్లీ పునరుద్ధరణకు నోచుకోలేదు. ఇప్పుడు మళ్లీ కేంద్రం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది.












Click it and Unblock the Notifications