జైలర్ గదిలో గ్యాంగ్ స్టర్, ఖైదీ సంసారం
పాట్నా: జైలర్ గదిలో అండర్ ట్రయల్ ఖైదీ, గ్యాంగ్ స్టర్ కాపురం చేసిన ఘటన బీహార్ లో సంచలనం కలిగించింది. అండర్ ట్రయల్ ఖైదీ (మహిళ), గ్యాంగ్ స్టర్ జైలులో సంసారం చేసుకోవడానికి వీలు కల్పించిన అధికారులు, సిబ్బంది మీద వేటు పడింది.
బీహార్ లో గ్యాంగ్ స్టర్, షార్ప్ షూటర్ ముఖేష్ పాఠక్, పూజాకుమారి దంపతులు ఉంటున్నారు. గత సంవత్సరం వేరువేరు కేసుల్లో వీరిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తరువాత బీహార్ లోని షివోహర్ జైలుకు తరలించారు.
ఇద్దరూ వేరువేరు గదుల్లో ఉంటున్నారు. అయితే ముఖేష్ పాఠక్ జైలు సిబ్బందికి తాయిలాలు ముట్టచెప్పి అసిస్టెంట్ జైలర్ గదిలో కాపురం చెయ్యడం మొదలు పెట్టారు. ఈ విధంగా వీరి సంసారం జైలులోనే జరిగింది.

ఫలితంగా పూజాకుమారి గర్బం దాల్చిందని వెలుగు చూడటంతో అధికారులు షాక్ కు గురైనారు. ఇదే సమయంలో ముఖేష్ పాఠక్ జైలు నుంచి తప్పించుకుని పరారైనాడు. విషయం తెలుసుకున్న జైళ్ల శాఖ అధికారులు సీరియస్ అయ్యారు.
షివోహర్ జైలు జైలర్, అసిస్టెంట్ జైలర్ తో పాటు సిబ్బంది మీద వేటు వేశారు. షివోహర్ జిల్లా మేజిస్ట్రేట్, ముజఫర్ పుర సెంట్రల్ జైలు సూపరిండెంట్ దర్యాప్తు చేస్తున్నారు. జైలులో దంపతులు సంసారం చెయ్యడానికి అవకాశం కల్పించిన సిబ్బంది మీద విచారణ జరుగుతున్నది.
జైలు నుంచి తప్పించుకుని పరారైన గ్యాంగ్ స్టర్, షార్ప్ షూటర్ ముఖేష్ పాఠక్ బీహార్ లో బలమైన నేరగాడు సంతోష్ షా గ్యాంగ్ లో ఉన్నాడని పోలీసు అధికారులు చెప్పారు. దర్బాంగ ఇంజనీర్ల హత్య కేసులో కీలక నిందితుడైన ముఖేష్ పాఠక్ ప్రస్తుతం నేపాల్ లో తలదాచుకున్నాడని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications