స్కూల్ పిల్లలపైకి దూసుకెళ్లిన వాహనం: 9మంది మృతి, పలువురుకి గాయాలు
ముజఫర్‌పూర్: బీహార్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాలలో తరగతులు పూర్తయ్యాక ఇళ్లకు బయలుదేరిన చిన్నారులను వాహన రూపంలో వచ్చిన మృత్యువు క్షణాల్లో బలితీసుకుంది.
వేగంగా దూసుకొచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టడంతో 9 మంది చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. ముజఫర్‌పూర్ శివార్లలో మైనాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అహియాపూర్-ఝపాహా వద్ద ధర్మ్‌పుర్ మాధ్యమిక పాఠశాల వెలుపల శనివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

తరగతులు ముగిసిన అనంతరం విద్యార్థులు ఇళ్లకు బయలుదేరగా.. వేగంగా వచ్చిన బొలెరో వాహనం నియంత్రణ కోల్పోయి పాఠశాల వెలుపల వారిని ఢీకొట్టిందని జిల్లా ఎస్పీ వివేక్ కుమార్ తెలిపారు. అనంతరం పాఠశాల ప్రహరీని ఢీకొని ఆగిపోయిందని చెప్పారు.
వాహనం నడిపిన వ్యక్తి.. వెంటనే అక్కడ్నుంచి పారిపోయాడని తెలిపారు. గాయపడ్డ చిన్నారులకు శ్రీకృష్ణ వైద్య కళాశాల-ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు.. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని ధ్వంసం చేశారు. పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.












Click it and Unblock the Notifications