వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బర్త్ ప్లానింగ్: కాన్పు సమయంలో ప్రణాళికబద్ధంగా వ్యవహరించడమే తల్లీబిడ్డలకు రక్ష

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
తల్లీ బిడ్డ

"వచ్చే నెలంతా క్లాసులు చెప్పడానికి రాలేను, మా ఆవిడ డెలివరీ టైం కదండీ" అన్నారు మా అమ్మాయికి సంగీతం చెప్పే మాస్టారు.

"అవునసలే కవలలు కదా! రిస్క్ ఎక్కువ. ముందు నుంచీ సీనియర్ గైనకాలజిస్టుకు చూపిస్తూ మంచి పని చేశారు. మరేం ఆందోళన పడకండి" అన్నాను.

"అదేం లేదు మేడం, పోయిన నెలలోనే వాళ్ల పుట్టింట్లో దింపి వచ్చాను. మొదటి కాన్పు కదా" అన్నారాయన.

"అదేమిటండీ? అన్ని సదుపాయాలు ఉండే హైదరాబాద్ నుంచి ఆ చిన్న ఊరికి కాన్పు కోసం పంపడం ఏమిటి? పైగా అమ్మాయి ఆరోగ్యం కూడా బాగోలేదన్నారు!"

“మన సంప్రదాయం కదండీ..” అంటూ గొణిగారాయన నా ముఖంలో మొదలైన కంగారు, కోపం గమనించి.

"మన అమ్మాయికీ, పుట్టబోయే బిడ్డలకూ ప్రమాదం కదండీ." నవ్వుతూ అందామనుకున్నా చురక అంటించకుండా ఉండలేకపోయాను.

“ఇదిగోండి మాస్టారూ… సరిగ్గా ఇలానే మొదలవుతాయి కొత్త సమస్యలు.

అసలు చెప్పాలంటే, ప్రతి గర్భిణికీ, తల్లిదండ్రులు కాబోతున్న ప్రతి జంటకీ బర్త్ ప్లానింగ్ చాలా అవసరం. కాన్పు సమయంలో ఎదురయ్యే అనుకోని అవాంతరాలను సజావుగా దాటాలంటే అది చాలా ముఖ్యం.

“చైల్డ్ ప్లానింగ్ లాగ ఈ బర్త్ ప్లానింగ్ ఏంటి మేడమ్?”

“అవును మరి, ఇంత పోటీ ప్రపంచంలో బిడ్డ పుట్టిన దగ్గర నుంచీ ఎన్నో ప్లాన్ చేస్తాం మనం. ఫస్ట్ బర్త్ డే, బెస్ట్ స్కూల్, నచ్చిన బొమ్మలు, మెచ్చిన బట్టలు, ఏ కాలేజిలో ఏ గ్రూప్, ఎక్కడ కోచింగ్, హాబీలు, హాలిడే ట్రిప్పులు, ఏ దేశంలో ఉద్యోగం చేయాలి, ఏ ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని/అబ్బాయిని చేపట్టాలి…. ఇలా ఇన్ని ప్లాన్ చేసుకుని, ఎప్పుడు ఎంతమందిని కనాలో కూడా ఫిక్సయిపోయి కాన్పుకు మాత్రం పట్నం నుంచి పల్లెటూరా? ప్లానింగ్ అక్కర్లేదూ?”

తొడుకున్న చెప్పులు విప్పి, మళ్లీ కుర్చీ లాక్కుని కూర్చున్నారు మాష్టారు.

“అదంతా నాక్కొంచెం వివరంగా చెప్పండి మేడమ్.”

చివరి నెలల్లో తరచూ పరీక్షలు చేయించుకోవాలి

కాన్పు సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

మన దేశంలో, కాన్పు సమయంలో ప్రతి లక్ష మంది తల్లుల్లో 130 మంది, పుట్టే ప్రతి వెయ్యిమంది పిల్లల్లో 28 మంది చనిపోతున్నారు.

ఇందులో అధిక భాగం మరణాలు పురిటి నొప్పుల సమయంలో, కంటున్నప్పుడు, లేదా మొదటి 24 గంటల్లో సంభవిస్తాయి.

ఈ తల్లీపిల్లల ప్రసవ సంబంధిత సమస్యలన్నీ కేవలం తల్లి అనారోగ్యం వలన ఉత్పన్నమయ్యేవేకావు. ఎన్నో సామాజిక, సాంస్కృతిక అలవాట్లు ఇందుకు కారణం.

నష్టాలు..

1. రాబోయే సమస్యని గుర్తించలేకపోవడం

2. సరైన సమయంలో సరైన చికిత్సకు దూరమవడం

3. అత్యవసర పరిస్థితుల్లో ఇతరులు నిర్ణేతలై ఉండటం

4. ఎక్కడ ఎటువంటి సదుపాయాలుంటాయో తెలియకపోవడం

5. మానసికంగా ఆర్థికంగా సంసిద్ధులవకపోవడం

అందుకే, ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ఉత్తమ మార్గం గర్భందాల్చే అవకాశం ఉన్న ప్రతి స్త్రీ, ఆమె కుటుంబ సభ్యులు ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం.

దీనికి ఒక పది అంచెల ప్లాన్ సిద్ధం చేసుకోవాలి.

అదేమిటంటే….

  • గర్భం దాల్చేముందు స్త్రీ వయసు, శారీరక ఆరోగ్యం, మానసిక సంసిద్ధత.
  • చదువు, ఉద్యోగం, కుటుంబ పరిస్థితి ఏమిటి?
  • గర్భందాల్చిన వెంటనే వైద్యుల వద్ద నమోదు
  • క్రమం తప్పని వైద్య పరీక్షలు, తేదీ ప్రకారం రిపోర్ట్స్ ఫైల్ చేసుకోవడం
  • ప్రసవానికి సరైన ఆస్పత్రి, డాక్టరును గుర్తించి పెట్టుకోవడం
  • పుట్టబోయే బిడ్డకు ఏమైనా అవాంతరాలొస్తే ఏమి చేయాలి, అవసరమయితే పిల్లల వైద్యుల/జెనెటిస్ట్ కౌన్సిలింగ్
  • సరైన రవాణా సదుపాయాలున్నాయా, లేవా
  • ఆర్థికంగా సంసిద్ధులమై ఉన్నామా
  • మనిషి సహాయం చూసి పెట్టుకున్నామా
  • రక్తదానం చేయగలవారికి చెప్పి పెట్టుకోవడం, వీలైతే నిల్వ ఉంచడం.

ఆఖరి నెలలో జాగ్రత్తగా ఉండాలి

ఎనిమిది, తొమ్మిది నెలల వరకూ అంతా సజావుగా ఉన్నా, ఆఖరి నెలలో ఎంతో మెలకువగా వ్యవహరించాలి.

ఏ సమయంలోనైనా గర్భిణిని హాస్పిటల్‌కు తీసుకెళ్లగలిగే సదుపాయం గానీ, మనిషిగానీ సదా అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.

అత్యవసర చికిత్సలు సైతం ఇవ్వగలిగే ఆస్పత్రిని గుర్తించి పెట్టుకోవాలి. ముందు నుంచీ ప్రెగ్నెన్సీ ఫాలో అప్ చేస్తున్న చోటే అయితే మరీ మంచిది.

అనుకోని ఆరోగ్య సమస్యలు చాలావరకూ ఎమర్జెన్సీ సమస్యలు కూడా అయి ఉంటాయి. అట్టే సమయమివ్వవు.

ఉదాహరణకు, నెలలు నిండకముందే నొప్పులు రావడం, ఉమ్మనీరు పోవడం, రక్తస్రావం, లోపలి బిడ్డ తిరగకపోవడం, బీ.పీ. పెరగడం లాంటివన్నమాట.

రవాణా, వైద్య సదుపాయాలు అనుకున్నంతగా లేని గ్రామీణ ప్రాంతాలు మన దగ్గర చాలా ఎక్కువే. అలాంటిది, సదుపాయం ఉన్నచోటు నుంచి లేని చోటుకు పోయి ఉండటం, పైగా రిస్కు ఎక్కువ ఉన్నప్పుడు సంప్రదాయం అనిపించుకోదు. అది బాధ్యత లేనితనం మాత్రమే.

అందుకే ఆ పాత చింతకాయ పద్ధతులు పక్కన పెట్టి, మనకు, మనవాళ్లకు క్షేమకరమైన పంథాలో నడవండి.

ఒకటి కంటే ఎక్కువ పిండాల గర్భం, గర్భంతో పాటు అధిక రక్తపోటు, షుగర్ ఉండటం, పిండం బరువు తక్కువగా ఉండటం, అవకరాలతో ఉండటం, అసహజమైన పొజిషన్లో ఉండటం లాంటి పరిస్థితుల్లో పుట్టబోయే బిడ్డకు ప్రమాదం ఉండవచ్చని ముందే గ్రహించవచ్చు.

అలాంటప్పుడు కూడా ప్రసూతితో బాటు నవజాత శిశు సంరక్షణ అందుబాటులో గల ఆస్పత్రిని ఎంచుకోవాలి.

తొలి కాన్పు, కవల పిల్లలై, రక్తం తక్కువగా ఉండి, బీ.పీ. ఎక్కువగా ఉంటే నెలలు నిండక ముందే కాన్పు అవ్వొచ్చు. తల్లికి రక్తం ఎక్కించాల్సి రావచ్చు, బిడ్డలు తక్కువ బరువుతో పుట్టొచ్చు.

అందుకే సరైన ప్రసవ ప్రణాళిక, సంసిద్ధత అవసరం. ఒక సీనియర్ గైనకాలజిస్ట్ పర్యవేక్షణ, సిజేరియన్‌కు మానసికంగా తల్లిని సిద్ధం చేయటం, తగినంత డబ్బు సమకూర్చుకోవటం, రక్తం నిల్వ ఉంచుకోవడం, పిల్లలకు ఐ.సి.యు సదుపాయం, ఇంటిని తల్లి బిడ్డలకు సౌకర్యవంతంగా సర్ది ఉంచటం, ఇంటి పని, పిల్లల పనులకు మనిషి సహాయం.. ఇలా ఉండాలన్నమాట బర్త్ ప్లానింగ్ అండ్ ప్రిపేర్డ్ నెస్ అంటే.

సాధారణ కాన్పు, సిజేరియన్

ఎలాగైనా సాధారణ కాన్పే కావాలి అని పట్టుబట్టకండి. తల్లీబిడ్డల క్షేమం కోరి ఏది మంచి పద్ధతని డాక్టరు నిర్ణయిస్తారో దాన్ని స్వీకరించండి.

అపోహలు అపనమ్మకాలకు తావిచ్చి ఆపై అనర్థాలు కొనితెచ్చుకోకండి. లైఫ్ స్టయిల్నిబట్టి కొన్ని మార్పులను స్వీకరించక తప్పదు.

అంతేకాదు, తల్లి ఆరోగ్యం, అదనపు పోషకాహారం, విశ్రాంతి, ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ మొదలైన విషయాల్లో నిపుణుల సూచనలు తీసుకోండి. అవన్నీ తు.చ. తప్పక పాటించండి.

వాతం, పత్యం అని బాలింతకు తగినంత నీరు ఇవ్వకపోవడం, ఆహారం ఇవ్వకపోవటంలాంటివి చేయకండి.

సిజేరియన్ అయినా నొప్పికి, ఇన్ఫెక్షన్ల నివారణకు మంచి మందులు అందుబాటులో ఉన్న ఆధునిక కాలమిది.

అమ్మ, అమ్మమ్మల కాలం నాటి పద్ధతులకు ఎంతవరకూ వైజ్ఞానిక విలువ ఉందో ఆలోచించి ఆచరించండి.

బిడ్డ పుట్టిన గంట లోపే తల్లి పాలు తాగించడం శ్రేయస్కరం

కాన్పు తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు

మంచి ఆహారం, మానసిక ఆరోగ్యం ఉంటేనే తల్లి, బిడ్డకు పాలు చక్కగా ఇవ్వగలుగుతుంది. ఆ దిశగా సరైన ప్రోత్సాహాన్ని ఇవ్వటం కూడా మనందరి సమిష్టి బాధ్యత.

ఇక నవ జాతశిశువు విషయానికొస్తే, పుట్టగానే స్నానానికి తొందరేమీ లేదు. కానీ, గంట గడిచే లోపే పాలు పట్టించాలి.

ప్రతీ రెండుగంటలకొకసారి కనీసం ముప్ఫై మి.లీ.ల పాలు తాగించాలి. దీనివల్ల నియోనేటల్ హైపోగ్లైసీమియా(రక్తంలో చక్కెర శాతం తగ్గి పసిపిల్లలు కోమాలోకి వెళ్లడం, ఫిట్స్ రావడం) రాదు.

తల్లిపాలు శ్రేష్ఠం. తల్లి రొమ్ము పట్టించండి. తప్పనిసరి పరిస్థితుల్లో నర్స్ సమక్షంలో ఫార్ములా పాలు ఉగ్గుగిన్నెతో పట్టండి.

తేనె నాకించడం, ఆవుపాలు లేదా చక్కెర నీళ్లు పట్టించడంవల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ.

బట్టలు వేయాలి. బిడ్డను వెచ్చగా ఉంచటం అతిముఖ్యం.

మాడుకు నూనె పెట్టడం, బిడ్డ మెదడుకు మంచిదనుకోవడం ఒక అపోహ మాత్రమే.

మొదటి మూడు రోజులపాటూ ప్రతిరోజూ, ఐదవ రోజు,ఏడవ రోజు పిల్లల డాక్టర్‌కు చూపించండి.

మొదటి ఆరునెలలు కేవలం తల్లిపాలే బిడ్డకు ఆహారం. బిడ్డ బరువు, ఎదుగుదలకు సంబంధించి డాక్టర్‌ను క్రమం తప్పకుండా కలవండి. టీకాలు తప్పనిసరిగా సూచించిన సమయానికి ఇప్పించండి.

“ఇన్ని బాధ్యతలుంటాయి మరి కాన్పు, తల్లీబిడ్డల సంరక్షణ అంటే. మీరిలా పుట్టింటికి పంపించి పనైపోయింది అనుకుంటే ఎలాగండీ?” అని మా మాస్టారిని మందలించాను.

"అవును కదా మేడం! నేనిప్పటివరకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని దగ్గర నుంచి చూసింది లేదు. ఎవర్నీ అడిగి తెలుసుకుంది లేదు. సరైన సమయంలో సరైన దిశానిర్దేశం చేశారు మీరు. నేనిప్పుడే ఆ పనిలో పడతాను. కాబట్టి వచ్చే నెల కాదు, ఇప్పటి నుండే సెలవు తీసుకుంటాను.”

ఇప్పుడు ఆశ్చర్యపోవడం నావంతయింది. అయినా తప్పదు కదా, సంతోషంగా థాంక్యూ, ఆల్ ద బెస్ట్ చెప్పుకొని వీడ్కోలు తీసుకున్నాం.

(వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించడానికి రాసిన కథనం. ఇందులోని పాత్రలు, నేపథ్యం కల్పితం. నిజమైన వ్యక్తులతో, జీవించి ఉన్న లేదా చనిపోయిన ఎవరితోనైనా ఏదైనా సారూప్యం ఉన్నట్లయితే అది పూర్తిగా యాదృచ్ఛికం. రచయిత వైద్యురాలు.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Birth planning: The best way for a baby to survive is to plan ahead
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X