పంజాబ్ లో పోరు మెదలుపెట్టేసిన బీజేపీ-చండీఘడ్ వివాదంతో మొదలు-మాన్ కౌంటర్లు
పంజాబ్ లో తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల్ని ఊడ్చేసి అధికార పగ్గాలు చేపట్టిన ఆప్ కు కష్టాలు మొదలయ్యాయి. బీజేపీయేతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ వస్తున్న కేంద్రం.. ఇప్పుడు పంజాబ్ పైనా అదే ప్రయోగం చేస్తోంది. ఇందులో భాగంగా పంజాబ్,హర్యానాల రాజధాని అయిన కేంద్రపాలిత ప్రాంతం చండీఘడ్ లో ఉద్యోగులకు కేంద్ర ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ వ్యవహారం ఆప్ సర్కార్, కేంద్రానికి మధ్య చిచ్చు రేపుతోంది.
చండీగఢ్ పరిపాలన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలను వర్తింపజేసే నిర్ణయాన్ని ప్రకటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై పంజాబ్ ప్రభుత్వం కౌంటర్ అటాక్ కు దిగింది. చండీగఢ్‌పై సరైన హక్కు కోసం గట్టిగా పోరాడతామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. ఈ చర్య బీజేపీ భయానికి అద్దంపడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం చండీగఢ్ పరిపాలనలో ఇతర రాష్ట్రాలు, సేవలకు చెందిన అధికారులను, సిబ్బందిని దశలవారీగా వాడుతోంది. ఇది పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 1966 స్ఫూర్తికి విరుద్ధమని భగవంత్ మాన్ ట్వీట్ చేశారు. పంజాబ్ చండీగఢ్‌పై తన న్యాయమైన హక్కు కోసం గట్టిగా పోరాడుతామన్నారు.

అయితే కేంద్రం మాత్రం తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటోంది. కేంద్రం నిర్ణయంతో చండీగఢ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ప్రయోజనం పొందుతారని అమిత్ షా ప్రకటించారు. కేంద్రపాలిత ప్రాంతంలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు ఇప్పుడు 58 నుండి 60 సంవత్సరాలకు పెరుగుతుందని, మహిళా ఉద్యోగులకు ఇప్పుడు రెండు సంవత్సరాల పిల్లల సంరక్షణ సెలవు లభిస్తుందని తెలిపారు. మరోవైపు ఆప్‌తో పాటు పంజాబ్‌లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్, అకాలీదళ్ కూడా ఈ ప్రకటనపై విరుచుకుపడ్డాయి.ఆప్ ఎదుగుదలను చూసి బీజేపీ భయపడుతోందని ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు.












Click it and Unblock the Notifications