బీజేపీ నేత అమిత్ మాలవీయ ట్వీట్ .. ఫేక్ న్యూస్ అని ఫ్లాగ్ చేసిన ట్విట్టర్ ..భారత్ లో తొలిసారి అంటున్న ప్రతిపక్షాలు
ఒక వృద్ధుడైన సిక్కు రైతు మీద పారామిలిటరీ దుస్తుల్లో ఉన్న ఒక పోలీసు లాఠీ ఝుళిపిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటో ప్రతిపక్ష పార్టీలకు అధికార పక్షంపై దాడి చెయ్యటానికి టార్గెట్ అయింది.ఈ నేపథ్యంలో బీజేపీ సోషల్ మీడియా చీఫ్ అమిత్ మాలవీయ చేసిన ట్వీట్ ను వక్రీకరించిన మీడియా అంటూ ట్విటర్ ఫ్లాగ్ చేసింది. భారతదేశంలో నకిలీ వార్త అంటూ ట్విట్టర్ ఫ్లాగ్ చేయడం ఇదే మొదటిసారి చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఒక యువ జవాను ఒక వృద్ధ రైతు పై లాఠీ ఎత్తిన చిత్రం సోషల్ మీడియాలో వైరల్ .. రాహుల్ ట్వీట్
కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ ,కేరళ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల రైతులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. గత ఏడు రోజులుగా రైతులు చలో ఢిల్లీ ఆందోళనలో భాగంగా ఢిల్లీ బార్డర్ లో నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఒక యువ జవాను ఒక వృద్ధ రైతు పై లాఠీ ఎత్తిన చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆ చిత్రాన్ని ట్వీట్ చేసి కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

ఫ్యాక్ట్ చెక్ అంటూ మరో ట్వీట్ చేసిన బీజేపీ నేత అమిత్ మాలవీయ
రాహుల్ గాంధీ ట్వీట్ కు కౌంటర్ గా బీజేపీ నేత అమిత్ మాలవీయ నవంబర్ 28న ఫ్యాక్ట్ చెక్ ట్వీట్ ను పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ చేసిన పోస్ట్ కరెక్ట్ కాదంటూ ఆయన ఒక వీడియోను షేర్ చేశారు. అందులో పోలీసు లాఠీ ఎత్తేప్పటికి రైతు ఆ దెబ్బ నుండి తప్పించుకోవడం కనిపిస్తుంది.
పోలీసులు ఆందోళనకారులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్న సమయంలో, రైతులను పోలీసులు కొట్టలేదని బిజెపి నాయకులు సమర్థించుకోవడానికి ప్రయత్నించారు .

అమిత్ మాలవీయ ట్వీట్ ను మ్యానిప్యులేటేడ్ అంటూ ఫ్లాగ్ చేసిన ట్విట్టర్
అయితే ఆల్ట్ న్యూస్ ఇదే సంఘటనకు సంబంధించిన సుదీర్ఘ వీడియోను పోస్ట్ చేసింది. అందులో పోలీసులు నిరసనకారులపై లాఠీ ఝుళిపించటం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో మాలవీయ ఎడిట్ చేసిన వీడియోను పోస్ట్ చేశారని విమర్శలు వెల్లువ గా మారాయి.
ఇదే సమయంలో ట్విట్టర్ కూడా స్పందించింది. ట్విట్టర్ విధానం ప్రకారం వక్రీకరించిన సమాచారం కలిగి ఉన్న ట్వీట్లను ఫ్లాగ్ చేయవచ్చు . దీంతో ట్విట్టర్ మోసపూరితంగా మార్చిన కల్పితమైన ట్వీట్లను లేబుల్ చేసే క్రమంలో అమిత్ మాలవీయ ట్వీట్ కూడా మానిప్యులేటెడ్ అంటూ ఫ్లాగ్ చేసింది .

ట్విట్టర్ ఇండియాలో నకిలీ వార్తలను ట్యాగ్ చేయడం మొదలుపెట్టిందని ప్రతిపక్షాల వ్యాఖ్యలు
సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ భారతదేశంలో ఈ విధంగా స్పందించడం ఇదే మొదటిసారి అంటూ, ట్విట్టర్ అమిత్ మాలవ్య ట్వీట్ ను ప్లాగ్ చేయడంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.ట్విట్టర్ యొక్క చర్య ప్రతిచర్యల గందరగోళానికి దారితీసింది. ప్రత్యర్థులు కాంగ్రెస్ మరియు ఆమ్ ఆద్మీ పార్టీ ఇది భారతదేశంలో మొదటిది అని వ్యాఖ్యానించింది. ట్విట్టర్ ఇండియాలో నకిలీ వార్తలను ట్యాగ్ చేయడం ప్రారంభించింది మరియు భారతదేశం నుండి ఈ గౌరవాన్ని పొందిన మొదటి వ్యక్తి ఎవరో ఊహించండి అంటూ బీజేపీ నేత అమిత్ మాలవీయను టార్గెట్ చేశారు .