• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి ఎన్నిక- జగన్, చంద్రబాబుకు బీజేపీ సంకేతమిదే-అర్ధం చేసుకున్నోళ్లకు చేసుకున్నంత!

|
Google Oneindia TeluguNews

15వ రాష్ట్రపతి ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. రాష్ట్రపతిగా ఎన్డీయే నిలబెట్టిన ద్రౌపదీ ముర్ము ఘన విజయం సాధించారు. ఇవాళ రాష్ట్రపతిగా బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే ఈ ఎన్నికల ద్వారా బీజేపీ దేశంలోని ప్రాంతీయ పార్టీలకు, ముఖ్యంగా భావవైవిధ్యం కలిగిన వైసీపీ, టీడీపీ వంటి పార్టీలకు ఓ సంకేతం పంపింది. ఇది ఆ రెండు పార్టీలకు నిజంగా అర్ధమైందో లేదో తెలియదు కానీ జనానికి మాత్రం అర్ధమవుతూనే ఉంది. దీంతో 2024 ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీలు ఎలా వ్యవహరిస్తాయన్న దానిపై చర్చ మొదలైంది.

 రాష్ట్రపతి ఎన్నికల సిత్రాలు

రాష్ట్రపతి ఎన్నికల సిత్రాలు

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ద్రౌపదీ ముర్మును ఎన్డీయే తరఫున అభ్యర్ధిగా నిలబెట్టగా.. విపక్షాల ఉమ్మడి అభ్యర్దిగా యశ్వంత్ సిన్హా నిలిచారు. అయితే ఎన్నికలకు ముందు ఎన్డీయేకే మెజారిటీ ఉండటంతో పాటు విపక్షాలు కూడా చీలిపోవడంతో ముర్ము విజయం ఖాయమనేది తేలిపోయింది. అయితే యశ్వంత్ సిన్హా కూడా ఆశ వదులుకోకుండా చివరి కంటా పోరాడారు. తద్వారా దేశంలో రాజకీయ పార్టీలకు ఓ సందేశం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఇదే అదనుగా ఎన్డీయేను నడుపుతున్న బీజేపీ కూడా దేశంలో ప్రాంతీయ పార్టీలకు మరో సందేశం ఇచ్చింది.

యశ్వంత్ సిన్హా సందేశమిదే

యశ్వంత్ సిన్హా సందేశమిదే

దేశంలో ద్విధ్రువ రాజకీయాలు కనుమరుగై కేంద్రంతో పాటు రాష్ట్రాల్లోనూ బీజేపీ హవా కొనసాగుతున్న వేళ.. ఏకపక్షంగా మారిపోతున్న రాజకీయాల్లో యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీలో నిలవడం ద్వారా కీలక సందేశం ఇచ్చారు. ఎవరికీ ఎలాంటి ఆశలు లేకపోయినా, తన కంటే ముందు ముగ్గురు అభ్యర్దులు పోటీ నుంచి తప్పుకున్నా వెరవకుండా పోటీలో నిలిచారు. ఓటమి తప్పదని తెలిసినా యశ్వంత్ సిన్హా చూపిన తెగువే ఆయనకు గతంలో రాష్ట్రపతిగా పోటీ చేసి ఓడిపోయిన విపక్షాల అభ్యర్ధి కంటే ఎక్కువ ఓట్లు తెచ్చిపెట్టింది. తద్వారా ఇప్పటికే రాజకీయాలపై క్రమంగా ఆశలు వదులుకుంటున్న విపక్షాలకు పోరాడితే పోయేది లేదన్న సంకేతాన్ని ఆయన ఇచ్చినట్లయింది.

బీజేపీ ఇచ్చిన సంకేతమిదే

బీజేపీ ఇచ్చిన సంకేతమిదే

రాష్ట్రపతి ఎన్నికల్లో తాము పోటీకి పెట్టిన ద్రౌపదీ ముర్మును గెలిపించుకునేందుకు ఈసారి ఎన్డీయే పెద్దగా శ్రమించాల్సిన అవసరం రాలేదు. కేంద్ర రాజకీయాల్లో జూనియర్ అయిన కిషన్ రెడ్డి, సీనియర్ నేత రాజ్ నాథ్ సింగ్ తో పాటు రంగంలోకి దింపి ప్రాంతీయ పార్టీల వద్దకు ముర్మును తీసుకెళ్లింది. అంతే కాదు విపక్ష కూటముల్లో ఉన్న జేఎంఎం వంటి పార్టీలతో పాటు ప్రస్తుతానికి తటస్ధంగా ఉన్న బీజేడీ, టీడీపీ వంటి పార్టీల మద్దతూ సాధించింది. అంతే కాదు ఆయా పార్టీలకు ఎలాంటి హామీలు ఇవ్వకుండానే ఈ మద్దతు సాధించింది. తద్వారా ఎన్డీయే ఛాయిస్ కు వారంతా జై కొట్టేలా చేయగలిగింది. దీంతో రాబోయే రోజుల్లోనూ ఇదే రాజకీయం కొనసాగే అవకాశాలు కనిపిస్తోంది.

జగన్, చంద్రబాబుకు బీజేపీ సంకేతమిదే ?

జగన్, చంద్రబాబుకు బీజేపీ సంకేతమిదే ?

అలాగే ఏపీలోనూ సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబుకు కూడా బీజేపీ మరో సంకేతమిచ్చింది. అదే అడక్కుండానే స్వచ్ఛంద మద్దతు. కానీ జగన్ కూ, చంద్రబాబుకూ మధ్య తేడా ఒకే ఒక్కటి. ముర్ముకు ఎలాగో మద్దతిస్తారని తెలిసిన జగన్ కు కర్టసీ కాల్ చేసి చెప్పింది. చంద్రబాబుకు ఆ కాల్ కూడా చేయలేదు. చివరికి జగన్, చంద్రబాబు ఇద్దరూ మద్దతివ్వక తప్పలేదు.

దాని కోసం వీరిద్దరూ వెతుక్కున్న కారణం సామాజిక న్యాయం. మరి గతంలో ఇదే గిరిజన అభ్యర్ధి సంగ్మాకు ఎందుకు మద్దతివ్వలేదంటే మాత్రం వీరిద్దరి దగ్గరా సమాధానం లేదు. ఇదంతా ఓ ఎత్తయితే తాము నిర్ణయం తీసుకుంటే దాని అమలుకు ఏపీలో జగన్, చంద్రబాబు పోటీపడేలా చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది.

తద్వారా భవిష్యత్తులోనూ వీరిద్దరి నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవడంతో పాటు ఎన్నికల్లో సైతం బీజేపీ మద్దతు కోసం అర్రులు చాచాల్సిన పరిస్ధితి కల్పించింది. ఇప్పుడు జగన్ కానీ, చంద్రబాబు కానీ బీజేపీ మద్దతు అవసరం లేదని బహిరంగంగా కాదు కదా ఆఫ్ ద రికార్డ్ లో సైతం చెప్పలేని పరిస్ధితి. కానీ అదే బీజేపీ మాత్రం వీరిద్దరి మద్దతు అవసరం లేదని బహిరంగంగానే చెప్పుకుంటున్న పరిస్దితి. ఇదే బీజేపీ వీరిద్దరికీ పంపిన సంకేతం.

English summary
with presidential elections, ruling bjp in central govt has sent a message to regional parties like ysrcp and tdp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X