హిందూ యువకులు ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రూ. 5 లక్షలు ఇస్తా - బీజేపీ ఎమ్మెల్యే
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ముస్లిం అమ్మాయిలను పెళ్లి చేసుకునే హిందూ యువకులకు రూ.5 లక్షల నగదు ప్రోత్సాహం ఇస్తానని ఆయన ప్రకటించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
హత్య ఘటన తర్వాత వ్యాఖ్యలు..
ఆగస్టు 3న కర్ణాటకలోని కొప్పల్లో గవిసిద్దప్ప నాయక్ (26) అనే వాల్మీకి సమాజానికి చెందిన యువకుడు, ముస్లిం యువతిని ప్రేమించినందుకు.. ఒక మసీదు ముందు కత్తులు, పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేశారు. ఈ హత్య ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. అలాగే ప్రధాన నిందితుడు తన వద్ద ఉన్న ఆయుధాలతో పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ సంఘటన అనంతరం బాధితుడి కుటుంబాన్ని పరామర్శించిన యత్నాల్.. ఈ ఘటనను మతపరమైన హత్యగా పరిగణించాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆయన కుటుంబానికి ఆర్థిక పరిహారం అందించాలని కోరారు.

ఎమ్మెల్యే ఇంకా మాట్లాడుతూ..
ముస్లిం అమ్మాయిలను పెళ్లి చేసుకునే హిందూ యువకులకు రూ.5 లక్షలు బహుమతిగా ఇస్తానని.. అందుకోసం ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభిస్తానని అన్నారు. లవ్ జిహాద్ కేసులలో ప్రభుత్వం ముస్లింలకు మాత్రమే రక్షణ ఇస్తుందని.. కానీ హిందూ యువకులను రక్షించడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆరోపించారు.
అయితే యత్నాల్ వ్యాఖ్యలపై ఖిద్మత్-ఎ-మిల్లత్ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు కమర్ జునైద్ ఖురేషి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మత సామరస్యాన్ని దెబ్బతీసేలా.. ముస్లింలను అవమానించేలా, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే యత్నాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications