సీఎం రేసులో మరో సన్యాసి ?, అనూహ్యంగా తెరమీదకు వచ్చిన ఆధ్యాత్మిక గురువు, ఎవరు, ఎక్కడంటే?
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే చర్చ మొదలైంది. మాజీ సీఎం వసుంధర రాజే రాజస్థాన్ కొత్త సీఎం అంటూ ఆమె అభిమానులు, అనుచరులు అంటున్నారు. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ఆధ్యాత్మిక గురువు, బీజేపీ ఎంపీ మహంత్ బాలకనాథ్ రావడం ఇప్పుడు రాజస్థాన్ లో హాట్ టాపిక్ అయ్యింది.
మహంత్ బాలకనాథ్ తన తిజారా నియోజకవర్గం నుంచి గెలుపొందగా, కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 40 ఏళ్ల వయసున్న మహంత్ బాలకనాథ్ అల్వార్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు అదే మహంత్ బాలకనాథ్ సీఎం రేసులోకి వచ్చారని జోరుగా ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్‌లో ఈసారి బీజేపీ సొంతంగా 120 సీట్లకు పైగా గెలుస్తుందని ఇటీవల ఆధ్యాత్మిక గురువు మహంత్ బాలకనాథ్ చెప్పారు.

ఆదివారం ఉదయం రాజస్థాన్ లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడానికి ముందు మహంత్ బాలకనాథ్ శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. రాజస్థాన్‌లో 199 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీ 113 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ 70 స్థానాల్లో విజయం సాదించి రెండో స్థానంలో ఉంది. రాజస్థాన్ ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి సుమారు 40 మందికి పైగా రెబల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి వారిలో 14 మంది విజయం సాధించారు.
ఆదివారం ఆధ్యాత్మిక గురువు మహంత్ బాలకనాథ్ తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. రాజస్థాన్ లో కాంగ్రెస్‌ను అంతం చేయాలని ప్రజలు కోరుకోవడమే బీజేపీ విజయానికి కారణం అని, అవినీతి, మహిళలపై అఘాయిత్యాలు, పెరుగుతున్న నేరాలు ప్రజలను బాధించాయని అన్నారు. సీఎం పదవి విషయానికొస్తే మన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మేము అందరూ పని చేస్తామని మహంత్ బాలక్ నాథ్ అన్నారు.
సీఎంగా ఎవరు ఉండాలనే దానిపై కూడా పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని, ఎంపీగా సమాజానికి సేవ చేయాలనే తపన ఉందని, ప్రస్తుతం తాను ఎంపీగా సంతృప్తిగా ఉన్నానని మహంత్ బాలక్ నాథ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాదిరిగానే మహంత్ బాలకనాథ్ కూడా నాథ్ కమ్యూనిటీకి చెందినవారే. మహంత్ బాలకనాథ్ కు అల్వార్‌లో భారీ మద్దతుతో పాటు విపరీతమైన అనుచరులు ఉన్నారు.

మహంత్ బాలక్ నాథ్ చిన్ననాటి రోజుల్లో అంటే ఆరు సంవత్సరాల వయస్సులో సన్యాసం తీసుకున్నారు. మహంత్ బాలకనాథ్ సన్యాసి కావాలని అతని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. బాలకనాథ్ మాట్లాడుతూ సమాజానికి నిత్యం సేవ చేయాలనే తపన ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌లు కూడా సీఎం కుర్చీ కోసం పోటీ పడుతున్నారు.
అసెంబ్లీ ఫలితాలకు ఒకరోజు ముందు శనివారం బాలకనాథ్ బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంస్థ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో సమావేశమయ్యారు. మొత్తం మీద ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ లాగా రాజస్థాన్ లో కూడా మహంత్ బాలక్ నాథ్ సీఎం అయితే పరిస్థితులు రసవత్తరంగా మారుతాయని రాజస్థాన్ కు చెందిన బీజేపీ కార్యకర్తలు అంటున్నారు.












Click it and Unblock the Notifications