దేశంలో బ్లాక్ ఫంగస్ మరణాలు 2,100కిపైగా, 3 వారాల్లోనే కేసులు 150 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుండగా.. గత కొద్ది రోజులుగా బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత మూడు వారాల్లోనే బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా పెరగడం, మరణాలు కూడా ఎక్కువ కావడంతో వైద్య నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 31,216 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా, 2109 ప్రాణాలు కోల్పోయారు. కాగా, గత మూడు వారాల్లోనే ఏకంగా 150 శాతం బ్లాక్ ఫంగస్ కేసులు పెరగడం గమనార్హం. ఇప్పటికే కరోనా మహమ్మారిపై పోరాడుతున్న వైద్య వ్యవస్థకు బ్లాక్ ఫంగస్ మరో సవాలుగా మారుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

మహారాష్ట్రలో అత్యధికంగా 7057 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా, 609 మంది మరణించారు. ఆ తర్వాత గుజరాత్‌లో 5418 బ్లాక్ ఫంగస్ బారినపడగా, 323 మంది చనిపోయారు. రాజస్థాన్ రాష్ట్రంలో 2976 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా, 188 మంది మృతిచెందారు. ఇక ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ వెయ్యికిపైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పదుల సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.
అయితే, బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే ఆంఫోటెరిసిన్-బీ డ్రగ్ కొరత వల్లే కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. కేసులు భారీగా పెరుగుతుండటంతో అందుకు తగినట్లు ఈ ఔషధం సరఫరా కావడం లేదని సమాచారం. బ్లాక్ ఫంగస్ కొత్త వ్యాధి ఏమీ కాదని, అయితే, ఇప్పుడు త్వరగా వ్యాపించి తీవ్రతను పెంచుతోందని వైద్యులు చెబుతున్నారు.
కరోనా నుంచి కోలుకున్న మధుమేహుల పాలిట ఈ వ్యాధి ప్రమాదకరంగా మారుతోందన్నారు. స్టెరాయిడ్లు ఎక్కువ తీసుకున్నవారిలో కూడా బ్లాక్ ఫంగస్ ముప్పు ఎక్కువగా ఉంటోందని వైద్యులు గుర్తించారు. బ్లాక్ ఫంగస్ సోకిన బాధితులు కొందరు తమ శరీర భాగాలను కోల్పోయారు. కాగా, దేశంలో గత కొద్ది రోజులుగా లక్ష దిగువనే కరోనా కొత్త కేసులు నమోదవుతుండటం గమనార్హం. మరణాలు కూడా 3 వేల లోపే నమోదవుతున్నాయి.












Click it and Unblock the Notifications