వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Blood Donation: అర్జంటుగా రక్తం కావాలి, దాతలు దొరక్కపోతే ఏం చేయాలి, డబ్బులిచ్చి కొనుక్కోవచ్చా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రక్తం

"మా నాన్నగారికి గుండె ఆపరేషన్ చేయాలన్నారు. అర్జెంట్‌గా 'ఏ పాజిటివ్' రక్తం కావాలి. నా స్నేహితురాలికి ప్రమాదం జరిగింది. 'ఏబీ నెగిటివ్' రక్తం అవసరమంటూ సోషల్ మీడియాలో, ఆఫీసు ఈ-మెయిల్స్‌లో మెసేజీలు....

"మా అమ్మాయికున్న అనారోగ్య సమస్యకు వెంటనే రక్తం ఎక్కించాలని అంటున్నారు. ఇప్పుడెలా?" మన కుటుంబాలు, ఆత్మీయులు, స్నేహితులు, అపరిచితుల్లో కూడా ఎవరో ఒకరికి రక్తం అవసరం రావడాన్ని గమనిస్తూనే ఉంటాం. ఒక్కొక్కసారి కొన్ని అరుదైన రక్తం గ్రూపులు దొరకడం కూడా కష్టంగా ఉంటుంది.

ఆస్పత్రి కారిడార్‌లో రక్తం కోసం ఆందోళన పడుతూ తిరిగే రోగి సంబంధీకులను కూడా చూస్తూ ఉంటాం.

అకస్మాత్తుగా తలెత్తే అనారోగ్య పరిస్థితులు, ప్రమాదాలు ఏర్పడినప్పుడు రక్తం కోసం ఎక్కడకు వెళ్ళాలి? ఎవరిని సంప్రదించాలి? అవసరమైన రక్తాన్ని ఎలా సేకరించాలనే విషయం గురించి చాలా మందికి తెలియదు.

రక్తం సేకరణ, ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు పాటించాల్సిన నిబంధనల గురించి ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, ప్రాజెక్ట్స్ చీఫ్ కో ఆర్డినేటర్ బీవీఎస్ కుమార్ బీబీసీకి వివరించారు.

రక్తం

రక్తం కోసం ఎక్కడకు వెళ్ళాలి?

రోగికి అవసరమైన రక్తం ప్రభుత్వ అనుమతి పొందిన ప్రైవేటు, ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల్లో లభిస్తుంది. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న వారికి ప్రభుత్వ బ్లడ్ బ్యాంకు నుంచి రక్తం తీసుకురావడం కుదరదు.

డబ్బులున్నంత మాత్రాన నేరుగా రక్తం సేకరించడం కుదరదు. మందుల షాపుల్లో ఔషధాలు కొనుక్కున్నట్లుగా రక్తాన్ని కొనుక్కోలేరు.

కొన్ని ఆస్పత్రుల్లో రక్తం కోసం ఎక్కడికి వెళ్ళాలో సూచిస్తారు.

ప్రక్రియ ఏంటి?

రక్తం అవసరమైనప్పుడు ఆస్పత్రుల్లో బ్లడ్ రిక్విజిషన్ ఫార్మ్ ఉంటుంది. ఈ దరఖాస్తులో రోగి పేరు, అవసరమైన రక్తం, ఆరోగ్య సమస్య, అవసరమైన యూనిట్ల లాంటి వివరాలను చేర్చి డాక్టర్ సంతకం చేయాలి. దీంతో పాటు రోగి రక్తపు శాంపిల్‌ను కూడా బ్లడ్ బ్యాంకుకు పంపాలి.

ఈ దరఖాస్తుతో పాటు శాంపిల్‌ పట్టుకుని రోగి కుటుంబీకులు బ్లడ్ బ్యాంకుకు వెళ్ళాలి.

రోగి రక్తపు గ్రూపుతో సరిపోయే రక్తం బ్లడ్ బ్యాంకులో ఉన్నంత మాత్రాన నేరుగా ఆ రక్తాన్ని ఇవ్వకూడదు. రోగి శాంపిల్ తో రక్తాన్ని క్రాస్ మ్యాచ్ చేసి రక్తాన్ని ఇవ్వవలసి ఉంటుంది.

ఇందుకు కొంత సమయం పడుతుంది.

దరఖాస్తు, శాంపిల్ చూడగానే బ్లడ్ బ్యాంకుల్లో రక్తం ఇస్తారా?

సాధారణంగా రోగి తరుపు వ్యక్తులు ప్రైవేటు బ్లడ్ బ్యాంకులకు వెళ్ళగానే, ఇద్దరు డోనర్‌లను తీసుకుని రమ్మని అడుగుతారు. దీంతో, రోగి బంధువులు, సంబంధీకులు రక్త దానం చేసే వారి కోసం వెతుకులాట మొదలుపెడతారు.

"నిజానికి ఇది తప్పని సరి కాదు" అని ఆంధ్రప్రదేశ్ రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ స్టేట్ కోఆర్డినేటర్ బీవీఎస్ కుమార్ అన్నారు.

"రోగి బంధువులు రక్తం సేకరిస్తారా? లేదా డోనర్ లను వెతికే పనిలో ఉంటారా? ఇది రోగి కుటుంబీకులకు చాలా ఇబ్బంది కలిగించే విషయం. ప్రభుత్వం ఇలాంటి విషయాల పై కూడా దృష్టి సారించాలి" అని ఆయన అన్నారు.

రక్తం

రక్తం సేకరించే విధానం, ప్రాసెసింగ్ చార్జీలు, రక్తాన్ని ఎవరు దానం చేయవచ్చు, చేయకూడదనే విషయాలను ఎన్‌టీ‌ఆర్ జిల్లా అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉష బీబీసీకి వివరించారు.

రక్తం సేకరణ ఎలా?

ప్రతీ రాష్ట్రంలో ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉంటుంది. ఎవరైనా రక్తదాన శిబిరం నిర్వహించాలంటే వీరి అనుమతి తీసుకోవాలి. సేకరించిన రక్తంలో 30% ప్రభుత్వ ఆస్పత్రులకు ఇవ్వాల్సి ఉంటుంది.

భారత ప్రభుత్వం రక్తాన్ని ఇచ్చేందుకు ప్రాసెసింగ్ చార్జీలను నిర్ణయిస్తుంది. ఒక ఏడాదికి రక్తం సేకరణకు అయిన ఖర్చును, సేకరించిన మొత్తం యూనిట్ లతో భాగించి యూనిట్ బ్లడ్‌కు చెల్లించాల్సిన సర్వీస్ చార్జీలను నిర్ణయిస్తారు.

సాధారణంగా ఒక యూనిట్ కు రూ.1100 వసూలు చేస్తారు. సుప్రీం కోర్టు రక్తాన్ని అమ్మడాన్ని నిషేధించింది. రక్తాన్ని దానం మాత్రమే చేయాలి.

ఎవరు ఇవ్వవచ్చు?

  • 18-60 సంవత్సరాల వయసున్న స్త్రీ, పురుషులు రక్త దానం చేయవచ్చు. అయితే, వారు ఆరోగ్యవంతులై ఉండాలి.
  • రక్తదానం చేసే వారి శరీర బరువు కనీసం 45 కేజీలు ఉండాలి
  • హిమోగ్లోబిన్ కనీసం 12.5 మిల్లీగ్రాములు ఉండాలి
  • బీపీ సాధారణ స్థితిలో ఉండాలి
  • ప్రతీ మూడు నెలలకొకసారి రక్త దానం చేయవచ్చు.

ఎవరు చేయకూడదు?

  • గర్భిణులు, బాలింతలు
  • హెచ్‌ఐ‌వి లాంటి వ్యాధులు ఉన్నవారు
  • మధుమేహం, బీపీ ఉన్న వారు
  • స్టెరాయిడ్‌లు, లేదా ఇతర హార్మోన్లకు సంబంధించిన మందులు తీసుకుంటున్నవారు
  • ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు ఉన్నవారు
  • పచ్చ కామెర్లు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం వరకు
  • పీరియడ్స్ సమయంలో మహిళలు రక్త దానం చేయకూడదు.
రక్త పరీక్ష

సేకరణ తర్వాత ఆ రక్తాన్ని నేరుగా రోగులకు ఇస్తారా?

రక్తాన్ని సేకరించిన తర్వాత స్క్రీన్ చేయాలి.

హెచ్‌ఐవి, ప్లేట్ లెట్లు, మలేరియా లాంటి వివిధ రకాల రక్త పరీక్షలు నిర్వహించాలి. వీటన్నిటికీ నెగటివ్ వచ్చిన తర్వాతే సురక్షితమైన రక్తం అని మెడికల్ ఆఫీసర్ ధృవీకరిస్తారు.

అప్పుడే రక్తాన్ని రోగికి ఇచ్చేందుకు వీలవుతుంది. సేకరించిన రక్తాన్ని రోగికి నేరుగా ఇచ్చేందుకు కుదరదు.

రక్తం మొదటి సారి సేకరించినప్పుడు ఉన్న ప్లేట్‌లెట్, ఎర్ర‌, తెల్ల రక్త కణాల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. రక్తం షెల్ఫ్ లైఫ్ 35 రోజుల వరకు ఉంటుంది. రక్తం షెల్ఫ్ లైఫ్ పెరుగుతున్న కొద్దీ అందులో ఉండే కాంపోనెంట్లు తగ్గిపోతూ ఉంటాయి. దీంతో, డెంగీ జ్వరం ముదిరినప్పుడు, హృద్రోగ సమస్యల్లో చికిత్స కోసం తాజాగా సేకరించిన బ్లడ్ అడుగుతూ ఉంటారని కుమార్ చెప్పారు.

తలసేమియా, హీమోఫిలియా, సికిల్ సెల్ లాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి బ్లడ్ బ్యాంకులు రక్తాన్ని ఉచితంగా ఇవ్వాలని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిబంధనలు చెబుతున్నాయి. అయితే, చాలా వరకు ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు ఈ నిబంధనలను పాటించవు.

విజయవాడలో ఒక ప్రైవేటు బ్లడ్ బ్యాంకు తలసేమియా రోగికి డబ్బులు తీసుకుని రక్తం ఇచ్చినట్లు తెలియడంతో ఆ బ్లడ్ బ్యాంకు పై చర్యలు తీసుకున్నారు.

వైద్య ఆరోగ్య ప్రత్యేక కార్యదర్శి, ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.ఎస్.నవీన్ కుమార్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బ్లడ్ బ్యాంకుల రికార్డులను పరిశీలించారు. ఉచితంగా రక్తం సరఫరా చేసినట్లుగా బ్లడ్ బ్యాంకు రికార్డుల్లో నమోదు అయిన వివరాలను పరిశీలించి సదరు వ్యక్తులకు కాల్ చేసి ప్రశ్నించారు. అయితే, ఆ వ్యక్తులు రక్తాన్ని డబ్బులిచ్చి కొనుక్కునట్లు తెలిపారు.

ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు నియమాలను అనుసరించి సేకరించే రక్తంలో 30% ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులకు ఇవ్వాలని సూచించారు. ఇలా చేయని బ్లడ్ బ్యాంకుల పై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

రక్తం

ప్రైవేటు బ్లడ్ బ్యాంకులను ఎవరైనా ప్రారంభించవచ్చా?

బ్లడ్ బ్యాంక్ ప్రారంభించేందుకు రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం ఇవ్వాలి. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టంలోని నియమాల కనుగుణంగా బ్లడ్ బ్యాంకులను నిర్వహించాలి. ఈ నియమాల కనుగుణంగా రికార్డులు నిర్వహించాలి.

ప్రైవేటు బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.1 - 1.5 కోట్లు అవసరమవుతుందని బీవీఎస్ కుమార్ తెలిపారు.

బ్లడ్ బ్యాంకులు పాటించాల్సిన కొన్ని నిబంధనలు:

ప్రతీ బ్లడ్ బ్యాంకుకు నిర్వహణకు సంబంధించిన సొంత నియమావళి ఉండాలి.

బ్లడ్ బ్యాంకులో కచ్చితంగా ఒక వైద్య అధికారి ఉండాలి.

నాకో(National AIDS Control Organisation) నిబంధనలకు అనుగుణంగా ఉన్నప్పుడు బ్లడ్ బ్యాంక్ ప్రారంభానికి లైసెన్స్ ఇస్తారు. ఈ లైసెన్స్ ను ఐదేళ్లకు ఇస్తారు. దీనిని పునరుద్ధరించుకోవల్సి ఉంటుంది.

స్థానికంగా ఉండే డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు బ్లడ్ బ్యాంకులను నెలకొక సారి తనిఖీ చేస్తారు. సిబ్బంది, రికార్డుల నిర్వహణ. ఎక్కడైనా అవకతవకలు జరుగుతున్నట్లు తెలిస్తే, వాటి లైసెన్సును రద్దు చేస్తారు.

తలసేమియా, హీమోఫిలియా ఉన్న రోగులకు ఉచితంగా రక్తం ఇవ్వాలి. రోగి బంధువులు లేదా కుటుంబీకులు ఏపీ సాక్స్ ను సంప్రదిస్తే, వారిని ఒక బ్లడ్ బ్యాంకుకు పంపిస్తారు. వారు ప్రతీ 3 వారాలకొకసారి అవసరమైన ప్రతీసారి రక్తాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.

https://www.youtube.com/watch?v=XKfeIurTFfs

ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల్లో ఎదురవుతున్న సవాళ్లేంటి?

"ఒక యూనిట్ బ్లడ్ లో 350 ఎంఎల్ రక్తం ఉండాలి. కానీ, 275 లేదా 250 ఎంఎల్ మాత్రమే ఉంచి అవకతవకలకు పాల్పడవచ్చు. నాకో (NACO) నిబంధనల ప్రకారం అన్ని రకాల పరీక్షలు నిర్వహించక పోవచ్చు. కొంతమంది పూర్తి స్థాయి మెడికల్ ఆఫీసర్ ను కూడా నియమించరు. తనిఖీల సమయంలో మాత్రమే రావాలని చెబుతారు" అని కుమార్ అన్నారు.

ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు వ్యాపార ధోరణితోనే నిర్వహిస్తాయి కానీ, సేవా దృక్పధం ఎందుకుంటుంది? అని ఆయన అన్నారు.

"రక్తం సురక్షత, పరిమాణం అనేవి కీలకమైన అంశాలు. ప్రభుత్వం రెడ్ క్రాస్ లాంటి స్వచ్చంద సంస్థలు అందించే బ్లడ్ బ్యాంకులను మరింత ప్రోత్సహించాలి. లాభాపేక్ష లేని సంస్థలు ఉండాలి" అని అన్నారు.

సక్రమ నిర్వహణ లేకపోవడమే దేశంలో బ్లడ్ బ్యాంకింగ్ వ్యవస్థను పట్టి పీడిస్తున్న సమస్య అని టెక్నికల్ రిసోర్స్ గ్రూప్ (బ్లడ్ సేఫ్టీ) డాక్టర్ జరీన్ ఎస్. భరూచా అన్నారు.

ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల్లో అవకతవకలు జరుగుతున్నట్లు తెలిసినప్పుడు స్థానిక డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కు సమాచారం అందించాలి.

రక్తం

తెలుగు రాష్ట్రాల్లో రక్తం కోసం ఎవరిని, ఎక్కడ సంప్రదించాలి?

ఆంధ్రప్రదేశ్ ఔషధ నియంత్రణ మండలి ( ఏపీ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్) వెబ్ సైట్ అందించిన వివరాల ప్రకారం రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ గుర్తింపు పొందిన 121 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి.

అన్ని జిల్లా కేంద్రాలతో పాటు ప్రధాన పట్టణాలలోనూ ఏర్పాటు చేశారు. ఇందులో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నవి కొన్ని కాగా, రెడ్ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్నవి మరి కొన్ని. వాటితో పాటు ప్రైవేటు ఆస్పత్రుల ఆధ్వర్యంలో కూడా మరి కొన్ని బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. పూర్తి వివరాలను ఈ లింక్ లో చూడవచ్చు.

తెలంగాణ విషయానికి వస్తే ఆ రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి (డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్) వెబ్ సైట్ అందించిన వివరాల ప్రకారం ప్రభుత్వ గుర్తింపు పొందిన 132 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి.

హైదరాబాద్, సికింద్రాబాద్ సహా అన్ని జిల్లాల కేంద్రాల్లోనూ, అలాగే ప్రధాన పట్టణాల్లోనూ ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలను ఇక్కడ క్లిక్ చెయ్యడం ద్వారా తెలుసుకోవచ్చు.

ఇవి కాకుండా హైదరాబాద్ నగర కేంద్రంగా ఫ్రెండ్స్ టు సపోర్ట్ పేరుతో ఆరుగురు వ్యక్తులు కలిసి రక్తదాతల డేటాబేస్ మొత్తాన్ని ఒక వెబ్ సైట్లో పొందుపరిచారు.

అత్యవసర పరిస్థితుల్లో ఆయా ఫోన్ నెంబర్లను ఓ సారి సరిచూసుకోవడం మంచిది. ఇదే కాకుండా ఇంకా చాలా స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు కూడా రక్తదాతల వివరాలను సేకరించి అవసరమైన వారికి అందిస్తున్నారు.

అయితే వాటి కచ్చితత్వాన్ని ధ్రువీకరించే పరిస్థితి లేనందున ఆయా వివరాలను ఇక్కడ ఇవ్వలేకపోతున్నాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Blood Donation: Urgent need of blood, what to do if you can't find donors, can you buy it with money?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X