న్యూఇయర్ వేడుకల్లేవ్: అర్ధరాత్రి ఢిల్లీలో సీఏఏ నిరసనలు, జాతీయ గీతం, ఆజాదీ నినాదాలు
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ కొత్త సంవత్సరం రోజున దేశ రాజధాని న్యూఢిల్లీలోని జామీయా మిలియా ఇస్లామియా వర్సిటీ సమీపంలోని షాహిన్ బాగ్‌లో భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. ఎలాంటి పార్టీలు చేసుకోకుండా, టీవీలకు అతుక్కుపోకుండా పెద్ద ఎత్తున యువతీయువకులు నిరసనల్లో పాల్గొని డిసెంబర్ 31 అర్ధరాత్రి జాతీయ గీతం ఆలపించారు.
అర్ధరాత్రి నిరసనలు
నూతన సంవత్సరం సందర్భంగా చాయ్ నుంచి బీర్ తాగే వారు కూడా ఆ నిరసన ప్రదర్శన వద్దకు చేరుకున్నారు. కొందరు అలా వచ్చి ఇలా వెళ్లగా.. మరికొందరు అక్కడ నిరసనకారులు చేస్తున్న ప్రసంగాలను వింటూ అక్కడే ఉండిపోయారు. పలువురు జాతీయ జెండాను ఊపుతూ అటుఇటూ తిరిగారు.
జాతీయ గీతం, ఆజాదీ నినాదాలు..
మరికొందరు సీఏఏకు వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించారు. ఇంకొందరు ఆజాదీ ఆజాదీ అంటూ నినాదాలు చేశారు. ఆర్ధరాత్రి 12 తర్వాత అందరూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆ తర్వాత ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
చలిని లెక్క చేయకుండా..
2020 సంవత్సర వేడుకల్లో పాల్గొనకుండా, చలిని లెక్కచేయకుండా ఢిల్లీలోని నలుమూలల నుంచి యువతీయువలు అక్కడికి చేరుకుని నిరసనల్లో పాల్గొనడం గమనార్హం. పరిస్థితులు సాధారణంగా ఉంటే ఏడాది పొడవునా వేడుకలు చేసుకుంటామని నిరసనలో పాల్గొన్న ఓ యువకుడు చెప్పారు. సీఏఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ ఆందోళనల్లో పాల్గొంటున్నా అని చెప్పి ఆ యువకుడు.. తన పేరును, మతాన్ని చెప్పేందుకు ఇష్టపడలేదు. కోళ్లాంలో నిరసన చేస్తున్న కళాకారులను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఫూల్ కుమారి అనే కళాకారిణి మండిపడ్డారు.
సీఏఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ..
నిరసనలు చేస్తున్నవారిని పోలీసులతో అణిచివేస్తున్నాయని ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి 12 వరకు కూడా చాలా మంది స్థానికులు నిరసనకారులకు మద్దతు తెలుపుతూ అక్కడే ఉన్నారు. డిసెంబర్ 15 నుంచి జామియా మిలీయా వర్సిటీ విద్యార్థులు సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. వర్సిటీకి సమీపంలోనే ఈ నిరసన జరిగింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఆ:దోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనలకు కాంగ్రస్ సహా విపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి.












Click it and Unblock the Notifications