ఎన్నికల సంఘం కీలక నిర్ణయం - ఇక ఆ నేతలకు చెక్ : ఓడితే అంతే..!!
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రతిపాదన స్థాయిలో ఉన్న అంశాన్ని ఇప్పుడు కేంద్రానికి సూచనగా చేసింది. ఈ సూచన అమల్లోకి తీసుకొస్తే కొందరు రాజకీయ నేతలకు షాక్ తప్పుదు. ఒక అభ్యర్ధి ఒక చోట నుంచే పోటీ చేయాలనే ప్రతిపాదనను మరోసారి ఎన్నికల సంఘం తెర పైకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించి చట్ట సవరణ చేయాలని కోరుతూ కేంద్రానికి సూచించింది. ఒకే అభ్యర్ధి రెండు చోట్ల పోటీ చేసిన సమయంలో రెండు చోట్ల గెలిస్తే ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.

ఎన్నికల సంఘం కీలక ప్రతిపాదన
తాజా సూచన మేరకు ఆ ఖాళీ చేసిన నియోజకవర్గానికి నిర్వహించే ఉప ఎన్నిక ఖర్చును అభ్యర్ధే భరించేలా నిబంధనలను ప్రతిపాదించింది. దీంతో పాటుగా అసెంబ్లీ.. మండలి సీటుకు రూ అయిదు లక్షలు... లోక్ సభ సీటుకు రూ 10 లక్షల వరకు జరిమానా విధించాలని ఎన్నికల సంఘం తన సూచనల్లో పేర్కొంది.
కేంద్ర న్యాయ శాఖ లెజిస్లేటివ్ కార్యదర్శి రీటా వశిష్టతో తో సమావేశం అయిన సమయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈ అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. 1996కు ముందు ఒక వ్యక్తి ఎన్ని స్థానాల నుంచి అయినా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చేవారు. కానీ, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణ ద్వారా ఆ తరువాత రెండు స్థానాలకు పరిమితం చేసారు.

ఒక చోట నుంచే పోటీకి ఛాన్స్
దీనిని సవరించి ఒక వ్యక్తి ఒకచోట నుంచే పోటీ చేయాలనే నిబంధనను తీసుకురావాలని 2004లోనే భావించినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. తిరిగి ఇప్పుడు మరోసారి ప్రతిపాదనలు తెర మీదకు రావటంతో ఈ సారి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. జాతీయ ప్రముఖ నేతలతో పాటుగా.. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులు సైతం గతంలో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి.
2019 ఎన్నికల్లో ఏపీ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ లోని గాజువాక.. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి పోటీ చేసారు. అయితే, ఆయన రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోయారు. అదే విధంగా గతంలో 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి సైతం తిరుపతి.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి పోటీ చేసారు.

కేంద్రం అనుమతిస్తే.. వచ్చే ఎన్నికల్లోనే
కానీ, తిరుపతి నుంచి మాత్రమే గెలుపొందారు. ఇందిరా గాంధీ.. ఎన్టీఆర్.. పీవీ నరసింహా రావు.. సోనియా గాంధీ.. అద్వానీ..ప్రధాని మోదీ 2014 లో, రాహుల్ గాంధీ.. పంజాబ్ ఎన్నికల్లో ఆ రాష్ట్ర మాజీ సీఎం చన్నీ..గతంలో లాలూ ప్రసాద్ యాదవ్.. ములాయం సింగ్ యాదవ్.. నవీన్ పట్నాయక్ సైతం రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసారు.
2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు స్థానాల్లో పోటీ చేశారు. మెదక్ లోక్‌సభ స్థానం, గజ్వేల్ అసెంబ్లీ స్థానం బరిలో నిలిచారు. రెండు చోట్లా గెలిచిన ఆయన మెదక్ లోక్‌సభ స్థానాన్ని వదులుకుని గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. గజ్వేల్ ఎమ్మెల్యే గా తెలంగాణ రాష్ట్ర తొలి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఇక, ఇప్పుడు ఎన్నికల సంఘం తాజా ప్రతిపాదన రాజకీయ వర్గాల్లో ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications