నేర చరిత నేతలకు చుక్కలు -ఓటరు ఐడీతో ఆధార్ అనుసంధానం -ఎన్నికల సంస్కరణలపై కేంద్రానికి సీఈసీ లేఖ
ఇటీవల కాలంలో ఎన్నికల కమిషన్ తీరుపై పెద్దఎత్తున విమర్శలు వస్తుండటం, కోర్టులు సైతం ఈసీని పరుష పదజాలంతో తిట్టిపోస్తున్న సందర్భంలో ఎన్నికల సంస్కరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. చాలా కాలంగా పెడింగ్ లో ఉన్న ప్రతిపాదిత సంస్కరణలపై వేగంగా నిర్ణయాలు తీసుకోండంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సుశీల్ చంద్ర మంగళవారం కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు లేఖ రాశారు.
నేర చరిత్ర ఉన్న రాజకీయ నేతలకు మరింత షాకిచ్చేలా, ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చే వారికి జైలు శిక్షను మూడింతలు పెంచేలా ప్రతిపాదిత సంస్కరణలున్నాయి. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని రుజువైతే సదరు నేతలకు జైలుశిక్షను ప్రస్తుత ఆరు నెలల నుంచి రెండేండ్లకు పెంచాలనే ప్రతిపాదనను, రెండేంళ్ల జైలుశిక్ష అనుభవించిన వ్యక్తులను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆరేండ్ల పాటు నిషేధించేలా చట్టంలో మార్పులు చేయాలనే ప్రతిపాదనను కేంద్రానికి రాసిన లేఖలో సీఈసీ పేర్కొన్నారు.

ఎన్నికల ప్రచారంలో ప్రలోభాల పర్వాన్ని అరికట్టేదిశగా.. ఓటర్లు ప్రభావితం కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రచారానికి చివరి రోజు, పోలింగ్ రోజున వార్తాపత్రికల్లో రాజకీయ ప్రకటనలపై నిషేధం విధించాలని న్యాయ మంత్రికి రాసిన లేఖలో సుశీల్ చంద్ర ప్రతిపాదించారు. ప్రస్తుతానికి పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు ఎలక్ట్రానిక్ మీడియా మాత్రమే ఎన్నికల ప్రచార సామగ్రిని చూపకుండా నిరోధిస్తున్నారు. కానీ ప్రింట్ మీడియాను ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 లోని సెక్షన్ 126 పరిధిలోకి తీసుకురావాలని కమిటీ ఇప్పుడు సిఫారసు చేసింది. అలాగే,
ఓటరు జాబితాను ఆధార్‌తో అనుసంధానించడం వల్ల దొంగ ఓట్లను నిరోధించవచ్చునని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర తన లేఖలో సూచించారు. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల లోక్‌సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా.. ఎన్నికల కమిషన్ ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉన్నదని, దీనికి ఎన్నికల చట్టాల్లో సవరణ అవసరమని తెలిపారని సీఈసీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications