లాక్ డౌన్ పై ఇంకొంచెం ఊరట ..మరికొన్ని సడలింపులు ప్రకటించిన కేంద్రం
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే దీనికి సంబంధించి పలు మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక రెండో దశ లాక్‌డౌన్‌లో భాగంగా ఏప్రిల్ 20 తర్వాత కొన్ని రంగాలకు సడలింపు ప్రకటించింది. ఇది కాస్త ఊరటనిచ్చే అంశం . అయితే నిబంధనల సడలింపు కొన్ని రంగాలకు మాత్రమే ప్రకటించిన కేంద్రం వైరస్ హాట్ స్పాట్స్‌కు, కంటైన్మెంట్ జోన్స్‌కు, రెడ్ జోన్స్ కు ఈ సడలింపు వర్తించబోదని స్పష్టం చేసింది.
తాజాగా లాక్‌డౌన్ కాలంలో మరిన్ని సడలింపులు ప్రకటించింది కేంద్ర సర్కార్ . ఈ మేరకు కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో సడలింపుల జాబితాలో అటవీ ఉత్పత్తుల సేకరణ, ప్రాసెసింగ్ వంటివి చేరాయి . ఎండా కాలం కావటంతో అటవీ ఉత్పత్తుల సేకరణపై జీవనం సాగించే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు . ఇక మైనర్ టింబర్ డిపోలకు నిర్వహణకు అనుమతి ఇచ్చారు .

Recommended Video
సుగంధ ద్రవ్యాల కోత, కొబ్బరికాయలు, వెదురు ప్రాసెసింగ్, అమ్మకాలు, మార్కెటింగ్‌కు కూడా అనుమతి ఇచ్చింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ రంగంతో ముడిపడి ఉన్న నీటి సరఫరా, శాటిటేషన్, విద్యుత్ స్థంభాలు, టెలిఫోన్ కేబుల్స్ తదితర పనులను చేసుకోవటానికి అనుమతి ఇచ్చారు .అంతే కాదు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్, హౌసింగ్ ఫైనాన్స్, మైక్రో ఫైనాన్స్ కంపెనీలు, కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది కేంద్ర సర్కార్ . అయితే సడలింపు ఇచ్చిన సర్కార్ నిర్వహణకు కొన్ని నిబంధనలను కూడా విధించింది . సామాజిక దూరం పాటించటం , మాస్కులు ధరించటం తప్పనిసరి అని చెప్పింది .












Click it and Unblock the Notifications