Puja Khedkar: పూజా ఖేడ్కర్ పై కేంద్రం కీలక ఆదేశాలు-తక్షణం అమల్లోకి..!
మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ విషయంలో కేంద్రం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ గుర్తింపు, సర్టిఫికెట్లతో సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి ఐఏఎస్ కు ఎంపికైన పూజా ట్రైనింగ్ లో ఉండగానే అర్హతకు మించిన డిమాండ్లు చేసి దొరికిపోయారు. దీంతో ఆమె వ్యవహారంపై ఆరా తీసిన ప్రభుత్వానికి షాకింగ్ విషయాలు తెలిశాయి. దీంతో ఆమెపై ఇప్పటికే మరోసారి పరీక్షలు రాయకుండా యూపీఎస్సీ వేటు వేసింది. దీనికి కొనసాగింపుగా కేంద్రం తక్షణం అమల్లోకి వచ్చేలా మరో ఉత్తర్వు ఇచ్చింది.
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ ను ఐఏఎస్ నుంచి డిశ్చార్జ్ చేస్తూ (తప్పిస్తూ) కేంద్ర ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాదు ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని అందులో తెలిపింది. దీంతో ఇకపై ఐఏఎస్ గా కానీ ట్రైనీ ఐఏఎస్ గా కానీ చెప్పుకోవడానికి కూడా పూజా ఖేడ్కర్ కు అవకాశం లేకుండా పోతుంది. ఇప్పటికే నకిలీ గుర్తింపుతో ఐఏఎస్ కు ఎంపికైన వ్యవహారంలో ఆమెపై యూపీఎస్సీ క్రిమినల్ కేసు పెట్టడంతో విచారణ జరుగుతోంది.

పూణేలో ప్రొబేషనరీ సబ్ కలెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో ఆమె తనకు అర్హత లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా కారుపై ఎర్ర బల్బు, కారుకు వీఐపీ రిజిస్ట్రేషన్ నంబర్ సహా పలు సౌకర్యాలు కావాలని డిమాండ్ చేశారు. అధికారులు అందుకు తిరస్కరించడంతో ప్రభుత్వం ఆమెను వశీంకు బదిలీ చేసింది. ఆ తర్వాత తీగ లాగితే డొంకంతా కదిలింది. ఇంతకీ ఇన్ని సౌకర్యాలు అడుగుతున్న పూజ నిజంగానే ఐఏఎస్ ట్రైనింగ్ తీసుకుని వచ్చిందా అని మొదలైన దర్యాప్తు కాస్తా ఆమె అసలు ఎలా ఐఏఎస్ అయిందన్న ప్రశ్న వరకూ వెళ్లింది. చివరికి వికలాంగురాలుగా, ఓబీసీ కోటాలో ఆమె ఐఏఎస్ కు ఎంపికైనట్లు తేలడంతో ప్రభుత్వం, యూపీఎస్సీ ఆమెకు వరుస షాకులిస్తున్నాయి.












Click it and Unblock the Notifications