కరోనా వైరస్ వ్యాప్తిపై డిసెంబర్ 27న ముహూర్తం పెట్టిన కేంద్రం..!!
న్యూఢిల్లీ: అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ బీఎఫ్ 7 వేరియంట్ పాజిటివ్ కేసులు దేశంలో నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 201 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీనితో యాక్టివ్ కేసుల సంఖ్య 3,397కు చేరింది. మొత్తం రికవరీలు 4,41,42,791గా రికార్డయ్యాయి. ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య అయిదున్నర లక్షలకు చేరువైంది. ఇవ్వాళ్టికి 5,30,691కి చేరింది.

పండగలొస్తోన్నందున..
ఈ నేపథ్యంలో- కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. శరవేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఉన్న బీఎఫ్ 7 వేరియంట్ కావడం వల్ల తక్షణమే ముందు జాగ్రత్త చర్యలకు దిగింది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కోవిడ్ మార్గదర్శకాలు, నియమ నిబంధనలను జారీ చేసింది. క్రిస్మస్ మొదలుకుని కొత్త సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, సంక్రాంతి పండగ సీజన్ ఆరంభం కాబోతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మాస్కులు, శానిటైజర్లు..
ఇన్‌ఫ్లుయెన్జా లైక్ ఇల్ నెస్ (ఐఎల్ఐ), సీవర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్ నెస్ (ఎస్ఏఆర్ఐ) వంటి జిల్లా స్థాయిలో నిఘా ఉంచాలని రాజేష్ భూషణ్ సూచించారు. ఆర్టీపీసీఆర్, యాంటిజెన్ పరీక్షలను తప్పనిసరి చేయాలని, ప్రతి ఒక్కరు మాస్కులను తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చేతులను శుభ్రం చేసుకోవడానికి అవసరమైన శానిటైజర్లను అందుబాటులో ఉంచడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని చెప్పారు.

ఎలాంటి పరిస్థితులనైనా..
ఆసుపత్రుల్లో డ్రై రన్ నిర్వహించాలని రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. కోవిడ్ వార్డులు, బెడ్స్, క్వారంటైన్, ఐసొలేషన్ కేంద్రాలు, సరిపడినన్ని ఆక్సిజన్ నిల్వలను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సన్నద్ధం కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

27వ తేదీన మాక్ డ్రిల్..
ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నెల 27వ తేదీన దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్‌ను నిర్వహించనుంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ కార్యదర్శులకు లేఖ రాశారు. మాక్ డ్రిల్స్‌ను పకడ్బందీగా చేపట్టాల్సి ఉంటుందని, దీనికి అవసరమైన గైడ్ లైన్స్ ను జారీ చేశామని చెప్పారు.

మౌలిక సదుపాయాలపై..
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో- ఆసుపత్రులు, కోవిడ్ వార్డులు, క్వారంటైన్ కేంద్రాలు, ఐసొలేషన్ సెంటర్లు, ఆక్సిజన్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్స్ కిట్స్, మాస్కుల నిల్వలు, వాటి సరఫరా, డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్ కేర్ సిబ్బంది, ఆర్టీపీసీఆర్, యాంటీజెన్, ర్యాపిడ్, ఆక్సిజన్ సిలిండర్లు, టెలిమెడిసిన్ సేవలు.. వంటి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు.. . వంటి మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పరిశీలించడానికి ఈ మాక్ డ్రిల్స్ ను నిర్వహించాల్సి ఉంటుందని రాజేష్ భూషణ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications