Chandrayaan 3: చందమామపై భారత్ చెరగని ముద్ర: రోవర్ వీల్స్‌పై ఆ లోగో
బెంగళూరు: కోట్లాదిమంది భారతీయుల నిరీక్షణ ఫలించింది. చందమామ చేతికి అందింది. జాబిల్లిపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. భారత్.. నింగిని జయించింది. ఇస్రో చేపట్టిన చంద్ర మండల యాత్ర- విజయ తీరాలకు చేరింది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యుల్ ఈ సాయంత్రం 6:04 నిమిషాలకు జాబిల్లి మీద అడుగు మోపింది.
చంద్రుడి ఆర్బిటర్ నుంచి ఒక్కో దశలో కిందికి దిగింది చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యుల్ విక్రమ్. అవరోహణ క్రమంలో కిందికి దిగుతూ వచ్చింది. అప్పటివరకు అండాకారంలో పరిభ్రమిస్తూ వచ్చిన విక్రమ్ ల్యాండర్.. చంద్రుడి ఉపరితలానికి సమీపించిన వెంటనే వర్టికల్‌గా మారింది. నిట్టనిలువుకు చేరుకుంది. అక్కడే సగం విజయం సాధించినట్టయింది.

అనంతరం ఒక్కో దశను అధిగమిస్తూ క్రమంగా చంద్రుడి ఉపరితలంపై అడుగు మోపింది. దీనితో- అప్పటివరకు పిన్ డ్రాప్ సైలెంట్‌గా కనిపించిన ఇస్రో మిషన్ కాంప్లెక్స్ మొత్తం హర్షధ్వానాలతో మారుమోగిపోయింది. శాస్త్రవేత్తలు పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు.
కాగా- చందమామ ఉపరితలంపై శాశ్వత ముద్ర వేయనుంది భారత్. ప్రజ్ఞాన్ రోవర్ వీల్స్‌పై మూడు సింహాల లోగోను ముద్రించడమే దీనికి కారణం. అలాగే ఇస్రో లోగో కూడా వాటిపై ప్రింట్ చేశారు. జాబిల్లిపై దిగిన తరువాత రోవర్ సంచరిస్తున్నప్పుడు మూడు సింహాలు, ఇస్రో లోగో ముద్రలు అక్కడి మట్టి, ధూళిపై పడతాయి. అవి శాశ్వతంగా నిలిచిపోతాయి.

ఆ ఉద్దేశంతోనే రోవర్‌లోని చివరి రెండు వీల్స్‌లల్లో ఒకదానిపై మూడు సింహాలు, మరో దానిపై ఇస్రో లోగోను ముద్రించింది. 2019లో ప్రయోగించిన చంద్రయాన్ 2లో వినియోగించిన రోవర్ వీల్స్ పైనా అవే లోగోలను ముద్రించినప్పటికీ.. అది సాధ్యపడలేదు. ఆ ప్రయోగం విఫలమైంది.












Click it and Unblock the Notifications