Chandrayaan 3 landing: జాబిల్లిపై ఇక ఏం జరగబోతోంది: వచ్చే మూడు గంటల్లో..?!
బెంగళూరు: నిరీక్షణ ఫలించింది. కోట్లాదిమంది భారతీయుల పూజలు ఫలించాయి. చందమామ చేతికి అందింది. జాబిల్లిపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. భారత్.. నింగిని జయించింది. ఇస్రో చేపట్టిన చంద్ర మండల యాత్ర- విజయ తీరాలకు చేరింది. దిగ్విజయమైంది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ఈ సాయంత్రం 6:04 నిమిషాలకు జాబిల్లి మీద అడుగు మోపింది.
చంద్రుడి ఆర్బిటర్ నుంచి ఒక్కో దశలో కిందికి దిగింది చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యుల్ విక్రమ్. అవరోహణ క్రమంలో కిందికి దిగుతూ వచ్చింది. అప్పటివరకు అండాకారంలో పరిభ్రమిస్తూ వచ్చిన విక్రమ్ ల్యాండర్.. చంద్రుడి ఉపరితలానికి సమీపించిన వెంటనే వర్టికల్‌గా మారింది. నిట్టనిలువుకు చేరుకుంది. అక్కడే సగం విజయం సాధించినట్టయింది.

అనంతరం ఒక్కో దశను అధిగమిస్తూ క్రమంగా చంద్రుడి ఉపరితలంపై అడుగు మోపింది. దీనితో- అప్పటివరకు పిన్ డ్రాప్ సైలెంట్‌గా కనిపించిన ఇస్రో మిషన్ కాంప్లెక్స్ మొత్తం హర్షధ్వానాలతో మారుమోగిపోయింది. శాస్త్రవేత్తలు పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. ఆలింగనం చేసుకున్నారు. భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ప్రయోగం సక్సెస్ అయినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు.
ఇక చంద్రుడిపై ఏం జరగబోతోంది?, విక్రమ్ ల్యాండర్.. చందమామ దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ తరువాత ఇస్రో ఏం చేయబోతోంది?, వాట్ నెక్స్ట్ అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతోన్నాయి. దీని తరువాత చంద్రయాన్ 3 ఎలాంటి పరీక్షలను జరుపుతుంది?, చంద్రుడి నుంచి ఎలాంటి డేటాను సేకరిస్తుంది? అనేది చర్చనీయాంశమౌతోంది.

విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి రోవర్ బయటికి రావాల్సి ఉంది. దీనికి ఇస్రో పెట్టిన పేరు.. ప్రజ్ఞాన్. ఈ ప్రజ్ఞాన్ ఇప్పటికప్పుడే ల్యాండర్ మాడ్యుల్ నుంచి బయటకి రాదు. కొంత సమయం తీసుకుంటుంది. దీనికి కారణం లేకపోలేదు. ల్యాండర్ ల్యాండ్ అయిన తరువాత ఎగిసిన ధూళి- మొత్తం అణగిపోయేంత వరకూ అది బయటికి రాదు.
దీనికోసం మూడు గంటల సమయాన్ని తీసుకుంటుంది రోవర్. ధూళి వల్ల రోవర్ డ్యామేజ్ కాకూడదనే ఉద్దేశంతోనే ఇస్రో శాస్త్రవేత్తలు ఈ జాగ్రత్త తీసుకున్నారు. ల్యాండ్ అయిన వెంటనే రోవర్ కిందికి దిగడం వల్ల ధూళి కణాలు దానిపై ప్రభావం చూపొచ్చని అంచనా వేశారు. ల్యాండ్ అయిన మూడు గంటల తరువాత రోవర్ కిందికి దిగేలా ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications