భారత్‌పై చైనా ‘వాటర్ బాంబ్’.. ‘రివర్స్’ చేస్తున్న ఇండియా
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకి బాగా దగ్గర్లో, టిబెట్‌లోని బ్రహ్మపుత్ర నదిపై (టిబెట్‌లో దీన్ని యార్లంగ్ త్సాంగ్‌పో అంటారు) చైనా ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. దాదాపు రూ. 14 లక్షల కోట్లకు పైగా భారీ ఖర్చుతో కడుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే, ఏకంగా 60,000 మెగావాట్లకు పైగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతానికి ప్రపంచంలోనే పెద్దదైన చైనాలోని 'త్రీ గోర్జెస్ డ్యామ్' కంటే ఇది దాదాపు 3 రెట్లు పెద్దది. ఈ నది భారత్‌లోకి వచ్చే ముందు 'గ్రేట్ బెండ్' అనే ప్రాంతంలో ఉండే ప్రవాహ వేగాన్ని వాడుకుంటూ, అక్కడ వరుసగా 5 డ్యామ్‌లను కట్టి, ఆ కరెంట్‌ను తన దేశంలోని తూర్పు పారిశ్రామిక ప్రాంతాలకు తరలించాలని చైనా చూస్తోంది.
భౌగోళికంగా ప్రమాదం
అయితే, ఈ ప్రాజెక్టు కడుతున్న ప్రాంతం పర్యావరణపరంగా, భౌగోళికంగా చాలా ప్రమాదకరమైనదని చైనా శాస్త్రవేత్తలే హెచ్చరిస్తున్నారు. భూతాపం వల్ల టిబెట్ పీఠభూమి వేగంగా వేడెక్కుతోందని, దీనివల్ల మంచు వేగంగా కరిగి నీటి ప్రవాహంలో హఠాత్తుగా మార్పులు వస్తున్నాయని చెప్పారు. బ్రహ్మపుత్ర ప్రవాహంలో వచ్చే ఈ మార్పుల వల్ల భారత్, బంగ్లాదేశ్‌లలో కరవు లేదా వరదలు రావచ్చు. ఇప్పటికే ఇలా మంచు కరగడం వల్ల వచ్చిన ఆకస్మిక వరదలకు నేపాల్, టిబెట్‌లలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

భూకంపాలు వస్తాయి
మన సరిహద్దులకు చాలా దగ్గర్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల అరుణాచల్ ప్రదేశ్, అసోం రాష్ట్రాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. ఈ డ్యామ్ కడుతున్న ప్రదేశం కిందే భూకంపాలు వచ్చే పగులు రేఖ ఉంది. అక్కడ ఏమాత్రం పెద్ద భూకంపం వచ్చినా లేదా కొండచరియలు విరిగిపడి డ్యామ్ దెబ్బతిన్నా, కొద్ది నిమిషాల్లోనే ఆ నీళ్లన్నీ అరుణాచల్ ప్రదేశ్, అసోంలను ముంచెత్తుతాయి. అందుకే రక్షణ నిపుణులు దీన్ని భారత్‌పై చైనా తయారు చేస్తున్న "వాటర్ బాంబ్" గా అభివర్ణిస్తున్నారు.
భారీ వరదలు సృష్టిస్తాయి
దీంతో పాటు బ్రహ్మపుత్ర నీటి ప్రవాహం పూర్తిగా చైనా చేతుల్లోకి వెళ్తుంది. ఎప్పుడైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు వచ్చినా, యుద్ధం లాంటి పరిస్థితులు ఏర్పడినా చైనా దీన్ని ఒక ఆయుధంగా వాడుకోవచ్చు. నీళ్లను ఆపేసి మన వైపు కరవు తేవచ్చు, లేదా ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒకేసారి నీటిని వదిలేసి భారీ వరదలు సృష్టించవచ్చు. పైగా డ్యామ్‌ల వల్ల నది తెచ్చే సారవంతమైన మట్టి ఎగువనే ఆగిపోయి, అసోం, అరుణాచల్ ప్రదేశ్ లోని వ్యవసాయ నేలలు సారం కోల్పోతాయి. తాగడానికి నీళ్లు తగ్గడంతో పాటు చేపల సంపద, పర్యావరణం దెబ్బతింటాయి.
సియాంగ్ ప్రాజెక్ట్
ఈ 'వాటర్ బాంబ్' ముప్పు నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి భారత ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు చేపడుతోంది. చైనా ఒకేసారి నీళ్లను వదిలినా ఆ వరదను తట్టుకుని నిల్వ చేయడానికి, ఒకవేళ చైనా నీళ్లను ఆపేస్తే దిగువ ప్రాంతాలకు నీటి కొరత రాకుండా చూసుకోవడానికి అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ నదిపై 'సియాంగ్ అప్పర్ మల్టీపర్సస్ ప్రాజెక్ట్' కడుతోంది. 11,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో, భారీగా నీటిని నిల్వ చేసేలా దీన్ని డిజైన్ చేశారు. దీనిపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. తానైతే ప్రాజెక్టు కట్టి భారత్ ను ముంచొచ్చుకానీ, భారత్ మాత్రం తనను తాను కాపాడుకోవడనికి ప్రాజెక్టు కట్టకూడదంట. చైనా ద్వంద్వ వైఖరికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అయితే ఒకప్పటిలా భారత నాయకత్వం ఇప్పుడు లేదు అనే విషయాన్ని కూడా చైనా గ్రహిస్తే చాలంటున్నారు విదేశాంగ నిపుణులు.














Click it and Unblock the Notifications
