కర్ణాటకలో అమాంతం పెరిగిన ఆర్టీసీ బస్ ఛార్జీలు: బీఎంటీసీ బస్సుల్లో కనీస ఫేర్ ఇంత
కర్ణాటకలో ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరిగాయి. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC), బెంగళూరు మెట్రోపాలిటన్ (BMTC) పరిధిలో తిరిగే అన్ని రకాల బస్సుల ఛార్జీలను పెంచింది ప్రభుత్వం. వీటితోపాటు ఈశాన్య కర్ణాటక, నైరుతి కర్ణాటక పరిధిలోని బస్సుల్లో కూడా వీటి రేట్లను పెంచింది. పెరిగిన ఛార్జీలు ఈ అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. మొన్నటికి మొన్న పాల రేట్లను అమాంతం పెంచిన ప్రభుత్వం.. సరిగ్గా నాలుగు రోజులు తిరక్కముందే బస్ ఛార్జీల భారాన్ని మోపింది.
దీంతో నిత్యం బస్సుల్లో ప్రయాణించే లక్షలాది మంది సామాన్యులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. దీనికి సంబంధించిన వివరాలను రవాణా శాఖ మంత్రి బైరాతి సురేష్ వెల్లడించారు. విధాన సౌధలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంధన ధరల పెరుగుదల, రవాణా కార్పొరేషన్లు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం, ఉద్యోగుల జీతాల పెంపు వంటి కారణాల వల్ల ఛార్జీలను సవరించడం అనివార్యమైందని స్పష్టం చేశారు.

బెంగళూరు బీఎంటీసీ సిటీ బస్సుల్లో కనీస ఛార్జీ ప్రస్తుతం రూ. 6 కాగా ఇప్పుడది రూ. 10కి చేరింది. దీనికి అనుగుణంగా స్టేజీ మారే కొద్దీ ఛార్జీలు పెరుగుతాయి. ఆర్డినరీ బస్సుల్లో స్వల్ప దూర ప్రయాణాలపై అదనపు ఛార్జీల భారం తక్కువే అయినప్పటికీ.. సుదూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల ఛార్జీలు గణనీయంగా పెరిగాయి. ఆర్డినరీ సాధారణ బస్సుల్లో రెండు కిలోమీటర్ల వరకు గల ప్రయాణానికి రూ. 4 రూపాయలు పెరిగింది. 2- 4 కిలోమీటర్ల దూరానికి రూ. 6 చొప్పున పెంచింది ప్రభుత్వం.
బెంగళూరు శివార్లలోని నెలమంగల, హోస్కొటే రూట్లలో గరిష్ట ఛార్జీ 35 రూపాయల నుంచి 44 రూపాయలకు చేరింది. ఆనేకల్, దొడ్డబళ్ళాపుర మార్గాల్లో 38 రూపాయలుగా ఉన్న ఛార్జీ రూ. 47, మాగడి, మాలూరు మార్గాల్లో రూ. 46 నుంచి రూ. 57 రూపాయలకు పెరిగింది. బెంగళూరు నుంచి వివిధ జిల్లాలకు వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సు ఛార్జీలలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. బెంగళూరు- కోలార్, బెంగళూరు- తుమకూరు వెళ్లే బస్ ఛార్జీలు 81 రూపాయల నుంచి 100 రూపాయలకు పెరిగాయి.
మండ్య రూట్లో రూ. 110 నుంచి రూ. 136 చెల్లించాల్సి ఉంటుంది. బెంగళూరు- దావణగెరె రూట్ లో ఛార్జీల భారత అధికంగా కనిపించింది. ప్రస్తుతం ఈ రూట్ లో ఉన్న గరిష్ట ఛార్జీ రూ. 317 కాగా.. ఇప్పుడది రూ. 390 కి చేరింది. బెంగళూరు చిక్కమగళూరు రూట్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఈ మార్గంలో బస్ ఛార్జీ రూ. 295 నుంచి రూ. 363 రూపాయలకు పెరిగింది.
మైసూరు- రూ. 160 నుంచి రూ. 197, హాసన్- రూ. 219 నుంచి రూ. 270, శివమొగ్గ- రూ. 340 నుంచి రూ. 419, మంగళూరు- రూ. 423 నుంచి రూ. 521, హుబ్బళ్లి- రూ. 490 నుంచి రూ. 613, బెళగావి- రూ. 603 నుంచి రూ. 742, కలబురగి రూ. 754 నుంచి రూ.928 కి చేరింది. ఇవన్నీ కూడా ఎక్స్ప్రెస్ బస్ ఛార్జీలు మాత్రమే. రాజహంస నాన్ ఏసీతో పాటు పల్లక్కి, అంబారీ ఉత్సవ్, అంబారీ డ్రీమ్, ఐరావత క్లబ్ క్లాస్, ఐరావత క్లబ్ క్లాస్ 2.ఓ వంటి ఏసీ బస్సులను పరిగణనలోకి తీసుకుంటే దూరాన్ని బట్టి ఛార్జీలు మరింత అధికం.
రాష్ట్రంలోని నాలుగు రవాణా సంస్థలు కలిపి మొత్తం 10, 200 కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మంత్రి బైరాతి సురేష్ వెల్లడించింది. దీనికితోడు 9,912.10 కోట్ల రూపాయల ఆర్థిక బాధ్యతలు, బకాయిలు పేరుకుపోయాయి. ప్రస్తుతం డీజిల్ ధర లీటరుకు సగటున 98.13 రూపాయలుగా ఉంది. ఈ ఏడాది మే నుంచి అక్టోబర్ మధ్య కాలంలోనే డీజిల్ ధర లీటరుపై 10.47 రూపాయల వరకు పెరిగింది.
ప్రస్తుతం నాలుగు రవాణా సంస్థలు ఇంధనం కోసం రోజుకు అంచనాగా 15.60 కోట్ల రూపాయలు వెచ్చిస్తుండగా, ఇప్పటికే 1,111.88 కోట్ల రూపాయల ఇంధన బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. వేతనాల సవరణల వల్ల 2016 నుంచి 2026 మధ్య రవాణా సంస్థలపై 6,418.04 కోట్ల రూపాయల అదనపు భారం పడింది.













Click it and Unblock the Notifications
