భారత్ వైపు దూసుకొస్తోన్న 1.5 టన్నుల నాసా స్పేస్ టెలిస్కోప్ శకలాలు: రాడార్ లో హైదరాబాద్
అంతరిక్షంలో సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన స్పేస్ టెలిస్కోప్ నీల్ గేరెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ.. సుదీర్ఘ ప్రయాణానికి తెరపడింది. ఇది భూమి వైపు దూసుకొస్తోంది. దాదాపు 1.5 టన్నుల బరువున్న ఈ టెలిస్కోప్ భూ వాతావరణంలోకి ప్రవేశించిన అనంతరం పేలిపోతుందని, ముక్కలుగా విడిపోతుందని నాసా ధృవీకరించింది. దీని శకలాలు భారత్ పై పడే అవకాశాలు లేకపోలేదని అంచనావేసింది.
2004లో ప్రయోగించిన స్పేస్ అబ్జర్వేటరీ ఇది. తన నిర్దేశిత కాలపరిమితిని దాటిన తర్వాత కూడా దశాబ్దాల పాటు నాసాకు అమూల్యమైన సమాచారాన్ని అందించింది. కీలకమైన డేటానుు సేకరించి గ్రౌండ్ స్టేషన్ కు పంపింది. ఇప్పుడు దాని ప్రయాణం అంతిమ దశకు చేరుకుంది. ఈ టెలిస్కోప్ రీఎంట్రీ జోన్ భూమధ్యరేఖకు ఇరువైపులా 20.6 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉందని నాసా వెల్లడించింది.

ఈ అక్షాంశ పరిధి.. ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా, దక్షిణ అమెరికాతో పాటు భారత్ లోని కొన్ని కీలక ప్రాంతాల మీదుగా విస్తరించిఉంది. ప్రత్యేకించి.. గుజరాత్‌లోని దమన్ నుంచి ఒడిశాలోని కటక్, ఆ నగరానికి దక్షిణంగా ఉన్న ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలు ఈ అక్షాంశ పరిధిలోకి వస్తాయి. దీని పరిధిలో ఉన్నంత మాత్రాన స్పేస్ టెలిస్కోప్ శకలాలు నేరుగా ఆయా నగరాలపైనే పడతాయనడానికి ఎలాంటి గ్యారంటీ లేదు.
1,500 కిలోల బరువున్న ఈ స్పేస్ టెలిస్కోప్ గంటకు కొన్ని కిలోమీటర్ల వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు అక్కడి ఉష్ణోగ్రత వల్ల ఎక్కువ భాగం గాలిలోనే కాలి బూడిదవుతుంది. 100 కిలోల కంటే తక్కువ బరువున్న కొన్ని భారీ పరికరాలు, వస్తువులు మాత్రమే భూమిని తాకే అవకాశం ఉంది.
భూమిపై దాదాపు 70 శాతం భాగం సముద్రాలే కావడం వల్ల ఆ ఉపగ్రహ శకలాలు జనవాసాలపై పడటానికి అతి తక్కువ అవకాశాలు ఉన్నాయని నాసా అంచనావేసింది. సముద్రంలోనే కూలిపోవడానికి 70 శాతానికి పైగా అవకాశం ఉందని అభిప్రాయపడింది. దీనివల్ల మనషులకు గానీ, ఆస్తులకు గానీ ప్రమాదం జరిగే అవకాశం అతి తక్కువగాఉన్నట్లు పేర్కొంది. ఈ స్పేస్ టెలిస్కోప్ కదలికలను శ్రీహరికోటలో ఇస్రోకు చెందిన మల్టీ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ రాడార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.
ఈ స్పేస్ టెలిస్కోప్‌ను మొదట స్విఫ్ట్ గ్యామా-రే బర్స్ట్ ఎక్స్‌ప్లోరర్ పేరుతో 2004 నవంబర్ 20న ప్రయోగించింది నాసా. ప్రారంభంలో దీని కాల వ్యవధిని రెండేళ్లకు మాత్రమే పరిమితం చేసింది. అంతరిక్షంలో దీని పనితీరు అసాధారణంగా ఉండటంతో నాసా దీని సేవలను ఏకంగా 22 ఏళ్ల పాటు పొడిగించింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో స్విఫ్ట్ టెలిస్కోప్ 2,000 కంటే ఎక్కువ గ్యామా రే విస్ఫోటనాలు, 1,400 కంటే ఎక్కువ సూపర్‌నోవాలను పరిశీలించింది. విశ్వం ఆవిర్భావానికి చెందిన డేటాను నాసాకు చేరవేసింది.
సాంకేతిక కారణాల వల్ల టెలిస్కోప్‌ను సురక్షిత కక్ష్యలోకి తీసుకెళ్లడానికి నాసా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించక తప్పట్లేదు. 22 సంవత్సరాల పాటు అంతరిక్ష పరిశోధన రంగంలో తిరుగులేని ముద్ర వేసిన ఈ టెలిస్కోప్ తన ప్రయాణాన్ని ఇలా ముగించడం ఓ ప్రత్యేక ఘట్టంగా నిలిచిపోనుంది.














Click it and Unblock the Notifications
