ఎయిర్ ఇండియా 100 శాతం ప్రైవేటీకరణ- కేంద్రం ప్రకటన- రెండు నెలల్లో పూర్తి
ఎయిర్ ఇండియాపై కేంద్రం అనుకున్నంత పనీ చేసేసింది. దేశంలోనే ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్ధల్లో ఒకటైన ఎయిర్ ఇండియాను అమ్మకానికి పెట్టేసింది. ఇందులో కేంద్రానికి ఉన్న వందశాతం పెట్టుబడులను ఉపసంహరించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఇవాళ ఓ ప్రకటన చేశారు. పెట్టుబడులు ఉపసంహరించాలా లేక మూసివేయాలా అన్న మీమాంసలో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ఎయిర్ ఇండియాలో పెట్టుబడులు ఉపసంహరించాలా వద్దా అనే దాని విషయంలో తాము ఆలోచించలేదని, కేవలం పెట్టుబడులు ఉపసంహరించాలా లేక మూసివేయాలా అన్న దానిపైనే ఆలోచించినట్లు పౌరవిమానయాన మంత్రి హర్దీప్ పూరీ తెలిపారు. ఎయిర్ ఇండియా విలువైన ఆస్తే కానీ, దీనికి రూ.60 వేల కోట్ల అప్పులున్నాయని ఆయన పేర్కొన్నారు. దీన్ని తాము భరించే పరిస్ధితి లేదన్నారు. ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్రం కొత్త డెడ్‌లైన్ ప్రకటిస్తుందని, ఈ మేరకు త్వరలో ఆర్ధిక బిడ్లు ఆహ్వానిస్తామన్నారు.

ఇప్పటికే ఎయిర్ ఇండియాలో కేంద్రం పెట్టుబడులు కొనుగోలు చేసేందుకు కొన్ని సంస్ధలు ముందుకొచ్చాయని, అయితే మొత్తం 64 రోజుల గడువు పెట్టుకున్నామని, ఆ లోపు వచ్చే వారిని ఆహ్వానించి అమ్మకం ప్రక్రియ చేపడతామని హర్దీప్ సింగ్ పూరీ అన్నారు. ఈ మొత్తం ప్రక్రియ మే చివరికి లేదా జూన్‌లో ముగిసే అవకాశం ఉందని పూరీ తెలిపారు. 2007లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను విలీనం చేసుకున్నాక కూడా అప్పులు తీరకపోవడంతో కేంద్రం ప్రైవేటీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. సక్రమ నిర్వహణ లేక రోజుకు రూ.20 కోట్ల నష్టాలు చవిచూస్తున్న సంస్ధను భరించడం తమ వల్ల కాదని హర్దీప్ పూరీ తేల్చిచెప్పారు.












Click it and Unblock the Notifications