అతికష్టం మీద సుప్రీంకోర్టుకు ముగ్గురు మహిళా జడ్డీలు- సదుపాయాల కోసం కార్పోరేషన్-జస్టిస్ రమణ
సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల ప్రాతినిధ్యం అంశం పదే పదే చర్చకు వస్తున్న నేపథ్యంలో ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ మరోసారి ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తాము అతి కష్టం మీద 11 శాతం మంది మహిళా న్యాయమూర్తుల్ని సుప్రీంకోర్టుకు ఎంపిక చేశామని ఆయన చెప్పుకొచ్చారు.
న్యాయవ్యవస్దలోకి రావాలంటే మహిళలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారని, కోర్టుల్లో వారి ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంటోందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ తనను సన్మానించిన సందర్భంగా మాట్లాడిన ఎన్వీ రమణ.. న్యాయవ్యవస్ధలో మహిళల సంఖ్య తక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయన్నారు.

తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం అత్యున్నత న్యాయస్ధానానికి 9 మంది న్యాయమూర్తుల్ని ఎంపిక చేసింది. ఇందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. వీరిలో జస్టిస్ నాగరత్న 2027లో సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు సీజే ఎన్వీ రమణ తెలిపారు. ప్రస్తుతం న్యాయవ్యవస్ధ మౌలిక సదుపాయాలు, సిబ్బంది, పెండింగ్ కేసుల వంటి చాలా సమస్యలు ఎదుర్కొంటోందని రమణ వెల్లడించారు. తాను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే రోజుల్లో మహిళలకు మరుగుదొడ్లు కూడా ఉండేవి కావని, తాను హైకోర్టు యాక్టింగ్ ఛీఫ్ జస్టిస్ అయ్యాక బేస్ మెంట్ లో టాయిలెట్లు పెట్టించానని ఏపీ హైకోర్టులో పనిచేసిన రోజుల్ని జస్టిస్ రమణ గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుతం కోర్టులు బ్రిటీష్ వారు కట్టిన భవంతుల్లోనే పనిచేస్తున్నాయని, అవి పిటిషనర్లకు, లాయర్లకు ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. భారత్ లో జాతీయ న్యాయ మౌలిక సదుపాయాల కార్పోరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జస్టిస్ రమణ తెలిపారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలపై ఓ నివేదిక తయారు చేయాలని ఆదేశించామని, దీన్ని వారం రోజుల్లో న్యాయశాఖమంత్రికి అందజేస్తామన్నారు. దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టుతో పాటు వివిధ హైకోర్టుల్లో ఖాళీలు భర్తీ చేస్తున్నామని, కేంద్రం కూడా వీటికి త్వరగా ఆమోదముద్ర వేయాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications