"దీనికే నా ఎన్నిక చెల్లదా ?"- అదేం కుదరదన్న విజయ్- మద్రాస్ హైకోర్టులో..!
తమిళనాడులో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విజయ్(Vijay).. దీంతో పాటు మరో సీటు పెరంబూర్ నుంచి కూడా విజయం సాధించారు. అయితే తిరుచ్చి ఈస్ట్ లో విజయ్ ఎన్నిక చెల్లదంటూ ఆయన చేతిలో ఓటమిపాలైన డీఎంకే అభ్యర్ధి ఇరుదయరాజ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ పై వివరణ ఇచ్చేందుకు విజయ్ తొలుత ముందుకు రాలేదు. అనంతరం హైకోర్టు డెడ్ లైన్ విధించడంతో ఇవాళ లాయర్ ద్వారా తన వాదన వినిపించారు.
తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్.. తన ప్రచారంలో చిన్న పిల్లల్ని వాడుకున్నారని, ఇది ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ ఇరుదయరాజ్ వాదించారు. కాబట్టి ఈసీ నిబంధనల ప్రకారం తిరుచ్చిలో విజయ్ ఎన్నిక చెల్లదని తీర్పు ఇవ్వాలని మద్రాస్ హైకోర్టును కోరారు. అయితే ఈ వాదనతో విజయ్ విభేధించారు. ఈసీ విధించిన నిబంధన ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం లేదని విజయ్ వాదించారు. తన ఎన్నికల ప్రచారంలో పిల్లలను ఉపయోగించడం అనేది, తిరుచిరాపల్లి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుండి తన విజయాన్ని రద్దు చేయడానికి తగిన కారణం కాదని సీఎం విజయ్ తేల్చిచెప్పారు.

ఇరుదయరాజ్ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌కు ఇచ్చిన సమాధానంలో విజయ్ తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ఖండించారు. పిల్లలకు సంబంధించిన ఆరోపణపై స్పందిస్తూ, ఒకవేళ ఆ ఆరోపణ నిజమని భావించినప్పటికీ, ఎన్నికలను రద్దు చేయడానికి అది చట్టపరంగా నిలబడే కారణం కాదన్నారు. పిల్లల ప్రమేయం వల్ల తనకు ఎన్ని ఓట్లు అదనంగా వచ్చాయనే విషయాన్ని ఎన్నికల పిటిషన్ వివరించలేదని విజయ్ గుర్తుచేశారు. అలాగే ఓటర్లు భావోద్వేగానికి లోనయ్యారని, ఆ ప్రవర్తన ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపిందని మాత్రమే పిటిషనర్ పేర్కొన్నారని విజయ్ వాదించారు. అలాగే ఎన్నికల ఖర్చుపై ఇరుదయరాజ్ దాఖలు చేసిన పిటిషన్ అంకెలపై ఆధారపడి ఉందని, ఆ డబ్బును ఎవరు ఖర్చు చేశారు, ఎప్పుడు చెల్లించారు లేదా అతను గానీ అతని ఎన్నికల ఏజెంట్ గానీ దానికి అధికారం ఇచ్చారా అనే విషయాలు లేవన్నారు. విజయ్ ప్రచారంలోకి విదేశీ నిధులు వాడారంటూ ఎన్నికల పిటిషన్‌లో పేర్కొన్నప్పటికీ, పిటిషనర్ ఏ దాతను, మొత్తాన్ని, గ్రహీతను, బ్యాంకు ఖాతాను లేదా బదిలీ విధానాన్ని గుర్తించలేదని విజయ్ పేర్కొన్నారు. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 31కు వాయిదా పడింది.














Click it and Unblock the Notifications