మాజీప్రధాని రాజీవ్ గాంధీని హతమార్చిన దోషి విడుదలకు మీరు సహకరిస్తారా? కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్!!
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా తేలిన 3దశాబ్దాలకుపైగా జైలు శిక్ష అనుభవించిన ఏజీ పేరారివాలన్‌ను విడుదల చేయాలనే సుప్రీంకోర్టు నిర్ణయం పట్ల దేశం విచారం వ్యక్తం చేస్తోందని, దేశం నిరాశ చెందిందని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం వ్యక్తం చేసింది. రాజీవ్ గాంధీ హత్యా దోషి విడుదలను కాంగ్రెస్ ఖండించింది.
మాజీ ప్రధాని హత్యకేసులో దోషులుగా తేలిన వారిని ఇలా విడుదల చేస్తే చట్టానికి ఎవ్వరు భయపడతారు అని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు ఆయన ప్రభుత్వం ఈరోజు సమాధానం చెప్పాలని రణదీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. ఇదేనా మీ ద్వంద్వ వైఖరి అంటూ మండిపడ్డారు. ఉగ్రవాదంపై తీవ్ర స్థాయిలో మీరు చెబుతున్న మాటల ఆంతర్యం ఇదేనా అంటూ విరుచుకుపడ్డారు.

ఈ దేశ మాజీ ప్రధానిని హతమార్చిన ఉగ్రవాదులు, హంతకుల విడుదలకు మీరు సహకరిస్తారా? అంటూ ప్రశ్నించారు. మౌనం మీ సమ్మతమేనా? అంటూ సూర్జేవాలా నిలదీశారు. గత ఏఐఏడీఎంకే నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం సెప్టెంబర్ 9, 2018న ఖైదీల విడుదలకు సిఫార్సు చేసిందని, కేంద్ర మంత్రి మండలికి సలహా ఇచ్చిన గవర్నర్ మరియు భారత రాష్ట్రపతి ఆలోచన లేకుండా వ్యవహరించడం వల్ల ఖైదీలందరి విడుదలకు మార్గం సుగమమైందని కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా అసహనం వ్యక్తం చేశారు.
మాజీ ప్రధానిపై ప్రస్తుత ప్రభుత్వానికి విద్వేష ధోరణి ఉన్నందున మాజీ ప్రధానిని హత్య చేసిన వారిని జైలు నుంచి బయటకు రావడానికి అనుమతిస్తే అది ప్రజాస్వామ్యానికి మరియు రాజ్యాంగానికి మంచిది కాదని కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ హంతకుడిని విడుదల చేసిన దినం దుర్దినమని కాంగ్రెస్ పార్టీ నేత రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో కోట్లాది మంది భారతీయుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ దేశంలో చట్టబద్ధత, సమగ్రతను ఎవరు నిలబెడతారు అంటూ ఆయన ప్రశ్నించారు.